న్యూయార్క్: ఐక్యరాజ్య సమితి సాధారణ సభ 1948 డిసెంబర్ 10న విశ్వమానవ హక్కుల ప్రకటన చేసింది. అప్పటి నుంచి డిసెంబర్ 10వ తేదీని అంతర్జాతీయ మానవహక్కుల దినంగా ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నారు. మానవ హక్కుల ఉల్లంఘనకు సంబంధించిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించడం కోసం కోర్టులతో పాటు మానవ హక్కుల కమిషన్‌లు ఏర్పాటు చేశారు. ఈ సంవత్సరం (2022) మానవ హక్కుల దినోత్సవం థీమ్ “గౌరవం(డిగ్నిటీ), స్వేచ్ఛ(ఫ్రీడమ్), అందరికీ న్యాయం(జస్టిస్ ఫర్ ఆల్)”. ఈ సంవత్సరం విశ్వమానవ హక్కుల ప్రకటన ఆమోదించిన(యూడిహెచ్‌ఆర్) 74వ వార్షికోత్సవం, 72వ మానవ హక్కుల దినోత్సవం జరుపుకుంటున్నాం.
మానవులకు ఉన్న హక్కుల గురించి తెలియజెప్పేందుకే ఈ మానవ హక్కుల దినోత్సవం జరుపుకుంటున్నాం. మానవ హక్కుల్లో ఆరోగ్య , ఆర్థిక, సామాజిక, విద్యా హక్కులు కూడా ఉన్నాయి. మానవ ప్రకృతిసిద్ధమైన హక్కులే ప్రాథమిక హక్కులు. వాటిని తెగ, కులం, జాతీయత, మతం, లింగం తదితరాల ఆధారంగా అణచివేయడం, వంచించడం జరుగకూడదు.
ఐక్యరాజ్యసమితి సాధారణ సభ 423(v) తీర్మానాన్ని ఆమోదించిన తర్వాత మానవ హక్కుల దినోత్సవంను లాంఛనంగా 1950లో ఆరంభించారు. గత కొన్ని దశాబ్దాలుగా మానవ హక్కుల దినోత్సవం వివక్ష(డిస్క్రిమినేషన్), వైవిధ్యం(డైవర్సిటీ), విద్య, స్వేచ్ఛ, పేదరికం, చిత్రవద(టార్చర్), సమానత్వం వంటి అంశాలను తీసుకుంది.
భారత్‌లో మానవ హక్కుల చట్టం 28 సెప్టెంబర్ 1993లో అమలులోకి వచ్చింది. ఆ తర్వాత ప్రభుత్వం జాతీయ మానవ హక్కుల సంఘంను 12 అక్టోబర్ 1993లో ఏర్పాటు చేసింది. మానవ హక్కుల సంఘం రాజకీయం, ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక రంగాలలో కూడా పనిచేస్తుంది. మానవ హక్కుల సంఘం చేసే కృషి వల్ల చాలా మందికి తమ హక్కుల గురించి తెలుస్తున్నాయి. భారత్‌లో మానవ హక్కుల సంఘం ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది. దాని ప్రస్తుత కార్యనిర్వాహక అధికారి(ఎగ్జిక్యూటివ్) అరుణ్ కుమార్ మిశ్రా.