Monday, January 20, 2025

రాజ్యాంగానికి వజ్రోత్సవం

- Advertisement -
- Advertisement -

భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75ఏళ్లు అయిన సందర్భంగా ఇటీవల స్వాతంత్య్ర అమృత మహోత్సవాల పేరుతో కేంద్ర ప్రభుత్వం ఘనంగా వజ్రోత్సవాలు నిర్వహించింది. సుప్రీం కోర్టు ఏర్పడి 75 ఏళ్లు అయిన సందర్భంగా కూడా కేంద్ర ప్రభుత్వం జనవరి 28న వజ్రోత్సవాలని ప్రారంభించింది. అదే సమయంలో భారత దేశ రాజ్యాంగం అమలులోకి వచ్చి 75 ఏళ్లు అవుతోంది. ఎందరో త్యాగధనుల పోరాట ఫలితంగా 1947 ఆగస్టు 15న బ్రిటిష్ పాలన నుంచి విముక్తమై భారత దేశం స్వతంత్ర దేశమైంది. మన దేశానికి స్వతంత్ర రాజ్యాంగం ఆనాటికి లేనందున 1935 భారత ప్రభుత్వ చట్టం ఆధారంగా పాలన కొనసాగింది. దేశ రాజ్యాంగాన్నిరూపొందించేందుకు 1947 ఆగస్టు 28న రాజ్యాంగ నిర్మాణ కమిటీ ఏర్పాటైంది. ఈ కమిటీ అధ్యక్షునిగా బాబా సాహెబ్ అంబేడ్కర్ బాధ్యతలు చేపట్టారు.

రాజ్యాంగ ముసాయిదాను రాజ్యాంగ సభ (తాత్కాలిక పార్లమెంట్)కు సమర్పించగా, దాదాపు రెండేళ్ల పాటు 308 మంది సభ్యులు విపులంగా చర్చించి, సవరణలు చేసి భారత రాజ్యాంగాన్ని తయారు చేశారు. దానిని ఇంగ్లీష్, హిందీ భాషలలో చేతిరాతతో తయారు చేసి 1950 జనవరి 24న సంతకాలు చేసి ఖరారు చేశారు. అలా తయారైన రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజే ‘భారత గణతంత్ర’ దినం 1950 జనవరి 26. చారిత్రాత్మకంగా ఈ రోజుకు ఉన్న ప్రాముఖ్యం దష్ట్యా జనవరి 26వ తేది గణతంత్ర దినంగా ఎంపిక చేశారు. భారత స్వాతంత్య్రం పోరాటానికి నాయకత్వం వహించిన ‘భారత జాతీయ కాంగ్రెస్’ 1930లో ‘పూర్ణ రాజ్య’ కోసం ప్రకటన చేసి ప్రతి సంవత్సరం జనవరి 26ను పూర్ణ స్వరాజ్య జయంతి దినోత్సవం జరపాలని జాతికి పిలుపునిచ్చింది. స్వతంత్ర భారత రాజ్యాంగ నిర్మాణానికి రాజ్యాంగ సభకు 2 సంవత్సరాల, 11 నెలల, 18 రోజులు పట్టింది.

రాజ్యాంగ సభ 11 సార్లు, 165 రోజుల పాటు సమావేశమైంది. ఇందులో 114 రోజులు రాజ్యాంగం రాయటానికే పట్టింది. రాజ్యాంగ రాతప్రతిని తయారు చేసే క్రమంలో రాజ్యాంగ సభ ముందుకు 7,635 సవరణ ప్రతిపాదనలు వచ్చాయి. వీటిలో 2,473 ప్రతిపాదనలను పరిశీలించి, చర్చించి, పరిష్కరించింది. భారత రాజ్యాంగాన్ని 1949 నవంబర్ 26న సభలో ఆమోదించారు. 1950 జనవరి 24న సభ్యులు ఈ ప్రతిపై సంతకాలు పెట్టారు. మొత్తం 284 మంది సభ్యులు సంతకాలు చేశారు. 1950 జనవరి 26న భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. ఆ రోజున రాజ్యాంగ సభ రద్దయి, భారత్ తాత్కాలిక పార్లమెంటుగా మారింది. 1952లో జరిగిన మొదటి సాధారణ ఎన్నికల తరువాత కొత్త పార్లమెంటు ఏర్పడే వరకు ఈ తాత్కాలిక పార్లమెంటు ఉనికిలో ఉంది.

రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులు, ప్రాథమిక విధులు, ఆదేశిక సూత్రాలు ఉన్నాయి. ప్రతి భారతీయుడు రాజ్యాంగం ప్రకారం నడుచుకోవాలి. రాజ్యాంగాన్ని గౌరవించాలి. అదే విధంగా కేంద్ర ప్రభుత్వం కూడా రాజ్యాంగం అమలులోకి వచ్చి 75 ఏళ్లు అయిన సందర్భంగా రాజ్యాంగ వజ్రోత్సవాలు జరపాలి. రాజ్యాంగ ప్రతులను విద్యార్థులకు ఉచితంగా పంపిణీ చేయాలి. రాజ్యాంగం గురించి అవగాహన సదస్సులు నిర్వహించాలి. రాజ్యాంగ నిర్మాణంలో పాలు పంచుకున్న మహనీయుల గురించి నేటి తరానికి తెలియజేయాలి. అప్పుడే రాజ్యాంగ లక్ష్యాలు నెరవేరతాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News