పీఠిక మీద జరిగిన చర్చలో చాలా విషయాలు ముందుకు వచ్చాయి. రాజ్యాంగ పీఠికలో దేవుడు, గాంధీ పేర్లను చేర్చాలనే అభిప్రాయాలు కూడా వ్యక్తమయ్యాయి. అయితే మెజారిటీ రాజ్యాంగ సభ సభ్యులు ఆ ప్రతిపాదన లను తిరస్కరించారు. ఇది భారత రాజ్యాంగం ప్రకారం వ్యక్తిగత స్వేచ్ఛ, విశ్వాసాలకు విఘాతం కలిగిస్తుందని భావించి హేతుబద్ధతకు, శాస్త్రీయ ఆలోచనలకు పెద్ద పీట వేశారు. పీఠికలోని భావన అందుకు పొదిగిన పదాలు రాజ్యాంగసభ సభ్యుల తాత్విక దార్శనికలకు అద్దం పడుతు న్నాయి. ప్రపంచంలోనే మొట్టమొదటి ప్రజాస్వామ్య దేశంగా చెప్పుకుంటు న్న అమెరికా రాజ్యాంగ పీఠిక కూడా ఇంతటి విస్తృతిని కలిగిలేదు.
‘భారత రాజ్యాంగ పీఠిక దేశ రాజకీయ భవిష్యత్ దర్శిని’ అంటూ రాజ్యాంగ సభ సభ్యులు, రచనా సంఘం సభ్యులు కె.ఎం. మున్షి చేసిన వ్యాఖ్య చాలా ప్రామాణికమైనది. భారత రాజ్యాంగం అమలు జరిగి 75 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ఎన్నో విధాలైన చర్చ జరుగుతున్నది. వివిధ రాజకీయ పక్షాలు, సంస్థలు తమదైన రీతిలో రాజ్యాంగాన్ని నిర్వచించుకుంటున్నాయి. రాజ్యాంగం అమలు పైన తమదైన విశ్లేషణ చేస్తున్నాయి. అయితే రాజ్యాంగ సారాన్ని అర్థం చేసుకోవడానికి పీఠిక ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని చాలా మంది విశ్లేషకులు భావిస్తున్నారు.
1946 డిసెంబర్ 13వ తేదిన జవహర్ లాల్ నెహ్రూ రాజ్యాంగ సభలో ప్రవేశపెట్టిన తీర్మానం పీఠిక రూప కల్పనకు పునాది. 1947 జనవరి 22న రాజ్యాంగ తీర్మానాన్ని రాజ్యాంగ సభ ఆమోదించింది. పీఠిక మీద జరిగిన చర్చలో చాలా విషయాలు ముందుకు వచ్చాయి. రాజ్యాంగ పీఠికలో దేవుడు, గాంధీ పేర్లను చేర్చాలనే అభిప్రాయాలు కూడా వ్యక్తమయ్యాయి. అయితే మెజారిటీ రాజ్యాంగ సభ సభ్యులు ఆ ప్రతిపాదనలను తిరస్కరించారు.
ఇది భారత రాజ్యాంగం ప్రకారం వ్యక్తిగత స్వేచ్ఛ, విశ్వాసాలకు విఘాతం కలిగిస్తుందని భావించి హేతుబద్ధతకు, శాస్త్రీయ ఆలోచనలకు పెద్ద పీట వేశారు. పీఠికలోని భావన అందుకు పొదిగిన పదాలు రాజ్యాంగసభ సభ్యుల తాత్విక దార్శనికలకు అద్దం పడుతున్నాయి. ప్రపంచంలోనే మొట్టమొదటి ప్రజాస్వామ్య దేశంగా చెప్పుకుంటున్న అమెరికా రాజ్యాంగ పీఠిక కూడా ఇంతటి విస్తృతిని కలిగిలేదు. భారత రాజ్యాంగ పీఠిక అన్ని దేశాల అవగాహనలను మించిపోయే విధంగా ఉన్నది. ముందుగా రాజ్యాంగం కేవలం కొందరు నిపుణులు, మేధావులు, న్యాయవాదులు తయారు చేసిన పత్రం కాదని కూడా రాజ్యాంగ నిర్మాతలు స్పష్టం చేశారు. అది భారత ప్రప్రథమ ప్రధాని జవహర్ లాల్ మాటల్లోనే అత్యంత తెలివైన న్యాయవాదలు కలిసి ఒక చోట కూర్చున్నంత మాత్రాన ఆ పని అవదు. చిన్నచిన్న కమిటీలు కలిసి విరుద్ధ ప్రయోజనాల మధ్య సమతౌల్యం చేయడానికి ప్రయత్నిస్తూ అదే రాజ్యాంగ రచనా కన్నా ఆ పని అవదు. విదేశీ అధికారపు నీడలో పని చేసిన కూడా అది సాధ్యం కాదు. రాజకీయ, సామాజిక స్థితిగతులు అనుకూలించి, ప్రజల నుంచి బలమైన ప్రేరణ, ఆశీస్సులు ఉన్నప్పుడే ఆ పని సమర్థవంతంగా అవుతుంది” అదే నిజం.
భారత రాజ్యాంగ రచనకు ముందు జరిగిన అనేక ఉద్యమాలు, ఆందోళనల సంఘర్షణలు, ప్రజల ఆశలు, ఆకాంక్షలు అన్నీ కలిస్తేనే భారత రాజ్యాంగం. దాని అంతఃసారం రాజ్యాంగ పీఠిక. అందువల్లనే భారత రాజ్యాంగ రచనా సంఘం రాజ్యాంగ సభ సభ్యుల నుంచే కాకుండా, ప్రజల మనోభావాలను సరిగ్గా అర్థం చేసుకొని అనేక అంశాల అర్థాల పదాల పొందికను ఒక హారం లాగా పేర్చారు. నిజానికి భారత రాజ్యాంగ పీఠికను చదువుతుంటే ఒక న్యాయపరమైన విషయాన్ని వల్లె వేస్తున్నట్టు కనిపించదు. అది ఒక ప్రతినాదంగా, నినాదంగా మోగుతోంది. ఒక సంగీత ఝరి లాగా ప్రతిధ్వనిస్తుంటుంది.
అంతేకాకుండా అప్పటి వరకు మేము మీరు, మనం వాళ్ళ, నువ్వు నేను, అతను ఆమె అనే విడదీసే బంధాల పదబంధాలు మాత్రమే ఉండేవి. అయితే రాజ్యాంగంలో “భారత ప్రజలమైన మనం” అనే ఒక సమిష్టి భావనకు అంకురార్పణ చేసింది రాజ్యాంగ పీఠిక. ఇతర దేశాల లాగా కాకుండా కులాల నిచ్చెన మెట్ల వ్యవస్థలో సాటి మనిషిని మనిషిగానే చూడని ఒక దుర్మార్గమైన విధానానికి రాజ్యాంగ పీఠిక చరమగీతం పాడింది. భారత దేశ ప్రజలమైన మనం, మనమందరం సార్వభౌమ, సామ్యవాద, లౌకిక ప్రజాస్వామిక గణతంత్ర దేశంగా రూపొందబోతున్నాయని కూడా రాజ్యాంగ పీఠిక సగర్వంగా ప్రకటించింది.
పరదేశ పీడన నుంచి విముక్తిని పొంది స్వాతంత్య్రాన్ని ప్రకటించుకొని సార్వభౌమత్వాన్ని పొందింది. ప్రజలను ముఖ్యంగా పేదలను, కార్మికులను ఆర్థిక దోపిడీ నుండి రక్షించడానికి సామ్యవాదాన్ని తన నినాదంగా మలుచుకున్నది. మతా లెన్ని ఉన్నా అందరికీ ఆచరణ ఉంటుందని, ఒక మతం ఇంకొక మతాన్ని ద్వేషించని ఒక సమ భావనను తనలో ఇముడ్చుకున్నది లౌకికవాదం. ప్రజాస్వామ్యం ఈనాటి సమకాలిన సమాజంలో అత్యున్నతమైన ప్రజాపాలన విధానంగా స్వీకరించింది. అంతేకాకుండా, ప్రభువులు, చక్రవర్తులు లేని ప్రజలే పాలకులుగా ఉండే గణతంత్ర వ్యవస్థను భారత దేశం తన మౌలిక విధానంగా ప్రకటించుకున్నది.
అదే విధంగా సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయాలను కూడా తన లక్షాలుగా ప్రకటించుకున్నది. ప్రతి పౌరునికి ఆలోచనల్లో, విశ్వాసాల్లో భగవత్ ఆరాధనా పద్ధతుల్లో ఆచారాలు, వ్యవహారాల్లో స్వేచ్ఛను కూడా ప్రకటించుకున్నది. సమానత్వంలో స్థాయి మాత్రమే కాదని, అవకాశాలు కూడా కల్పించాలని పీఠిక అభయమిచ్చింది. జాతి సమగ్రత, సమైక్యతలను, ఐక్యతను, సాధించి వ్యక్తిగత ప్రతిష్టను పెంపొందించడానికి కృషి. ఇటువంటి విప్లవాత్మకమైన భావాలను భవిష్యత్ కార్యాచరణకు మార్గదర్శకాలుగా అందించిన రాజ్యాంగ సభ, దాని నిర్మాతలు, రచనా సంఘం చేసిన పరి శ్రమ ఈ దేశం మనుగడలో ఉన్నంత కాలం ప్రజల గుండెల్లో కొలువై ఉంటారు.
పీఠికకు అనుగుణంగానే మన రాజ్యాంగం మౌలికాంశాలైన ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు రూపొందాయి. భారత రాజ్యాంగం మూడవ భాగంలోని ఆర్టికల్ 12 నుంచి 35 వరకు ఉన్న ప్రాథమిక హక్కులు పీఠికలోని అంశాలకు విస్తృతమైన వివరణలు. కార్యాచరణలో అమలుకు అనుగుణంగా మిలిచిన నిబంధనలు. అందులో ఆర్టికల్ 14, 15, 16 లు సమానత్వానికి, న్యాయాలకు,సామాజిక, రాజకీయ, ఆర్థిక, ఒక చట్టబద్ధమైన హామీని కల్పించాయి. ఆర్టికల్ 17 ఇందులో చాలా విశిష్టమైనది తరతరాలుగా భారత సమాజాన్ని విష తుల్యం చేసిన అంటరానితనాన్ని ఆ ఆర్టికల్ చట్టబద్ధంగా నిర్మూలించింది. ఆర్టికల్ 18, 19 భావ ప్రకటన స్వేచ్ఛకు, ఆర్టికల్ 20, 21, 22లు జీవించే హక్కులకు ఇట్లా మిగతా ఆర్టికల్స్ అన్నీ భారతీయుడికి అన్ని రంగాల్లో సమానత్వాన్ని, న్యాయాలను, జీవించే హక్కులను అందిస్తున్నది. అదే విధంగా మత స్వేచ్ఛకు, మైనారిటీ మతాలకు, భాషలకు ఒక రక్షణ కవచాన్ని కూడా అవి హామీ ఇస్తున్నాయి.
వీటితో పాటు ఆదేశిక సూత్రాలలోని ఆర్టికల్స్ 38, 46 లు పేదలు, ప్రత్యేకించి ఎస్‌సి, ఎస్‌టిలకు విద్య, ఆర్థిక రంగాల్లో అండగా నిలబడాలని, ప్రాంతాల మధ్య, ప్రజల మధ్య అసమానతలను తొలగించడానికి ప్రభుత్వాలు సత్వరమే చర్యలు చేపట్టాలని సూచిస్తున్నాయి. నిజానికి భారత రాజ్యాంగం రాక ముందు బ్రిటిష్ వాళ్లు ఎన్నో చట్టాలు చేశారు. 1935 భారత చట్టం కూడా అందులో భాగమే. వాటన్నింటిలో పీఠిక లాంటి అంశం కాని, ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు లాంటి రక్షణలు గాని ప్రజలకు లేవు. గత చట్టాలలో, రాజ్యాంగాలలో ప్రభుత్వాల నిర్వహణ, వ్యాపారాల రక్షణ, పన్నులు, శిక్షలు ఇటువంటి రాజ్య రక్షణలే తప్ప ప్రజా శ్రేయస్సు అంశమే అందులో లేదు. అందువల్ల భారత రాజ్యాంగం గతంలోనున్న ప్రభుత్వాల, రాజ్యాల, చక్రవర్తుల చట్టాలు కన్నా భిన్నమైనది.
ఒక రకంగా భారత దేశ చరిత్రలో రాజ్యాంగమే ఒక విప్లవం. ఈ రాజ్యాంగం గతంలోని సామాజిక వ్యవస్థను తలకిందుల చేసింది. కులాలుగా ఏర్పడిన సమాజాన్ని ఐక్యం చేసే ఆచరణకు మార్గం చేసింది. అయితే చాలా మందిలో రాజ్యాంగం అమలులో అసంతృప్తిగా ఉన్నారు. రాజ్యాంగం కాగితాల వరకే పరిమితమైందనే విమర్శ కూడా ఉన్నది. అది నిజమే. దీనిలో ఎటువంటి సందేహం లేదు. అయితే రాజ్యాంగం అమలు ఈ దేశంలో పాలకుల మీద కన్నా ప్రజల మీద ఎక్కువ భావం ఉన్నది. ఒక్కడ రాజులు, పాలకులు లేరు. మన ఓటు ద్వారా ఎన్నికవుతున్న వాళ్లే మనల్ని పాలిస్తున్నారు. అంటే ప్రజల్లో రాజ్యాంగం పట్ల, అందులో పొందుపరిచిన హక్కుల పట్ల అవగాహన లోపం ఉంది. అందుకే ప్రజలు గొంతుకలుగా ఉన్న సంఘాలు, సంస్థలు, వ్యక్తులు, రచయితలు, మేధావులు, కళాకారులు కనీసం ఈ 75 ఏళ్ల సందర్భంలోనైనా ప్రజల్లో చైతన్యం కల్పించాలి. ప్రముఖ రాజనీతివేత్త రజని కొఠారి మాటలను ఇక్కడ ఉటంకించడం సబబుగా ఉంటుం ది. “ప్రజాస్వామ్య మనుగడకు అట్టడుగున ఉన్న ప్రజల్లో ఉండే చైతన్యమే దోహదపడుతుంది. పైపైన జరిగే చర్చలు దానికి ఉపయోగపడాలి. చర్చ కింది దాకా వెళ్లాలి”.
మల్లేపల్లి లక్ష్మయ్య