Saturday, November 23, 2024

తీవ్ర ఉష్ణోగ్రతలతో తీరని ముప్పు

- Advertisement -
- Advertisement -

740000 deaths annually in India due to Stroke

హరిత వాయువుల (గ్రీన్‌హౌస్ గ్యాసెస్) ప్రభావం, సహజ ప్రకృతి వాతావరణాన్ని ఎంత వికృతంగా మార్చుతుందో దాని వల్ల ఎలాంటి వైపరీత్యాలు ఎదురవుతున్నాయో ఇటీవల మనం ఎన్నో అనుభవిస్తున్నాం. కార్బన్ డైయాక్సైడ్, నైట్రొజన్ ఆక్సైడ్‌లు, క్లోరోఫ్లోరో కార్బన్లు, హైడ్రో కార్బన్లు, మిథేన్ తదితర వాయువులన్నిటినీ గ్రీన్‌హౌస్ గ్యాస్‌లు అంటే భూమిని వేడెక్కించే వాయువులని 1827లో ఫ్రెంచి శాస్త్రవేత్త బ్యాప్టి స్టు ఫోరియర్ నిర్వచించారు. ఈ హరిత వాయువుల ప్రభావంతో భూగోళం రానురాను వేడెక్కుతోంది. శీతోష్ణస్థితిలో అనేక మార్పులు వస్తున్నాయి. సమస్త జీవరాశులపై తీవ్ర ప్రభావం కనిపిస్తోంది. భూగోళం ఇలా వేడెక్కడం కొనసాగుతుంటే పర్యావరణం ఛిద్రమై పోతుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. 2100 సంవత్సరం నాటికి 1.4 నుంచి 5.8 సెల్సియస్ డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పెరగవచ్చని, ఫలితంగా మానవ జీవితం దుర్భరమౌతుందని అంచనా వేస్తున్నారు. 1991 2018 మధ్య కాలంలో సంభవించిన మరణాల్లో మూడో వంతు కన్నా ఎక్కువ శాతం మరణాలు అత్యధిక వేడి కారణం గానే సంభవించాయని, దీనివెనుక మానవ కల్పిత చర్యలతో పెరిగిన భూతాపం ప్రభావం ఉందని తాజా అధ్యయనం వెల్లడించింది. మొత్తం 43 దేశాల లోని 732 ప్రాంతాల నుంచి సేకరించిన డేటా అధారంగా లండన్ స్కూల్ ఆఫ్ హైజీని అండ్ ట్రాపికల్ మెడిసిన్ (ఎల్‌ఎస్‌హెచ్ టిఎం), యూనివర్శిటీ ఆఫ్ బెర్న్ వివిగ్(మల్టీ కంట్రీమల్టీసిరిఎంసిసి)కొలాబొరేటివ్ రీసెర్చి నెట్ వర్క్ సంయుక్తంగా ఈ అధ్యయనం చేపట్టాయి. మొత్తం మీద ఇటీవల వేసవి కాలంలో సంభవించిన మరణాల్లో 37 శాతం వేడి వల్లనే జరిగాయని విశ్లేషించారు. అమెరికా లోని ఈక్విడార్, లేదా కొలంబియా వంటి చోట ఈ ప్రభావం 76 శాతం వరకు , ఆగ్నేయాసియాలో 45 నుంచి 61 శాతం వరకు కనిపిస్తోంది.
అమెరికా ఇటీవల కాలంలో ఎన్నడూ లేనంతగా అసాధారణ వేసవిని ఎదుర్కొంటోంది. ఈ శతాబ్దం అంతానికి ఎక్కడైనా 2.7 డిగ్రీల ఫారన్ హీట్ (1.5 డిగ్రీల సెంటిగ్రేడ్) నుంచి 5.4 డిగ్రీల ఫారన్‌హీట్ (3 డిగ్రీల సెంటిగ్రేడ్) మధ్య ఉష్ణోగ్రతలు అమాంతంగా పెరిగే ప్రమాదం కనిపిస్తోందని నేషనల్ ఓషియోనిక్ అండ్ అట్మాస్ఫియర్ అడ్మినిస్ట్రేషన్ విశ్లేషించింది.
ఉత్తర అమెరికాలో ఇటీవల అంటే జూన్‌లో భరించలేని ఉష్ణ తరంగం విస్తరించి వేడి గోపురాన్ని మిగిల్చింది. 2016, 2019, 2020, తరువాత నాలుగో అత్యధిక వేడి నెలగా 2021 జూన్ రికార్డుకెక్కింది. అదే విధంగా 2012 జూన్ నాటి కన్నా 2021 జూన్‌లో ఉపరితల సరాసరి ఉష్ణోగ్రత 0.25 డిగ్రీల ఫారన్ హీట్ గా నమోదైంది. నైరుతి అమెరికా, వాయువ్య కెనడాల కన్నా ఉత్తర అమెరికాలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు కొనసాగుతున్నాయి. ఇటీవల కాలం వరకు నైరుతి అమెరికాలో వాతావరణ మార్పు వల్ల తరచుగా దావానలం చెలరేగి దేవదారు అడవులు భస్మీపటలం కావడం అనుభవైక్యమే. వృక్ష సంపదే కాదు, కాలిఫోర్నియా అడవులు దావాగ్నితో దహించుకు పోతున్నాయి. వన్యప్రాణ కోటి పూర్తిగా తుడుచుపెట్టుకుపోతోంది. పర్యావరణ వ్యవస్థలు దెబ్బతింటున్నాయి. అకాల వర్షాలు, వరదలు సంభవిస్తున్నాయి. పదివేలు, ఇరవై వేల సంవత్సరాల తరువాత రావలసిన వాతావరణ మార్పులన్నీ వంద, రెండొందల ఏళ్లలోనే దాపురించేటట్టు ఉందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.
వందల ప్రాణాలు బలి
2021జూన్ జులై మధ్యకాలంలో వాయువ్య ఫసిఫిక్, కెనడా ప్రాంతాల్లో వేడిని తట్టుకోలేక కొన్ని వందల మంది ప్రాణాలు కోల్పోయారు. వాషింగ్టన్ లోని కింగ్‌కౌంటీలో 63 మంది, మల్ష్‌నొమా కౌంటీ నుంచి 45 మంది, సీటెల్‌లో 12 మంది, చనిపోయారు. మొత్తం మీద కనీసం 486 మందైనా వారం రోజుల్లో చనిపోయి ఉంటారని బ్రిటిష్ కొలంబియా చీఫ్ అంచనా వేస్తున్నారు. భరించలేని వేడిని శరీరం తట్టుకోలేక పోవడమే ఈ మరణాలకు కారణంగా మల్టీనోమా కౌంటీ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ జెన్నిఫర్ నికిన్ వెల్లడించారు. ఈ పరిస్థితిని హైపర్ థెర్మియా అంటారు.
2000 నుంచి 2019 మధ్యకాలంలో ప్రపంచం మొత్తం మీద మరణాల రేటు, ఉష్ణోగ్రతల డేటాను పరిశీలించగా దశాబ్దానికి 0.26 సెల్సియస్ డిగ్రీల వంతున పెరిగినట్టు గుర్తించారు. ప్రపంచం మొత్తం మీద అతి శీతల, అత్యధిక ఉష్ణోగ్రతల ఫలితంగా ఏటా మరణాలు 9.43 శాతం వంతున పెరుగుతున్నాయని తేలింది. ప్రపంచం మొత్తం మీద సంభవిస్తున్న ఈ మరణాల్లో సగం కన్నా ఎక్కువ ఆసియా లోనే ముఖ్యంగా తూర్పు, దక్షిణాసియా లోనే కనిపిస్తున్నాయి. ఐరోపాలో అత్యధిక ఉష్ణోగ్రతల వల్ల ప్రతి 1,00,000 మందికి అదనంగా మరణాల సంఖ్య పెరుగుతుండగా, సబ్ సహరాన్ ఆఫ్రికాలో ప్రతి 1,00,000 మందికి అత్యధిక శీతలం వల్ల అదనంగా మరణాలు సంభవిస్తున్నాయి. ఇదివరకు అధ్యయనాలు ఉష్ణోగ్రతల సంబంధిత మరణాలను ఒక దేశం లేదా ప్రాంతానికే పరిమితం చేశాయి. ప్రపంచ వ్యాప్తంగా సరైనకాని ఉష్ణోగ్రతల వల్ల సంభవించిన మరణాలను 2000 నుంచి 2019 మధ్యకాలంలో అధ్యయనం చేసే మొదటి నివేదిక ఇదే. పారిశ్రామిక యుగం ముందు నుంచి ఇప్పటివరకు ఇదే అత్యంత ఉష్ణోగ్రతల కాలం అని పరిశోధకులు వివరించారు.
భారత్ ఏటా 7,40,000 మరణాలు
ఇక భారత దేశంలో అసాధారణ వాతావరణ మార్పుల వల్ల 2100 నాటికి ఏటా 15 లక్షల మంది ప్రాణాలు కోల్పోవలసి వస్తుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం అత్యధిక ఉష్ణోగ్రతలతోపాటు అతిశీతల వాతావరణం వల్ల భారత్‌లో ఏటా దాదాపు 7,40,000 మరణాలు సంభవిస్తున్నాయని లాన్సెట్ అధ్యయనం వెల్లడించింది. ఆస్ట్రేలియా లోని మొనాష్ యూనివర్శిటీ పరిశోధకులు ఈ అధ్యయనం నిర్వహించారు. ఏటా అతి శీతల వాతావరణంతో 6,55,400 మరణాలు సంభవిస్తుండగా, అత్యధిక ఉష్ణోగ్రతల వల్ల 83,700 మరణాలు సంభవిస్తున్నాయని విశ్లేషించారు.
తీర ప్రాంతాలకు ఉప్పెన ముప్పు
భూతాపం, కక్షలో చంద్రుని గమనంలో మార్పులు ఒకదానికొకటి పరస్పర ప్రభావంతో సముద్ర మట్టాలు పెరిగి, కెరటాలు ఉవ్వెత్తున లేచి ఉప్పెనకు దారి తీస్తాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. పర్యావరణ మార్పులతోపాటు చంద్రుడి అస్థిర చలనం కారణంగా సముద్ర మట్టాలు పెరుగుతాయని, నాసా పరిశోధకులు వెల్లడించారు. 2030 వ దశకం మధ్యలో అమెరికా లోని తీర ప్రాంత నగరాలు ముంపునకు గురవుతాయని వివరించారు. ఇప్పటికే అ్యత్యధిక ఆటుపోట్లు వల్ల కొన్ని నగరాలు వరదల్లో చిక్కుకున్నాయని తెలిపారు. సముద్ర మట్టాలు పెరుగుతాయని, కెరటాలు ఊహించని ఎత్తులో లేచి తీర ప్రాంతాలను తుడిచిపెడతాయని నాసా ముందస్తు హెచ్చరిక చేస్తోంది. ఈ విపరీతం 2030 లో ప్రారంభమై, అమెరికా కోస్తా తీరం లోని బోస్టన్, అజోలియా, కాలిఫోర్నియా, సెయింట్ పీటర్స్ బర్గ్, ఫ్లోరిడా, హోనోలు జల ప్రళయానికి గురవుతాయని నాసా హెచ్చరించింది. మిగతా దేశాలపై కూడా ఈ ప్రభావం ఉంటుందని పేర్కొంది. ఈ నేపథ్యంలో అమెరికా కోస్తా తీరంలో కెరటాల ఎత్తును కొలవడానికి వాటి ముప్పును అంచనా వేయడానికి ఉపయోగపడే 89 స్థలాలను ఎంపిక చేశారు. కెరటాలు ఉవ్వెత్తున లేచి వరదలు ముంచుకొచ్చిన సంఘటనలు 2019 లో 600 కన్నా ఎక్కువ సంభవించాయని నేషనల్ ఓషియోనిక్, అట్మాస్ఫియరిక్ అడ్మినిస్ట్రేషన్ వెల్లడించింది.ఇలాంటివి జరిగితే రోడ్లు, మౌలిక సదుపాయాలు తీవ్రంగా దెబ్బతింటాయి. ఇలాంటి సంఘటనలు పశ్చిమ గల్ఫ్‌లో ఆగ్నేయాసియాలో కూడా ఎక్కువగా సంభవించాయి. 2030 నాటికి సముద్ర మట్టాలు 4 అడుగులు (1.2 మీటర్లు ) పెరిగే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. షాంఘై నుంచి లండన్ వరకు ఉన్న నగరాలకు ఈ సముద్ర మట్టాల పెరుగుదల ముప్పు ఉంటుందని హెచ్చరిస్తున్నారు. ఈ విధమైన వైపరీత్యాలకు భూతాపమే మూలం. వాతావరణం లోను, సముద్రాల్లోను ఉష్ణోగ్రతలు పెరగకుండా రాబోయే శతాబ్ద కాలంలో భూతాపాన్ని 2 డిగ్రీల సెల్సియస్‌కు మించకుండా జాగ్రత్త పడేలా దేశాలన్నీ 2015 లో కుదిరిన పారిస్ ఒప్పందం దిశగా ముందుకు సాగవలసిన అవసరం ఉంది.

కె. యాదగిరి రెడ్డి, 9866789511

740000 deaths annually in India due to Stroke

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News