Sunday, December 22, 2024

బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు.. 8 మంది కార్మికులు సజీవదహనం

- Advertisement -
- Advertisement -

తమిళనాడులోని శివకాశిలో గురువారం ఓ బాణసంచా ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో కనీసం ఎనిమిది మంది కార్మికులు సజీవదహనం చెందారు. మృతులలో ఐదుగురు మహిళలు ఉన్నారు. ఉన్నట్లుండి మంటలు వ్యాపించడం, బాణాసంచా తయారీ ముడిసరుకు అంటుకోవడంతో హాహాకారాలు చెలరేగాయి. పొట్టకూటికోసం పలు ప్రాంతాల నుంచి వచ్చి పనిచేస్తున్న వారికి గురువారం మధ్యాహ్నం చితిపేర్చినట్లు అయింది. శివకాశీలోని చెంగమాలపట్టిలో శరవణన్ అనే వ్యక్తి చాలాకాలంగా శ్రీ సుదర్శన్ కాకర్స్ ఫ్టాక్టరీ నిర్వహిస్తున్నాడు. బాణాసంచాలో మందు ధట్టిస్తుండగా అది పేలుడుకు దారితీసిందని, తరువాత వెంటనే మంటలు అంటుకున్నాయని ప్రత్యక్ష సాక్షులు , పోలీసు అధికారులు తెలిపారు. ఘటనలో 11 మంది వరకూ తీవ్రంగా గాయపడ్డారు. వీరిని అక్కడికి చేరుకున్న పోలీసు, అగ్నిమాపక దళాలు, సహాయక సిబ్బంది వెంటనే సమీపంలోని ఆసుపత్రుల్లో చికిత్సకు తరలించారు. మృతులు, క్షతగాత్రుల బంధువుల, ఆప్తుల రోదనలతో ఈ ప్రాంతం దద్దరిల్లింది.

ఇప్పటికీ ప్రమాదానికి కారణాలను వెంటనే నిర్థారించలేకపోతున్నామని, కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేపట్టామని స్థానిక అధికారులు తెలిపారు. ఈ ఫ్యాక్టరీలో ఎంత మంది కార్మికులు పనిచేస్తున్నారనేది కూడా అధికారులకు తెలియడం లేదు. ఫ్యాక్టరీలో బాణాసంచాను ఉంచే దాదాపు ఎనిమిది గదులు, ఓ హాల్ పూర్తిగా తగులబడి పొయ్యాయి. ఫ్యాక్టరీకి లైసెన్సు ఉందని వెల్లడైంది. జరిగిన ఘటనపై వెంటనే ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ స్పందించారు. మృతుల కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు. క్షతగాత్రులకు సరైన వైద్య చికిత్స అందించేలా అధికార యంత్రాంగం వ్యవహరించాలని సిఎం ఆదేశించారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున, విషయాన్ని ఎన్నికల సంఘానికి తెలిపి తగు విధంగా సాయం ఎప్పుడు అందించాలనేది ఆలోచిస్తామని కూడా స్టాలిన్ వివరించారు. జరిగిన దుర్ఘటనపై రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మూ స్పందిస్తూ మృతుల కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తున్నట్లు ప్రకటన వెలువరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News