శ్రీనగర్: ఆరు రోజుల్లో ఏడుగురు పౌరులను హత్యగావించిన సంఘటనలకు సంబంధించి దాదాపు 700మందిని అరెస్ట్ చేశామని జమ్మూకాశ్మీర్ పోలీసులు తెలిపారు. హత్యకు గురైనవారిలో ఓ కాశ్మీరీ పండిట్, ఓ సిక్కు, కొందరు ముస్లింలున్నారు. అరెస్టయినవారికి నిషేధిత ఉగ్రవాద సంస్థ జమాత్‌ఇఇస్లామీతో సంబంధాలున్నాయని లేదా ఆ సంస్థ సానుభూతిపరులని ఓ పోలీస్ అధికారి తెలిపారు. వీరంతా శ్రీనగర్,బుద్గాం, దక్షిణ కాశ్మీర్‌లోని ఇతర ప్రాంతాలకు చెందినవారని ఆయన తెలిపారు. అఫ్ఘానిస్థాన్‌లో తాలిబన్లు అధికారం చేపట్టిన తర్వాత కాశ్మీర్‌లో భయోత్పాతాన్ని సృష్టించే లక్షంలో ఈ దాడులు జరిగినట్టు ఆయన తెలిపారు. సులభ లక్షాలను ఉగ్రవాదులు ఎంచుకున్నారని ఆయన అన్నారు. పౌరులపై వరుస ఉగ్రదాడులపై ప్రతిపక్షాల నుంచి విమర్శలొచ్చాయి. భద్రత కల్పించడంలో ప్రభుత్వ వైఫల్యాన్ని వారు ప్రశ్నించారు. ఇప్పటికే కాశ్మీరీ పండిట్లు చాలావరకు లోయను వదిలి ఇతర ప్రాంతాల్లోని శరణార్థి శిబిరాల్లో తలదాచుకుంటున్నారు. ఇటీవల ఇద్దరు ఉపాధ్యాయులను ఉగ్రవాదులు హత్యగావించారు. వారిలో ఒకరు హిందువు కాగా, మరొకరు సిక్కు.