న్యూఢిల్లీ: కేంద్రప్రభుత్వ సర్వీసుల్లో ఉన్నమహిళా, ఒంటరి పురుష ఉద్యోగులకు కేంద్రం శుభవార్త చెప్పింది. పిల్లల సంరక్షణ నిమిత్తం ఏకంగా 730 రోజులు సెలవులకు అర్హులని స్పష్టం చేసింది. ఈ మేరకు కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ బుధవారం లోక్‌సభకు లిఖితపూర్వకంగా వెల్లడించారు. ‘సివిల్ సర్వీసులు, కేంద్ర వ్యవహారాలతో సంబంధమున్న శాఖలు, విభాగాల్లో నియమించబడ్డ ప్రభుత్వ మహిళా,
ఒంటరి పురుష ఉద్యోగులు తమ పిల్లల సంరక్షణ సెలవులకు అర్హులు. సెంట్రల్ సివిల్ సర్వీసెస్ రూల్స్, 1972లోని రూల్ 43-సి ప్రకారం ఉద్యోగులకు సెలవులు లభిస్తాయి. ఉద్యోగులు తమ పూర్తికాల సర్వీసులో గరిష్ఠంగా 730 రోజులు సెలవులకు అర్హులు. ఈ విషయంలో జీవించి ఉన్న ఇద్దరు పెద్ద పిల్లల వయసు 18 ఏళ్ల వరకు, అంగవైకల్యమున్న పిల్లల విషయంలో వయసుకు పరిమితలేదు” అని మంత్రి జితేంద్ర సింగ్ పార్లమెంట్‌కు వివరించారు.