Wednesday, January 22, 2025

సబ్ కా సాత్ సబ్ కా వికాస్ ఎక్కడ?

- Advertisement -
- Advertisement -

భారత దేశ చరిత్రలో జనవరి 26, 1950వ సంవత్సరం భారతీయులందరం గుర్తు పెట్టుకోవాల్సిన అతి ముఖ్యమైన రోజు. 200 సంవత్సరాల పాటు బ్రిటీష్ వారి పరిపాలనలో మగ్గిన మన దేశానికి ఆగస్టు 15, 1947న స్వాతంత్య్రం వచ్చింది. అప్పటి వరకూ మన దేశ పరిపాలనా విధానం పూర్తిగా బ్రిటీష్ రాజ్యాంగం ప్రకారం జరిగేది. వారిని దేశం నుంచి వెళ్లగొట్టిన తరువాత మన దేశాన్ని మనమే పరిపాలించుకునేందుకు ఒక రాజ్యాంగాన్ని తయారు చేసుకోవాల్సి వచ్చింది. అలా 1950, జనవరి 26న రాజ్యాంగం నిర్మించబడి, డాక్టర్ బాబూ రాజేంద్ర ప్రసాద్ మొట్టమొదటి రాష్ర్టపతిగా, భారత దేశం పూర్తి గణతంత్ర దేశం అయింది. ఆ రోజు నుంచి భారత దేశం పూర్తిగా ప్రజా ప్రభుత్వంగా రూపుదిద్దుకుంది.గణతంత్ర రాజ్యం అంటే ప్రజలే ప్రభుత్వం, ప్రభుత్వమే ప్రజలు అని అర్థం. కాగా స్వాతంత్య్రం వచ్చిన తరువాత భారత రాజ్యాంగాన్ని తయారు చేసేందుకు ఎంతో మంది మేధావులు, ఎన్నో దేశాల రాజ్యాంగాలను పరిశీలించారు.

ఎన్నో రకాల అంశాలతో చాలా కాలంపాటు రాజ్యాంగ ఏర్పాటుకు కృషి చేసి రూపొందించారు. రాజ్యాంగాన్ని తయారు చేసేందుకు డాక్టర్ బాబూ రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షతన రాజ్యాంగ పరిషత్‌ను ఏర్పాటు చేశారు. 1947 ఆగస్టు 29న డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ చైర్మన్‌గా రాజ్యాంగ ముసాయిదా కమిటీ ఏర్పాటైంది. అనేక సవరణల అనంతరం 1949 నవంబరు 26న భారత రాజ్యాంగాన్ని రాజ్యాంగ పరిషత్ ఆమోదించింది. రెండు సంవత్సరాల, 11 నెలల, 18 రోజుల కాలంలో పూర్తి చేసిన భారత రాజ్యాంగం ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగంగా గుర్తింపు పొందింది. ఇంత వరకూ బాగానే ఉన్నా డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ భారత రాజ్యాంగాన్ని ప్రవేశపెడుతూ.. ‘రాజ్యాంగం ఎంత మంచిదైనప్పటికీ దాన్ని అమలు చేసే పాలకులు మంచివారు కాకపోతే ఆ రాజ్యాంగం చెడ్డదిగా నిరూపించబడుతుంది. నేటి నుంచి మనం వైరుధ్యభరిత జీవితంలోకి ప్రవేశించబోతున్నాం. రాజకీయాల్లో సమానత్వం పొందినా, సామాజిక, ఆర్థిక హక్కుల విషయంలో సమానత్వం రాలేదు.

ఈ వైరుధ్యాన్ని ఎంత కాలం కొనసాగించాలి. సామాజిక, ఆర్థిక జీవితాల్లో సమానత్వాన్ని ఎంతకాలం తిరస్కరించాలి. మనం ఎంత కాలం తిరస్కరిస్తే మన రాజకీయ ప్రజాస్వామ్యం అంత ప్రమాదంలో పడిపోతుంది. అందువల్ల ఈ వైరుధ్యాన్ని సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలి. లేకుంటే అసమానతలతో బాధపడేవారు ఈ రాజ్యాంగ అసెంబ్లీ చాలా శ్రమతో నిర్మించిన రాజకీయ ప్రజాస్వామ్య నిర్మాణాన్ని కూల్చేస్తారని’ హెచ్చరించారు. ఆయన హెచ్చరికలు నేడు వాస్తవ రూపం ధరించాయనే అవగాహన అభ్యుదయ శక్తులన్నిటికీ వచ్చి ఏకీభవించాయి. నరేంద్ర మోడీ నాయకత్వంలోని కేంద్రం నేడు రాజ్యాంగ మౌలిక సూత్రాలపైన దాడిని తీవ్రతరం చేస్తున్నది. నిజానికి రాజ్యాంగం రూపుదిద్దుకుంటున్న నాటి నుంచి దానిపై హిందూత్వ శక్తులు దాడి ప్రారంభించాయి. ఎందుకంటే హిందూ రాజ్యస్థాపనకు రాజ్యాంగమే అడ్డంకి కాబట్టి. మన రాజ్యాంగం పాశ్చాత్య దేశాల రాజ్యాంగాల నుంచి వివిధ అధికరణలను అరువుగా తెచ్చి భారీగా జాతులు కలెగూర గంపగా రూపొందించబడినదని, ఇందులో మనది అని చెప్పుకోవడానికి ఏమీ లేదని ప్రకటిస్తున్నాయి.

ఇలా కాషాయ దళాలు అవకాశం దొరికినప్పుడల్లా మన రాజ్యాంగంపై దాడి చేస్తూనే ఉన్నాయి. ఉమ్మడి జాబితాలో ఉన్న విద్య, విద్యుత్ వంటి రంగాల్లో నిరంకుశంగా చొరబడి చేస్తున్న చట్టాలు రాష్ట్రాల హక్కులను కాలరాస్తూ భారత రాజ్యాంగం ఫెడరల్ స్వభావాన్ని అంతం చేస్తున్న ప్రయత్నాలను చూస్తుంటే ఒక విషయం స్పష్టమవుతున్నది.స్వాతంత్య్రోద్యమం ముందుకు తెచ్చిన లౌకికతత్వం, ఫెడరలిజం, సామాజిక న్యాయం వంటి ఉన్నత విలువలకు చెల్లుచీటీ ఇచ్చి రాజ్యాంగాన్ని హిందుత్వం ఆధారంగా నడిపించే దేశంగా మారుస్తున్నారు. 1998లో బిజెపి నాయకత్వంలో ఎన్‌డిఎ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినపుడు రాజ్యాంగాన్ని సమీక్షించడానికి వెంకట్రామయ్య కమిషన్‌ను నియమించింది. 2014లో మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజ్యాంగ పీఠికలో ఉన్న లౌకిక, సోషలిస్ట్ అనే పదాలు లేకుండా 2015 రిపబ్లిక్ డే నాడు ప్రభుత్వ వాణిజ్య ప్రకటన వెలువడింది. 2019లో మోడీ రెండవసారి అధికారం చేపట్టిన తర్వాత ఇప్పుడు రాజ్యాంగంపై మరింత తీవ్రమైన దాడి జరుగుతున్నది.

రాబోయే రోజుల్లో బిజెపి ప్రభుత్వం మత స్వేచ్ఛకు సంబంధించిన అధికరణ 25, మైనారిటీలకు విద్యా సంస్థలను ఏర్పాటు చేసుకోవడం గురించి ఉన్న అధికరణం 30 లాంటి ముఖ్యమైన వాటిని కూడా సవరించి రద్దు చేయడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నది. దేశానికి అధ్యక్ష తరహా పాలన కావాలనే తన భావనను ముందుకు తీసుకొచ్చి ఇప్పుడు ఏక సమయంలో పార్లమెంట్, కొన్ని అసెంబ్లీలకు కలిపి జమిలి ఎన్నికలు జరపాలనే తన ప్రతిపాదనకు మద్దతు సమీకరించుకునేందుకు ప్రయత్నిస్తున్నది. ఇకపోతే న్యాయవ్యవస్థ, ఎన్నికల కమిషన్, సిబిఐ, ఇడి, ఆర్‌బిఐ మొదలైన రాజ్యాంగ అధికార వ్యవస్థలు కూడా హిందుత్వ ఎజెండాకు అనుగుణంగా వ్యవహరించాలన్న ఒత్తిడికి గురవుతున్నాయి. ప్రజాస్వామ్యానికి ఆక్సిజన్ పౌర స్వేచ్ఛ.

భావప్రకటనా స్వేచ్ఛ రాజ్యాంగంలో 19వ అధికరణంలో వాక్, సభా సంఘ, నివాస, సంచార, వృత్తి ఎంపిక స్వేచ్ఛలు కల్పించబడ్డాయి. పౌరుల మధ్య ఎలాంటి వివక్ష చూపించకూడదని 15వ అధికరణంలో పేర్కొన్నారు. మన దేశంలో ఏ వ్యక్తి అయినా చట్టం ముందు సమానమే. అందరికీ ఒకే రక్షణ ఉండాలని 14వ అధికరణంలో చెప్పారు. అయితే, మోడీ హయాంలో పెరిగిన అసహన దాడులు భావప్రకటనా స్వేచ్ఛకు ప్రధాన ప్రతిబంధకాలయ్యాయి. ఈ నేపథ్యంలో నాలుగో స్తంభంగా పేర్కొనే మీడియాపై ఉక్కుపాదం మోపింది. తనను ప్రశ్నించే వ్యక్తులపై, శక్తులపైనే కాకుండా మీడియాపైనా కుట్రపూరిత కేసులు బనాయిస్తోంది. ఈ నేపథ్యంలో అంతకు ముందు ఎన్‌డిటివి, ది వైర్, నేడు న్యూస్‌క్లిక్ వంటి ప్రత్యామ్నాయ మీడియా గొంతును నొక్కేస్తుంది. ప్రబీర్ పురకాయస్థ సహా పలువురు జర్నలిస్టులను, కాలమిస్టులను అరెస్టు చేసింది. మణిపూర్‌లో మైనారిటీ కుకీలపై మెయితీలను రెచ్చగొడుతూ ఆ రాష్ట్రాన్ని రావణకాష్ఠంలా మార్చింది.

జమ్మూకశ్మీర్‌ను ముక్కచెక్కలు చేసి, రాష్ర్ట హోదాను తొలగించి, అక్కడి రాజకీయ నాయకులను ఏడాది పాటు గృహ నిర్బంధంలో ఉంచింది. కశ్మీర్‌ను బహిరంగ జైలుగా మార్చింది. అక్కడ ప్రజల హక్కులన్నింటినీ హరిస్తూ ప్రెస్‌క్లబ్ మీద సైతం బిజెపి దాడి చేసింది. కల్బుర్గి, గోవింద పన్సారే, గౌరీ లంకేశ్ వంటి హేతువాదులను, జర్నలిస్టులను సంఘపరివార్ మూకలు హత్య చేశాయి. విశ్వవిద్యాలయాల్లోనూ విద్వేష వాతావరణం వెల్లువెత్తింది. చివరికి సామాజిక మాధ్యమాల్లో తమతో విభేదించే, ప్రశ్నించే వారెవరైనా, వ్యతిరేకత తెలిపేవారైనా దేశద్రోహులుగా ముద్ర వేసి జైలులో కుక్కతోంది. దేశ పౌరులు ఏం తినాలో, ఎలాంటి దుస్తులు ధరించాలో, ఏ సినిమా తీయాలో, ఏ చిత్రం వేయాలో నేడు సంఘ్ పరివారం నిర్దేశిస్తోంది.
అత్యాచార కేసుల్లో బాధితుల పక్షాన కాకుండా.. నేరస్థులకు దన్నుగా నిలుస్తున్నదనడానికి మహిళా రెజ్లర్ల పోరాటం ఇందుకొక తిరుగులేని ఉదాహరణ. గుజరాత్ అల్లర్లలో అత్యంత పాశవికంగా జరిగిన బిల్కిస్ బాను ఉదంతంలో నేరస్థులను నిస్సిగ్గుగా విడుదల చేసి, పూలదండలు వేసి మరీ ఊరేగించింది. దీనిపై ఇటీవల సుప్రీం సంచలనాత్మక తీర్పు చెప్పింది. నేరస్థులను తిరిగి జైలుకు పంపాలని ఆదేశించడం ఆహ్వానించాల్సిన విషయమే.

సంఘ్ పరివార్ మెజారిటీ వాదాన్నే ప్రజాస్వామ్యంగా పరిగణిస్తుంది. నాయకుడి ప్రాతిపదికన నియంతత్వ ప్రభుత్వం ఉండాలని అది కోరుకుంటుంది. బిజెపి విధానాలను ఏ మాత్రం విమర్శించినా వారిని జాతి వ్యతిరేకులుగా, పాకిస్తాన్, చైనా అనుకూల శక్తులుగాను ముద్ర వేస్తున్నారు. భిన్నాభిప్రాయాన్ని వ్యక్తం చేసే వారిపై రాజద్రోహ నేరాన్ని మోపడం ఇప్పుడు సాధారణమైపోయింది. ఇది ఒక్క రాజకీయ రంగంలోనే కాకుండా సామాజిక, సాంస్కతిక రంగాలలో కూడా నియంతత్వానికి రంగం సిద్ధం చేస్తున్నది. బిజెపి సమాజంలోని పేద ప్రజానీకం మూఢత్వాన్ని పెంచి మత ఘర్షణలను సృష్టిస్తున్నది. ఇంత బహిరంగ పక్షపాతాన్నీ, మతతత్వ ప్రభుత్వాలను ఈ 75 ఏండ్ల గణతంత్ర భారతం గతంలో ఎప్పుడూ చూడలేదు. భారత రాజ్యాంగంలోని మౌలిక సూత్రాలకు ఇవన్నీ భిన్నం. అందుకే ఒక పథకం ప్రకారం రాజ్యాంగాన్ని నిర్వీర్యపర్చి హిందూత్వ రాజ్యాంగం తీసుకు రావడానికి పెద్ద కుట్ర జరుగుతున్నది. నరేంద్ర మోడీ నేతత్వంలోని బిజెపి చెప్పే ‘సబ్ కా సాత్, సబ్ కా వికాస్’ అన్న నినాదమే పచ్చి అబద్ధం. కాబట్టి ప్రగతిశీల, ప్రజాస్వామిక శక్తులన్నీ ఈ కుట్రలను తిప్పికొట్టాలి. ప్రజాస్వామ్యం, ఫెడరలిజం, లౌకికతత్వం, సామాజిక న్యాయం, భిన్నత్వంలో ఏకత్వం వంటి రాజ్యాంగ విలువలను కాపాడుకోవాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News