వీరిలో 11 మంది జైలు సిబ్బంది
న్యూఢిల్లీ: ఢిల్లీలోని మూడు కారాగార సముదాయాలకు చెందిన 60 మందికి పైగా ఖైదీలు, 11 మంది జైలు సిబ్బంది కరోనా వైరస్ బారిన పడి చికిత్స పొందుతున్నట్లు బుధవారం డైరెక్టర్ జనరల్(కారాగారాలు) సందీప్ గోయల్ తెలిపారు. ఇప్పటివరకు 190 మంది ఖైదీలకు కొవిడ్-19 పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు ఆయన వెల్లడించారు. ఢిల్లీ కారాగారాలలో బుధవారం నాటికి 11 మంది జైలు సిబ్బందితో సహా 78 మంది ఖైదీలు కరోనాకు చికిత్స పొందుతున్నారని అధికారిక గణాంకాలు చెబుతున్నాయి.
కారాగారాలలో నిర్ధారణ అయిన 190 పాజిటివ్ కేసులలో 121 మంది ఖైదీలు వైరస్ నుంచి కోలుకున్నారని, ఇద్దరు మరణించారని గోయల్ తెలిపారు. మరో 67 మంది చికిత్స పొందుతున్నారని ఆయన చెప్పారు. ఇప్పటివరకు 304 మంది జైలు సిబ్బందికి వైరస్ సోకగా 293 మంది కోలుకున్నారని, 11 మంది చికిత్స పొందుతున్నారని ఆయన వివరించారు. రోహిణి జైలులో మొదటి పాజిటివ్ కేసు మే 13న బయటపడిందని ఆయన చెప్పారు. గత ఏడాది జూన్ 15, జులై 4న మండోలి జైలు ఇద్దరు సీనియర్ సిటిజన్లు కరోనా కారణంగా మరణించారని ఆయన తెలిపారు. ఢిల్లీ కారాగార సముదాయంలో తీహార్, రోహిణి, మండోలి కారాగారాలు ఉన్నాయి.