Monday, December 23, 2024

70,665 ఇంజనీరింగ్ సీట్ల కేటాయింపు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : రాష్ట్రంలో ఇంజనీరింగ్ సీట్లు కేటాయింపు ప్రక్రియ పూర్తయ్యింది. మొదటి విడతలో 85.48 శాతం సీట్లు కేటాయించారు. రాష్ట్రంలో కన్వీనర్ కోటా కింద మొత్తం 82,666 సీట్లు అందుబాటులోకి ఉండగా, 70,665 సీట్ల కేటాయింపు జరిగింది. మొదటి దశ సీట్ల కేటాయింపు తర్వాత 12,001 ఇంజనీరింగ్ సీట్లు ఖాళీగా మిగిలాయి. ఈసారి మొత్తం 173 కాలేజీల్లో 82,666 ఇంజనీరింగ్ సీట్లు అందుబాటులో ఉండగా, 70,665 సీట్లు (85.48 శాతం) కేటాయించారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 16 యూనివర్సిటీ కళాశాలల్లో అందుబాటులో ఉన్న 5,174 సీట్లకు 4,406 సీట్లు (85.12 శాతం) కేటాయించగా, 770 సీట్లు ఖాళీగా మిగిలాయి.

రెండు ప్రైవేట్ యూనివర్సిటీలలో 1,497 సీట్లు అందుబాటులో ఉండగా, 1,124 సీట్లు(75.08 శాతం) కేటాయించగా, 373 సీట్లు ఖాళీగా మిగిలాయి. 155 ప్రైవేట్ కళాశాలల్లో 75,993 సీట్లు అందుబాటులో ఉండగా, 65,135 సీట్లు కేటాయించారు. ప్రైవేట్ కళాశాలల్లో 10,858 సీట్లు మిగిలిపోయాయి. తొలివిడత కౌన్సెలింగ్‌లో 5,043 మంది విద్యార్థులు ఆప్షన్లు ఇచ్చినా వారికి ఏ కాలేజీలోనూ సీటు రాలేదు. తొలివిడత కౌన్సెలింగ్ ద్వారా మిగిలిపోయిన సీట్లను రెండో విడత కౌన్సెలింగ్ ద్వారా భర్తీ చేస్తారు. రాష్ట్రంలో ఇంజనీరింగ్ కౌన్సెలింగ్‌లో ఇడబ్లూఎస్ కోటా కింద 5,108 సీట్లు కేటాయించారు.

రికార్డు స్థాయిలో 50,44,634 ఆప్షన్లు నమోదు
ఈ విద్యాసంవత్సరం రికార్డు స్థాయిలో 50,44,634 వెబ్ ఆప్షన్లు నమోదయ్యాయి. ఏటా సుమారు 25 లక్షల నుంచి 30 లక్షల మంది వెబ్ ఆప్షన్లు నమోదవుతుండగా, ఈ సారి మాత్రం దాదాపు 20 లక్షల ఆప్షన్లు అధికంగా నమోదయ్యాయి. అంటే విద్యార్థులు ఈసారి ఎక్కువ ఛాయిస్ ఇస్తూ ఆప్షన్లు నమోదు చేసుకున్నట్లు అర్థమవుతోంది. ఈ విద్యాసంవత్సరం మొత్తం 76,821 మంది విద్యార్థులు సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు హాజరుకాగా, అందులో 75,708 వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకున్నారు.

31 కాలేజీల్లో 100 శాతం సీట్లు భర్తీ
ఇంజనీరింగ్ కాలేజీల్లో సీట్ల కేటాయింపు రాష్ట్రంలో 31 కాలేజీల్లో 100 శాతం సీట్లు కేటాయించారు.అందులో మూడు యూనివర్సిటీల్లో 100 సీట్లకు కేటాయింపులు జరుగగా, 28 ప్రైవేట్ కాలేజీల్లో 100 సీట్లు భర్తీ అయ్యాయి.

అత్యధికంగా కంప్యూటర్ సైన్స్ అనుబంధ కోర్సులకు మొగ్గు
మొదటి విడత ఇంజనీరింగ్ సీట్ల కేటాయింపులో కంప్యూటర్ సైన్స్, ఐటి అనుబంధ బ్రాంచీలకే విద్యార్థులు అత్యధికంగా వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకున్నారు. కంప్యూటర్ సైన్స్, ఐటి అనుబంధ బ్రాంచీల్లో 94.20 శాతం సీట్లు కేటాయించగా, ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ కోర్సుల్లో 78.70 శాతం సీట్లు కేటాయించారు. ఈసారి సివిల్, మెకానికల్, అలైడ్ ఇంజనీరింగ్ బ్రాంచీలపై విద్యార్థులు ఆసక్తి కనబరచలేదు. ఈ కోర్సుల అనుబంధ బ్రాంచీల్లో 44.09 శాతం సీట్లకు కేటాయింపులు జరుగగా, 50 శాతానికి పైగా సీట్లు ఖాళీగా మిగిలాయి. అలాగే ఇతర ఇంజనీరింగ్ బ్రాంచీలైన మైనింగ్, కెమికల్, ఫుడ్ టెక్నాలజి, టెక్స్‌టైల్ టెక్నాలజి, బిల్డింగ్ సర్వీసెస్ ఇంజనీరింగ్, ఫార్మసుటికల్ ఇంజనీరింగ్, అగ్రికల్చర్ ఇంజనీరింగ్, బయో టెక్నాలజీ, డెయిరీయింగ్ తదితర కోర్సులలో 63.03 శాతం సీట్లు కేటాయించారు.

ఈ కోర్సుల్లో 100 శాతం కేటాయింపు
ఇంజనీరింగ్ తొలి విడత కౌన్సెలింగ్‌లో పలు బ్రాంచీల్లో వంద శాతం సీట్లు కేటాయించారు. ఇందులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కంప్యూటర్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ అంఢ్ బిజినెస్ సిస్టమ్, సిఎస్‌ఇ(సైబర్ సెక్యూరిటీ), సిఎస్‌ఇ(ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్), బయో మెడికల్, ఇసిఐ, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలీ మ్యాటిక్స్, మెటలర్జికల్, బి.టెక్ మెకానికల్ విత్ ఎం.టెక్ మానుఫ్యాక్షరింగ్ సిస్టమ్, బి.టెక్ మెకానికల్ విత్ ఎం.టెక్ థర్మల్ ఇంజనీరింగ్,ఎరోనాటికల్ ఇంజనీరింగ్, మెడికానికల్ ఇంజనీరింగ్ బ్రాంచీల్లో వంద శాతం సీట్లు కేటాయించారు.
సెల్ఫ్ రిపోర్టింగ్ తప్పనిసరి
ఇంజనీరింగ్ కౌన్సెలింగ్‌లో కన్వీనర్ కోటాలో సీటు పొందిన అభ్యర్థులు తప్పనిసరిగా వెబ్‌సైట్ ద్వారా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి. సీట్లు పొందిన విద్యార్థులు ఈ నెల 22వ తేదీలోగా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి. అలా చేయని అభ్యర్థుల సీటు కేటాయింపు రద్దువుతుంది. తర్వాత విడత కౌన్సిలింగ్‌లో ఆ సీటు ఖాళీగా ఉన్నట్లుగా పరిగణిస్తారు. ప్రస్తుతం ఖాళీగా ఉన్న సీట్లతో పాటు, సీటు పొంది కళాశాలల్లో ప్రవేశం తీసుకోని అభ్యర్థుల వివరాలు సేకరించిన తర్వాత మొత్తం సీట్లకు రెండో దశ కౌన్సిలింగ్ నిర్వహిస్తారు.

సెల్ఫ్ రిపోర్టింగ్ ఇలా..
ఇంజినీరింగ్ సీట్లు పొందిన విద్యార్థులు వెబ్‌సైట్ నుంచి అలాట్‌మెంట్ ఆర్డర్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. అలాట్‌మెంట్ ఆర్డర్‌లో పేర్కొన్న ఫీజును క్రెడిట్ కార్డు లేదా డెబిట్ కార్డు లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా ఆన్‌లైన్‌లో చెల్లించాలి. ఆ తర్వాత సీటు కన్ఫర్మేషన్ అవుతుంది. అయితే ట్యూషన్ ఫీజు చెల్లించే విద్యార్థులు.. వారి తల్లిదండ్రుల ఖాతా నుంచి చెల్లిస్తే మంచిదని అధికారులు సూచించారు. ఎందుకంటే.. రీఫండ్ చేసేందుకు సులభంగా ఉంటుందని తెలిపారు. ఈ నెల 22వ తేదీ లోపు ఫీజు చెల్లించి, సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి. తుది విడత కౌన్సెలింగ్ ముగిసిన తర్వాత సంబంధిత కాలేజీల్లో విద్యార్థులు ఆగస్టు 9 నుంచి 11వ తేదీ మధ్యలో రిపోర్టు చేయాల్సి ఉంటుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News