బలూచిస్తాన్ ప్రావిన్సులోని గ్వదర్ పోర్టు అథారిటీ కాంప్లెక్స్‌లోకి చొరబడేందుకు సాయుధ బలూచ్ తిరుగుబాటుదారులు చేసిన ప్రయత్నాన్ని పాక్ భద్రతా దళాలు భగ్నం చేశాయి. ఈ సందర్భంగా జరిగిన కాల్పుల పోరులో ఇద్దరు పాక్ సైనికులతోపాటు 8 మంది తిరుగుబాటుదారులు మరణించినట్లు సైన్యం తెలిపింది. చైనా-పాకిస్తాన్ ఆర్థిక కారిడార్(సిపెక్) ప్రాజెక్టులో అత్యంత కీలక కేంద్రమైన గ్వదర్ పోర్టు కాంప్లెక్స్‌లో అనేక ప్రభుత్వ, పారామిలిటరీ కార్యాలయాలు ఉన్నాయి.
ఈ కాంప్లెక్స్‌లోకి చొరబడేందుకు బలూచ్ తిరుగుబాటుదారులు బుధవారం రాత్రి ప్రయత్నించారు. భద్రత కోసం నియమించిన సైనిక సిబ్బంది తిరుగుబాటుదారులను అడ్డుకున్నారని, ఈ సందర్భంగా జరిగిన కాల్పులలో పాక్ సైన్యానిక చెందిన ఇద్దరు జవాన్లు మరణించగా 8 మంది తిరుగుబాటుదారులు హతమయ్యారని సైన్యం ఒక ప్రకటనలో తెలిపింది. వేర్పాటువాద బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీకి చెందిన తిరుగుబాటుదారుల నుంచి పెద్ద మొత్తంలో ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు సైన్యం తెలిపింది.