- Advertisement -
న్యూఢిల్లీ : దేశంలో కరోనా కొత్త కేసుల నమోదులో కాస్త హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. మంగళవారం 15 లక్షల మందికి కరోనా పరీక్షలు చేయగా, 71,365 మందిలో వైరస్ బయటపడింది. ముందురోజు కంటే కేసులు 5.5 శాతం అధికంగా వెలుగు చూశాయి. అయితే పాజిటివిటీ రేటు 5 శాతం దిగువకు చేరి 4.5 శాతానికి తగ్గటం ఊరటనిస్తోంది. మంగళవారం ఒక్క రోజే 1,72,211మంది కరోనా నుంచి కోలుకున్నారు. 24 గంటల వ్యవధిలో 1217 మరణాలు సంభవించాయి. అందులో 824 కేరళ నుంచి వచ్చినవే. మంగళవారం వరకు దేశంలో 170.8 కోట్ల టీకా డోసుల్ని పంపిణీ చేసినట్టు కేంద్రం వెల్లడించింది. మంగళవారం 53.6 లక్షల మంది టీకా తీసుకున్నారు. 15 నుంచి 18 ఏళ్ల మధ్యవయసు వారిలో 5 కోట్ల మంది మొదటి డోసు తీసుకున్నారు. యువత టీకా తీసుకునే విషయంలో ముందుకు రావడంపై కేంద్ర ఆరోగ్యమంత్రి మన్‌సుఖ్ మాండవీయ హర్షం వెలిబుచ్చారు.
- Advertisement -