న్యూఢిల్లీ: ఉగ్రవాద సంస్థలు గత నాలుగేళ్లలో జమ్ముకశ్మీర్ లోని స్థానిక యువకులు 700 మందిని రిక్రూట్ చేసుకున్నాయని, 141 మంది ఉగ్రవాదుల్లోని మెజార్టీ సంఖ్యలో విదేశీయులున్నారని, వారే ప్రస్తుతం చురుకుగా కార్యకలాపాలు సాగిస్తున్నారని అధికార వర్గాలు పేర్కొన్నాయి. జమ్ముకశ్మీర్‌లో ఇంత భారీ సంఖ్యలో ఉగ్రవాదులు ఉండడం సరిహద్దుల్లో ఆగని చొరబాటుకు సంకేతమని అధికార వర్గాలు వ్యాఖ్యానించాయి. కేంద్ర హోంమంత్రి వ్యవహారాల గణాంకాల ప్రకారం ఈనెల 5 వ తేదీ నాటికి 82 విదేశీ ఉగ్రవాదులు జమ్ముకశ్మీర్‌లో కార్యకలాపాలు సాగిస్తున్నారని, స్థానిక ఉగ్రవాదులు 59 మంది వరకు ఉన్నారని తేలింది. వీరంతా లష్కరే ఇ తొయిబా, జైషే మొహ్మద్, హిజుబుల్ ముజాహిద్దీన్, తదితర ఉగ్రవాద సంస్థలకు చెందినవారు. అయితే ఎన్‌కౌంటర్లలో 123 మంది ఉగ్రవాదులు పట్టుబడ్డారు. ఈ ఏడాది ఇంతవరకు 55 ఎన్‌కౌంటర్లు జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్లలో 91 మంది స్థానికులు కాగా, 34 మంది విదేశీయులు. ఉగ్రవాద సంఘటనల్లో ఈ ఏడాది భద్రతా సిబ్బంది ఇద్దరు ప్రాణాలు కోల్పోగా, 23 మంది గాయపడ్డారు. 20 మంది పౌరులు హతమయ్యారు.
700 Kashmir youth Recruited by Terror Groups