ప్రైవేటు ఉద్యోగాల్లో స్థానికులకు 75 శాతం కోటా చెల్లదన్న హైకోర్టు తీర్పుపై స్టే
న్యూఢిల్లీ: ప్రైవేటు ఉద్యోగాల్లో స్థానికులకు 75 శాతం రిజర్వేషన్ల అంశంపై హర్యానా ప్రభుత్వానికిసుప్రీంకోర్టులో ఊరట లభించింది. స్థానికులకు 75 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ హర్యానా ప్రభుత్వం చేసిన చట్టం చెట్టదంటూ పంజాబ్‌హర్యానా హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే విధించింది. నెలలోపు ఈ అంశంపై తుది నిర్ణయం తీసుకోవాలని హైకోర్టుకు సూచించింది. దే సమయంలో అప్పటివరకు యాజమాన్యాలపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని రాష్ట్రప్రభుత్వాన్ని ఆదేశించింది. స్థానిక రిజర్వేషన్లపై హర్యానా ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులు చెల్లవంటూ పంజాబ్‌హర్యానా ఉమ్మడి హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ ఆ రాష్ట్రప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు పూర్తి విచారణ చేయకుండానే తీర్పు ఇచ్చిందని, కేవలం 90 సెకన్లలోనే విచారణను పూర్తి చేసిందని సుప్రీంకోర్టులో వాదించింది.
వాదనలు విన్న సుప్రీం ధర్మాసనం ఈ అంశంపై నాలుగు వారాల్లో పూర్తి విచారణ జరిపి నిర్ణయం తీసుకోవాలని హైకోర్టుకు సూచించింది. ప్రైవేటు రంగ ఉద్యోగాల్లో స్థానికులకే 75 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ మనోహర్‌లాల్ ఖట్టర్ ప్రభుత్వం గత ఏడాది నూతన చట్టాన్ని తీసుకువచ్చింది. అయితే దీనిపై ప్రైవేటు రంగం, పారిశ్రామికవేత్తలనుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమయింది. రాష్ట్రప్రభుత్వం నిర్ణయం పారిశ్రామిక రంగానికి తీవ్ర నష్టం కలిగించడంతో పాటుగా పెట్టుబడులపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని ఆందోళన వ్యక్తం చేసింది. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పలు సంస్థలు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశాయి. వాటిని విచారించిన పంజాబ్‌హర్యానా హైకోర్టు చట్టం అమలును ్తత్కాలికంగా నిలుపుదల చేసింది. దీన్ని రాష్ట్రప్రభుత్వం సుప్రీంలో సవాలు చేసింది. చివరికి హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే విధించడంతో హర్యానా సర్కార్‌కు ఊరట లభించింది.