న్యూఢిల్లీ: ప్రపంచ పర్యావరణ దినం 2023(జూన్ 5) సందర్భంగా మిస్ వరల్డ్ నిర్వాహక చైర్మన్ జూలియా మోరే, మిస్ వరల్డ్ 2022 విజేత కరోలినా బీలావస్క ఢిల్లీని సందర్శించారు. వారు పర్యావరణం, ప్రకృతి, ఆరోగ్యంకు సంబంధించి మహిళలకు మార్గదర్శకత్వం నెరిపారు. కొన్ని రోజుల తర్వాతా ఆ అతిథులు నేడు(జూన్ 8న) విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఓ ప్రత్యేక ప్రకటన చేశారు. మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్స్ చైర్మన్ జూలియా మోరే 71వ మిస్ వరల్డ్ 2023 పోటీకి భారత్ ఆతిథ్యం ఇవ్వనుందన్నారు.
మిస్ వరల్డ్ 2023లో 130కి పైగా దేశాల నుంచి అందగత్తెలు పోటీ చేయనున్నారు. ఈ పోటీలో వారు తమ అందంతో పాటు, తెలివి, ప్రతిభ, కారుణ్యం వంటి గుణాలను కూడా చూపనున్నారు. అందాల పోటీ ఫైనల్‌కు వెళ్లే లోగా అనేక రౌండ్ల పోటీ ఉంటుంది. చివరికి ఫైనల్స్‌కు వెళ్లే వారిని వడబోస్తారు. నవంబర్ లేక డిసెంబర్ 2023లో గ్రాండ్ ఫైనల్ ఉండనున్నది. గతంలో మన దేశానికి చెందిన ప్రియాంక చోప్రా, ఐశ్వర్య రాయ్ బచన్, యుక్తా ముఖీ, సుస్మితా సేన్ తదితరులు ప్రపంచ స్థాయిలో ఈ పోటీల్లో గెలుపొందారు. రాబోయే మిస్ వరల్డ్ 2023లో సిని శెట్టిపై చాలా మంది అభిమానులకు ఆశలున్నాయి.