Thursday, January 23, 2025

భక్తులకు సౌకర్యవంతంగా శ్రీవారి దర్శనం

- Advertisement -
- Advertisement -

ప్రపంచస్థాయి ప్రమాణాలతో ఎస్వీ మ్యూజియం అభివృద్ధి

నూతన టెక్నాలజీతో అధిక సంఖ్యలో నాణ్యమైన శ్రీవారి లడ్డూల తయారీ

తిరుమలలో గణతంత్ర వేడుకల్లో టిటిడి ఈఓ శ్రీ ఎవి.ధర్మారెడ్డి

దేశ విదేశాల నుండి తిరుమలకు విచ్చేస్తున్న భక్తులకు సౌకర్యవంతంగా శ్రీవారి దర్శనం కల్పించేందుకు కల్పిస్తున్నామని ఇందుకు కృషి చేస్తున్న అధికారులకు సిబ్బందికి అభినందనలు తెలియజేస్తున్నానని టిటిడి ఈఓ శ్రీ ఏవి. ధర్మారెడ్డి తెలిపారు. తిరుమలలో అదనపు ఈఓ కార్యాలయమైన గోకులం విశ్రాంతి గృహం ఆవరణలో గురువారం 74వ గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈఓ శ్రీ ఏవి. ధర్మారెడ్డి జాతీయ జెండాను ఎగురవేసి భద్రతా సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరించారు.

అనంతరం ఈవో ప్రసంగిస్తూ కోవిడ్ అనంతరం మొదటిసారిగా శ్రీవారి బ్రహ్మోత్సవాలను మాడ వీధుల్లో భక్తుల మధ్య నిర్వహించామని చెప్పారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఎక్కువ సమయం క్యూలైన్లలో భక్తులు వేచి ఉండకుండా రోజుకు 70 వేలకు పైగా టైమ్ స్లాట్ టోకెన్లు జారీ చేసి భక్తులకు సౌకర్యవంతమైన దర్శనం కల్పించామని తెలిపారు. వెంగమాంబ అన్నప్రసాదం కేంద్రానికి భక్తుల సంఖ్య భారీగా పెరుగుతుండడంతో ఛైర్మన్ శ్రీ వైవి.సుబ్బారెడ్డి ఆదేశాల మేరకు జనవరి 1న పిఎసి-4 (పాత అన్నదానం కాంప్లెక్స్‌)లో అన్నప్రసాద వితరణ పున:ప్రారంభించామన్నారు. శ్రీవారి మెట్టు మార్గంలో కాలినడకన వచ్చే భక్తుల కోసం త్వరలో ఎమ్‌బిసితో పాటు మరికొన్ని ప్రాంతాల్లో మినీ అన్నదానం కాంప్లెక్స్‌లు ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.

టాటా సంస్థ విరాళంగా అందించిన రూ.120 కోట్లతో తిరుమలలోని ఎస్వీ మ్యూజియాన్ని ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. ఇందులో 4 వేల కళాఖండాలు ఉన్నాయని, వీటితోపాటు శ్రీవారి ఆభరణాల 3డి ఇమేజిని ప్రదర్శిస్తామని తెలిపారు. శ్రీవారి లడ్డూలను మరింత నాణ్యంగా, ఎక్కువ సంఖ్యలో తయారు చేసేందుకు వీలుగా రిలయన్స్ సంస్థ విరాళంగా అందించే రూ.50 కోట్లతో నూతన సాంకేతిక పరిజ్ఞానంతో కొత్త ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టామన్నారు. ఈ ఏడాది డిసెంబర్ నాటికి ఈ రెండు పనులు పూర్తవుతాయని తెలిపారు.

తిరుమలలో 90 శాతం వసతి గృహాలను రూ.140 కోట్లతో పునరుద్ధరించామని తెలిపారు. తిరుమలలో సుమారు 7,500 గదులు ఉండగా, వీటిలో రూ.50, రూ.100 అద్దె కలిగిన దాదాపు 5 వేల గదులు సామాన్య భక్తులకు కేటాయిస్తున్నామని చెప్పారు. వీరు బస చేసే కాటేజిల అద్దె పెంచలేదని, వీటిని రూ.132 కోట్లతో ఆధునీకరించామని తెలిపారు. నాలుగు పీఏసీల్లో 15 వేల మందికి బస కల్పిస్తున్నామని, వీటికి తోడు రూ.100 కోట్లతో పిఏసి-5 నిర్మాణం జరుగుతోందని వివరించారు. తిరుమలలో నిరుపయోగంగా ఉన్న ఉద్యోగుల క్వార్టర్స్ ను ఆధునీకరించి, అధికారులకు ఇతర శాఖల వారికి అక్కడ గదులు కేటాయించినట్లు తెలిపారు. ట్రాన్సిట్ అకామడేషన్ కింద 800 గదులు ఉండగా 500 గదులు ఖాళీ చేయించామని, త్వరలో మిగిలిన గదులను కూడా ఖాళీ చేయించి భక్తులకు కేటాయిస్తామని తెలియజేశారు.

దాత సహాయంతో రూ.23 కోట్లతో నిర్మించిన నూతన పరకామణి భవనాన్ని గతేడాది సెప్టెంబరులో రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ వైఎస్.జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారని, ఇతర అభివృద్ధి పనులు పూర్తి చేసి ఫిబ్రవరి మొదటి వారంలో కార్యకలాపాలు ప్రారంభిస్తామని తెలిపారు. ఎస్వీబీసీలో ప్రసారమవుతున్న గరుడ పురాణానికి భక్తుల నుంచి విశేష ఆదరణ లభిస్తోందని, ప్రస్తుతం మహాభారతంలో సభాపర్వం తర్వాత అరణ్యపర్వం, రామాయణంలో బాలకాండ తర్వాత అయోధ్యకాండ పారాయణం మొదలుపెడతామన్నారు. ఈ సందర్భంగా భక్తులకు, అధికారులకు, సిబ్బందికి, శ్రీవారి సేవకులకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో సిఇ శ్రీ నాగేశ్వరరావు, ఎస్‌ఈ-2 శ్రీ జగదీశ్వర్‌రెడ్డి, హెల్త్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ శ్రీదేవి, వీజీఓలు శ్రీ బాలిరెడ్డి, శ్రీ గిరిధర్‌, డెప్యూటీ ఈవోలు శ్రీ భాస్కర్‌, శ్రీ సెల్వం, ఈఈలు శ్రీ జగన్‌మోహన్‌రెడ్డి, శ్రీ సురేంద్రనాథ్‌రెడ్డి, శ్రీ శ్రీహరి, డీఈ శ్రీ రవిశంకర్‌రెడ్డి, ఇతర అధికారులు , సిబ్బంది పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News