వైద్య సిబ్బందిని అభినందించిన మంత్రి హరీశ్‌రావు
హైదరాబాద్: రాష్ట్రంలో జూలై నెలలో ప్రభుత్వ ఆసుపత్రి డెలివరీలు 72.8 శాతం నమోదు కావడం పట్ల ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆసుపత్రుల చరిత్రలో ఇది సరికొత్త రికార్డ్‌ని ఇందుకు కృషి చేసిన వైద్య సిబ్బందిని మంత్రి అభినందించాచి శుభాకాంక్షలు తెలిపారు. వైద్యారోగ్య శాఖ పరిధిలోని వివిధ ఆరోగ్య కార్యక్రమాల అమలు, పనితీరుపై మంత్రి హరీశ్ రావు గురువారం సమీక్ష నిర్వహించారు. వీసీ ద్వారా జరిగిన సమీక్షలో హెల్త్ సెక్రెటరీ రిజ్వి, సీఎం ఓఎస్డీ గంగాధర్ అన్ని జిల్లాల వైద్యాధికారులు, ప్రోగ్రాం ఆఫీసర్లు పాల్గొన్నారు. ఈ సందర్బంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ తెలంగాణ ఏర్పాటుకు ముందు 30 శాతం డెలివరీలు జరిగితే, ప్రస్తుతం 73 శాతానికి చేరడం సీఎం కేసీఆర్ మార్గనిర్దేశనలో వైద్యారోగ్య శాఖ చేస్తున్న పనితీరుకు, పురోగతికి నిదర్శనం అన్నారు.
ప్రభుత్వ ఆసుపత్రుల్లో పెరుగుతున్న డెలివరీలు, ప్రభుత్వ ఆసుపత్రులపై పెరుగుతున్న ప్రజల విశ్వాసానికి, నమ్మకానికి మంచి ఉదాహరణలు అన్నారు. అత్యధికంగా నారాయణ్ పేట జిల్లాలో 86.9 శాతం, మెదక్ 83.5 శాతం, జోగులాంబ గద్వాల్ 81.1 శాతం డెలివరీలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో జరగటం అభినందనీయమన్నారు. ప్రభుత్వ ఆసుపత్రి డెలివరీలు తక్కువగా నమోదు అవుతున్న వరంగల్, హన్మకొండ, సూర్యాపేట, నిర్మల్ జిల్లాల్లో ఫలితాలు మెరుగు పడాలని ఆదేశించారు. రాష్ట్ర సగటు కంటే తక్కువ నమోదు అవుతున్న జిల్లాలపై వైద్యాధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. రాష్ట్రంలో మొదటి మూడు స్థానాల్లో నిలిచిన జోగులాంబ గద్వాల్, మెదక్, నాగర్ కర్నూల్ జిల్లాలలు ఉండటంతో అభినందించారు. చివరి స్థానంలో ఉన్న హన్మకొండ, మహబూబాబాద్, కామారెడ్డి జిల్లాలో పనితీరు మెరుగు పడాలని ఆదేశించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఏర్పాటు చేసిన టిఫా స్కానింగ్ మిషన్లతో గర్భిణులకు ఎంతో మేలు అవుతుందని 43 ఆసుపత్రుల్లో, ఏర్పాటు చేసిన 56 టిఫాల ద్వారా 32 వేల స్కాన్లు చేయడం అభినందనీయమన్నారు. ప్రతి గర్భిణికి ఒక్క రూపాయి ఖర్చు లేకుండా పరీక్షలు, వైద్యం పూర్తి ఉచితంగా అందించాలానే ప్రభుత్వ లక్ష్యం వల్ల ఎంతో మందికి ప్రయోజనం కలుగుతున్నదన్నారు.
ప్రభుత్వ ఆసుపత్రుల్లో డెలివరీలకు గాను గత ఏడాది కాలంలో కోటి 60 లక్షలు వైద్య సిబ్బందికి టీం బేస్డ్ ఇన్సెంటివ్ రూపంలో ఇచ్చినట్లు చెప్పారు. బిడ్డకు మొదటి గంటలో తల్లి పాలు అందించడం, సాధారణ ప్రసవాలపై కౌన్సిలింగ్ నిర్వహించడం వంటివి చేయాలన్నారు. మహిళల సమగ్ర అరోగ్య సంరక్షణకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చిన సీఎం కేసీఆర్, అరోగ్య మహిళ కార్యక్రమం ప్రారంభించారని చెప్పారు. ప్రతి మంగళవారం సేవలు అందించాలన్నారు. జిల్లా, మండల మహిళా సమాఖ్య సమావేశాల్లో అరోగ్య మహిళ కార్యక్రమం గురించి వివరించాలని, ప్రచారం కల్పించాలని జిల్లా వైద్యాధికారులను మంత్రి ఆదేశించారు. వ్యాక్సినేషన్ విషయంలో మొదటి మూడు స్థానాల్లో నిలిచిన కరీంనగర్, మెదక్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలను మంత్రి అభినందించారు. హన్మకొండ, మంచిర్యాల, ఖమ్మం జిల్లాల్లో పనితీరు మెరుగు పడాలని ఆదేశించారు. వ్యాక్సినేషన్ విషయంలో తెలంగాణ దేశంలో నెంబర్ 1 స్థానంలో ఉండేలా అందరం కలిసి కృషి చేయాలన్నారు.
హుజూరాబాద్ ఏరియా ఆసుపత్రి, మల్కాజ్ గిరి జిల్లా ఆసుపత్రుల్లో సిద్దంగా ఉన్న ఎస్‌ఎన్‌సియూలను, ఏరియా ఆసుపత్రి పటాన్ చెరు, హుజూర్ నగర్, సిహెచ్సి మక్తల్, దుబ్బాక, ఘట్ కేసర్, చిట్యాలలో సిద్దంగా ఉన్న ఎన్‌బిఎస్‌యూలను, ఏటూరునాగారం, అమ్రాబాద్ సిహెచ్ ఆసుపత్రుల్లో సిద్దంగా ఉన్న ఎన్‌ఆర్‌సి కేంద్రాలను వారం, పది రోజుల్లో ప్రారంభించాలని ఆదేశించారు. రాష్ట్రంలోని 18 ఎస్‌ఎన్‌సియూలను అనుసంధానం చేస్తూ, నిలోఫర్ ఆసుపత్రిలో జూన్ నెలలో ఏర్పాటు చేసిన సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్ పనితీరు గురించి మంత్రి సమీక్షించారు. 24 గంటల పాటు సేవలు అందించి, నవజాత శిశు అరోగ్య సంరక్షణకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. కాంబినేషన్ డ్రగ్స్ కూడా ప్రభుత్వం సరఫరా చేస్తున్న నేపథ్యంలో అవసరమైన వారికి అందేలా చూడాలన్నారు. బీపీ, షుగర్ మందులు ప్రజలకు క్షేత్ర స్థాయిలో అందుతున్నాయా లేదా అని తెలుసుకునేందుకు గ్రామ స్థాయిలో జిల్లా వైద్యాధికారులు, డిప్యూటీ డిఎంహెచ్వోలు, ప్రోగ్రాం ఆఫీసర్లు సందర్శించాలన్నారు.
పాలియేటివ్ కేర్ సేవల గురించి ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. నిజామాబాద్, సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రుల్లో క్యాత్ ల్యాబ్ పనులు త్వరగా పూర్తి చేయాలన్నారు. ఉస్మానియా, నిమ్స్, ఎంజీఎం, గాంధీ సహా ఇతర ఆసుపత్రులకు అనుసంధానం చేసి అందిస్తున్న ఎస్‌టిఈఎంఐ సేవలు ఎక్కువ మందికి అందేలా చూడాలన్నారు.
ప్రాథమిక వైద్యాన్ని తక్షణం అందించేందుకు బస్తీ దవాఖానలు ప్రారంభించాలని ఎక్కువ మందికి వైద్య సేవలు అందించేందుకు కృషి చేయాలన్నారు. ఉచిత పరీక్షలు నిర్వహించి, క్వాలిటీ వైద్య సేవలు అందించి ప్రజల మన్ననలు పొందాలన్నారు. తెలంగాణ డయాగ్నొస్టిక్ ద్వారా అందిస్తున్న 134 రకాల పరీక్షలు ప్రజలకు అందాలని కచ్చితంగా 24 గంటల్లోగా పరీక్షల ఫలితాలు అందించేలా చూడాలన్నారు. జగిత్యాల, మహబూబాబాద్ జిల్లాల్లో తెలంగాణ డయాగ్నొస్టిక్ సేవలు తక్కువగా ఉండటం మంత్రి హరీశ్ అసంతృప్తి వ్యక్తం చేసి వచ్చేనెల నాటికి పురోగతి కనిపించాలని జిల్లా అధికారులకు సూచించారు. మూడు వేలకు పైగా ఉన్న పల్లె దవాఖానలు గ్రామీణ స్థాయిలో ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేయాలన్నారు. దవాఖానల వారీగా అందుతున్న సేవల పట్ల వైద్యాధికారులు పరిశీలించాలన్నారు. కనీసం 25 కంటే ఓపీ తగ్గకుండా చూడాలన్నారు.
నేషనల్ క్వాలిటీ అసురెన్స్ కార్యక్రమంలో తెలంగాణ మూడో స్థానంలో నిలవడం పట్ల మంత్రి సంతోషం వ్యక్తం చేశారు, మొదటి స్థానానికి చేరేందుకు కృషి చేయాలన్నారు. రాష్ట్ర స్థాయి అసెస్మెంట్ త్వరగా పూర్తి చేసి, కొత్తగా లక్ష్యం ఏర్పాటు చేసుకున్న 697 ఆసుపత్రులకు ఎన్‌క్యూఎఎస్ గుర్తింపు వచ్చేలా చేయాలన్నారు.
అన్ని జిల్లాల్లోని ఆసుపత్రుల్లో ఫ్యామిలీ ప్లానింగ్ సర్జరీలు నిర్వహించాలని, ఇన్ఫెక్షన్ కంట్రోల్ విషయంలో అన్ని ఆసుపత్రుల్లో ప్రత్యేక శ్రద్ద వహించాలని ఆదేశించారు. వర్షాలు తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో సీజనల్ వ్యాధుల విషయంలో సంసిద్ధతతో ఉండాలన్నారు. పంచాయతీ రాజ్, మున్సిపల్ శాఖల అధికారుల సమన్వయంతో అవసరమైన చర్యలు తీసుకోవాలని, ఈ మేరకు సమన్వయ సమావేశం నిర్వహించాలని హెల్త్ సెక్రెటరీనీ మంత్రి ఆదేశించారు. కళ్ళ కలక విషయంలో ప్రజలు ఆందోళన చెందకుండా జిల్లా వైద్యాధికారులు ప్రజలకు అవగాహన కల్పించాలనీ, అవసరం ఉన్నవారికి వైద్యం అందేలా చూడాలని ఆదేశించారు.