ఓటెత్తారు.. అయిదు రాష్ట్రాల్లో భారీ పోలింగ్
అన్ని చోట్లా 70 శాతానికి పైగానే ఓటు హక్కు వినియోగించుకున్న ఓటర్లు
అసోంలో అత్యధికంగా 82 శాతానికి పైగా పోలింగ్
నాలుగు రాష్ట్రాల్లో ముగిసిన పోలింగ్ ప్రక్రియ, బెంగాల్‌లో మూడు విడతలు పూర్తి
తమిళనాడు, కేరళలో ఓటేసిన సినీ, రాజకీయ ప్రముఖులు
న్యూఢిల్లీ: నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి మంగళవారం జరిగిన ఎన్నికలు చెదురుమదురు ఘటనలు మినహా మొత్తం మీద ప్రశాంతంగా ముగిశాయి. మండే ఎండలను సైతం లెక్క చేయకుండా ఓటర్లు ఉదయంనుంచే పోలింగ్ కేంద్రాలకు పోటెత్తారు. అందరూ కొవిడ్ నిబంధనలు పాటిస్తూ ఓటేయడం విశేషం. ఈ క్రమంలో అన్ని చోట్లా భారీ పోలింగ్ నమోదైంది. ఈశాన్య రాష్ట్రమైన అసోంలో అత్యధిక పోలింగ్ నమోదు తమిళనాడులో 234, కేరళలో 130, పుదుచ్చేరిలో 30 అసెంబ్లీ స్థానాలకు మంగళవారం ఒకే విడతలో పోలింగ్ జరిగింది. అసోంలో 40 అసెంబ్లీ స్థానాల్లో మూడో విడత పోలింగ్ జరగ్గా, పశ్చిమ బెంగాల్‌లో 31స్థానాలో మూడో విడత పోలింగ్ జరిగింది. మంగళవారంతో అసోం, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిలలో ఎన్నికలు ముగియగా, పశ్చిమ బెంగాల్‌లో మాత్రం ఇంకా ఎన్నికలు ముగియలేదు. పశ్చిమ బెంగాల్లో మొత్తం 8 విడతల్లో ఎన్నికలు జరగనుండగా మంగళవారంతో మూడు విడతలు ముగిసాయి. ఏప్రిల్ 10,17,22,26,29 తేదీల్లో మిగతా విడతల పోలింగ్ జరగనుంది. అసెంబ్లీ ఎన్నికలతో పాటుగా తమిళనాడులోని కన్యాకుమారి, కేరళలోని మలప్పురం లోక్‌సభ స్థానాలకు కూడా మంగళవారం ఎన్నికలు జరిగాయి. ఎన్నికల కమిషన్‌కు అందిన ప్రాథమిక సమాచారం ప్రకారం అసోంలో 82.33 శాతం, కేరళలో 74 శాతం, తమిళనాడులో 71.19 శాతం. పశ్చిమ బెంగాల్‌లో 77.68 శాతం, కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో 81.36 శాతం పోలింగ్ జరిగింది.
ఓటేసిన ప్రముఖులు
తమిళనాడులో మొత్తం 234 స్థానాలకుగాను 3,998మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఓటర్లు వారి భవిష్యత్తును ఇవిఎంలలో నిక్షిప్తం చేశారు. పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు ఉత్సాహంగా వచ్చి ఓటు వేశారు. డిఎంకె ఎంపి కనిమొళి పిపిఇ కిట్ ధరించి వచ్చి చెన్నైలోని పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. డిఎంకె అధ్యక్షుడు ఎంకె స్టాలిన్, భార్య, కుమారుడితో కలిసి ఓటేశారు. సూపర్ స్టార్ రజనీకాంత్ తేనాంపేటలోని పోలింగ్ కేంద్రంలో ఓటేశారు. ప్రముఖ సినీ నటుడు విజయ్ సైకిల్‌పై వచ్చి ఓటేశారు. సినీ నటి త్రిష చెన్నైలోని ఆళ్వార్‌పేట పోలింగ్ కేంద్రంలో ఓటేశారు. కేరళలలో ప్రముఖ నటుడు మమ్ముట్టి, నటి కీర్తి సురేశ్, ప్రముఖ క్రీడాకారిణి పిటి ఉష, కాంగ్రెస్ ఎంపి శశి థరూర్ తదితరులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పుదుచ్చేరిలో తొలి సారి ఓటు హక్కు పొందిన యువతీ యువకులు ఉత్సాహంగా పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు.
బెంగాల్‌లో ఉద్రిక్తతలు
పశ్చిమ బెంగాల్‌లో మూడో విడత పోలింగ్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.ఉలుబెరియాలోని టిఎంసి నేత ఇంట్లో ఇవిఎం, వివిప్యాట్‌లను గుర్తించడం కలకలం రేపింది. ఈ ఘటనలో ఎన్నికల అధికారిని ఇసి సస్పెండ్ చేసింది. అలాగే సిలిగురిలోని ఓకిరాణా దుకాణంలో అయిదు బబాంబులను స్వాధీనం చేసుకున్న పోలీసులు ఈ ఘటనలో ఐదుగురిని అరెస్టు చేశారు. మరోవైపు టిఎంసి ఆరంబాగ్ మహిళా అభ్యర్థిపై పోలింగ్ కేంద్రం వద్ద దాడి జరిగింది. బిజెపి కార్యకర్తలే ఈ దాడి చేశారని టిఎంసి ఎంపి ఒబ్రియాన్ ఆరోపించారు.
ఖుష్బూపై డిఎంకె ఫిర్యాదు
బిజెపి అభ్యర్థి, సినీ నటి ఖుష్బూ సుందర్‌పై డిఎంకె నేతలు ఇసికి ఫిర్యాదు చేశారు. ఓటు వేసేందుకు వెళ్లినప్పుడు బిజెపి జెండా ఉన్న వాహనంలో పోలింగ్ కేంద్రానికి వెళ్లారని వారు ఆరోపించారు. ఎన్నికల నియమావళి ప్రకారంపోలింగ్ జరుగుతున్న ప్రాంతాలకు పార్టీ జెండాలతో వెళ్లకూడదని తెలిపారు. చెన్నైలోని థౌజంగ్ లైట్స్ నియోజక వర్గంనుంచి ఖుష్బూ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.
మధ్యాహ్నానికే దాదాపు 50 శాతం పోలింగ్
అన్ని ప్రాంతాల్లోను మధ్యాహ్నం ఒంటి గంట సమయానికే దాదాపు 50 శాతం ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మధ్యాహ్నమయితే ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడం ఒక కారణమైతే ఓటు వేయడానికి ఓటర్లు చూపించిన ఉత్సాహం కూడా మరో కారణమని చెప్పవచ్చు.
71 percent polling in TN Assembly Election