Thursday, January 23, 2025

భివాండీ చేనేత మగ్గం బంద్

- Advertisement -
- Advertisement -

థానే : మహారాష్ట్రలోని బిజెపియుత త్రిబుల్ ఇంజిన్ ప్రభుత్వ హయాంలో చేనేత రంగం చతికిలపడింది. చేతిమగ్గాలకు ప్రఖ్యాతమైన భివాండీ పట్టణంలో పవర్‌లూమ్ వృత్తిదారులు వచ్చే నెల 1 (నవంబర్ 1) నుంచి సంపూర్ణ హర్తాళ్‌కు దిగనున్నారు. తమ మరమగ్గాల సంబంధిత పరిశ్రమల సుదీర్ఘ సమస్యలు ఎంతో కాలం నుంచి అపరిష్కృతంగా ఉంటున్నాయని డిమాండ్ల సాధనకు 1 వ తేదీ నుంచి 20 వ తేదీ వరకూ తాము పూర్తి స్థాయిలో చేనేత మగ్గాలను బంద్ చేయనున్నట్లు శనివారం ప్రకటించారు. తమ డిమాండ్లపై ప్రభుత్వం దృష్టిసారించాల్సి ఉంది. ఇందుకు సంపూర్ణ హర్తాళ్ మార్గమని నిర్ణయించినట్లు పవర్‌లూమ్ ఓనర్స్ సంఘం ప్రతినిధి నరేష్ సంచేటి తెలిపారు. శనివారం దాదాపు 700 మంది పవర్‌లూమ్ ఓనర్లు థానేలో సమావేశం అయ్యారు. తమ పరిశ్రమ అనేక దైనందిన సమస్యలతో కొట్టుమిట్టాడుతోంది. అవసరం అయిన నూలు ధరలు , పలు రకాల పన్నులు, భరించలేని స్థాయి విద్యుత్ ఛార్జీల మోతలతో చేనేత మగ్గాల పరిస్థితి అగమ్యగోచరం అయిందని , కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఫలితం లేదని సంఘం తెలిపింది.

బంద్‌కు దిగడం ద్వారా తమ బాధను జాతీయ స్థాయిలో తెలియచేయడం జరుగుతుందని, ఇదే తాము ఎంచుకున్న మార్గమని నరేష్ ప్రకటించారు. భివాండీలో ఇప్పటి దయనీయ స్థితికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరే కారణం అని చేనేత మగ్గాల నిర్వాహకులు నిరసన వ్యక్తం చేశారు. భివాండీ చేనేత పరిశ్రమకు పట్టుగొమ్మ అయ్యి, ఓ దశలో మాంఛెస్టర్ ఆఫ్ ఇండియాగా పేరొందిందని , ఇప్పుడు అంతా తల్లకిందులు అయిందని తెలిపారు. ఇక్కడి మగ్గాలలో వివిధ రాష్ట్రాలకు చెందిన వారు దాదాపు ఐదులక్షల మందివరకూ పనిచేస్తున్నారు. తమ హర్తాళ్ దశలో వీరికి పని ఉండదు, కూలీ డబ్బులు దక్కవని, వీరంతా పస్తులు ఉండాల్సి వస్తుందని, దీనికి కారణం ఎవ్వరని ప్రశ్నించారు. ఇక్కడ మొత్తం 15 లక్షల పవర్‌లూమ్స్ ఉండేవి. అయితే పలు కారణాలతో ఇప్పుడు పదిలక్షల వరకూ పనిచేస్తున్నాయి. 20 రోజుల సమ్మె ప్రభావంతో పవర్‌లూమ్‌లకు చెందిన దాదాపు 20000 మంది ఓనర్ల మరమగ్గాలు నిలిచిపోతాయి. సంబంధిత రవాణా పరిశ్రమ కూడా దెబ్బతింటుందని సంఘం తెలిపింది. ఇక పనులు నిలిచిపోవడంతో నూలుపై ప్రభుత్వానికి వచ్చే 12 శాతం జిఎస్‌టి కూడా 20 రోజులు ఆగిపోతుందని , మరి ఇంత జరుగుతున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవా? అని సంఘం నిలదీసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News