డెహ్రాడూన్: కొవిడ్ కారణంగా రెండేళ్లపాటు రద్దయి ఇటీవల ప్రారంభమైన చార్‌ధామ్ యాత్రపై ఆధారపడి జీవనం సాగిస్తున్న వేలాదిమంది స్థానికులకు ఆనందాన్ని కలిగిస్తున్నప్పటికీ యాత్ర మొదలైన నెలరోజుల్లోనే 78 మంది యాత్రికులు మరణించడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఉత్తరాఖండ్‌లోని ఎత్తైన పర్వతాలలో కొలువై ఉన్న ఈ ఆలయాలను సందర్శించడానికి వెళ్లే యాత్రికులు తగిన ప్రాణవాయువు అందక గుండెపోటుతో మరణించడం ప్రతి ఏడాది సంభవిస్తున్నప్పటికీ యమునోత్రి, గంగోత్రి ఆలయాల తలుపులు తెరుచుకోవడంతో మే 3న చార్ ధామ్ యాత్ర ప్రారంభమైన తర్వాత ఇంతపెద్ద సంఖ్యలో యాత్రికులు మృత్యువాత పడడం అసాధారణంగా నిపుణులు భావిస్తున్నారు.
ప్రతి ఏడాది ఏప్రిల్-మే నుంచి అక్టోబర్–నవంబర్ వరకు ఆరు నెలలపాటు యాత్రా సీజన్ కొనసాగుతుండగా 2019లో మొత్తం 90 మంది, 2018లో 102 మంది, 2017లో 112 మంది యాత్రికులు మరణించారు. ఈ సీజన్ ప్రారంభమైన నెలరోజుల్లోపలే చార్ ధామ్ యాత్రికులు ఇంత పెద్ద సంఖ్యలో మరణించడానికి దారితీసిన కారణాలలో వాతావరణానికి యాత్రికులు అలవాటుపడకపోవడం, కొవిడ్ బారినపడి కోలుకున్న వారిలో రోగనిరోధక శక్తి బలహీనంగా ఉండడం, అననుకూల వాతావరణం, యాత్రికుల రద్దీ కారణంగా తగిన ఏర్పాట్లు లేకపోవడం వంటివి ఉండవచ్చని కేదార్‌నాథ్‌లోని ఉచిత వైద్య శిబిర నిర్వాహకుడు ప్రదీప్ భరద్వాజ్ అభిప్రాయపడ్డారు.