ఇండోర్: రామాయణ మహాకావ్యం ఆధారంగా ప్రపంచవ్యాప్తంగా రూపొందిన వందలాది స్టాంపులను 72 ఏళ్ల ఇండోర్ వాసి సేకరించారు. వాటిని పోస్టల్ శాఖ ప్రదర్శనగా ఏర్పాటుచేసింది. గత 60 ఏళ్లుగా స్టాంపులను సేకరిస్తున్నట్లు మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో నివసించే ఓం ప్రకాష్ కేడియా తెలిపారు. రామాయణం ఇతివృత్తంపై వివిధ దేశాలు విడుదల చేసిన స్టాంపలను గత రెండు, మూడేళ్లుగా సేకరిస్తున్నానని ఆయన తెలిపారు. భారతీయ స్టాంపులు కాకుండా ఇండోనేషియా, నేపాల్, మయన్మార్, థౠయ్‌ల్యాండ్, కాంబోడియా దేశాలు విడుదల చేసిన స్టాంపులు ఉన్నాయి. ఆగ్నేయాసియా దేశాలలో రామాయణ కథ చాలా పేరుపొందిందని, అక్కడ వేర్వేరు విధాలుగా ఆ కథను చెప్పడం జరిగిందని కేడియా తెలిపారు. శ్రీరాముడు, సీతాదేవి, లక్ష్మణుడు, భరతుడు, హనుమంతుడు, జటాయువు తదితర పాత్రలకు సంబంధించిన ఘట్టాలపై ఆయా దేశాలు స్టాంపులు విడుదల చేసినట్లు ఆయన వివరించారు.
బ్రిటిష్ పాలనలో రామాయణానికి సంబంధించిన సన్నివేశాలను భారతీయులు పోస్టు కార్డుపై ముద్రించేవారని, అవి కూడా తన సేకరణలో ఉన్నాయని ఆయన తెలిపారు. 2018లో ఆసియన్-ఇండియా మైత్రి రజతోత్సవ సదస్సు సందర్భంగా జారీచేసిన ప్రత్యేక పోస్టల్ స్టాంపులు కూడా తన సేకరణలో ఉన్నాయని ఆయన చెప్పారు. కేడియా సేకరించిన స్టాంపుల ఆధారంగా పోస్టల్ శాఖ ఏర్పాటు చేసిన ప్రదర్శన జనవరి 22 వరకు కొనసాగుతుంది. అయోధ్యలో జనవరి 22న జరగనున్న రామాలయ ప్రాణ ప్రతిష్టాపన మహోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ స్టాంపుల ప్రదర్శన ప్రజలను విశేషంగా ఆకట్టుకుంటోంది. జనవరి 22న స్టాంపుల ప్రదర్శన ముగింపు నాడు అయోధ్య రామాలయంపై ప్రత్యేక కవర్‌ను విడుదల చేయనున్నట్లు ఇండోర్ రేంజ్ పోస్టుమాస్టర్ జనరల్ ప్రీతి అగర్వాల్ వెల్లడించారు.