మన తెలంగాణ/హై-దరాబాద్: బీహార్‌లోని వైశాలిలో ఆదివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో కనీసం ఎనిమిది మంది మృతి చెందారు. ప్రాథమిక వివరాల ప్రకారం ప్రార్థన విందులో పాల్గొని కాలినడకన ఇంటికి తిరిగివస్తున్న పలువురిని వేగంగా వచ్చిన ట్రక్కు ఢీ కొట్టింది. దేశ్రి పోలీస్‌స్టేషన్ పరిధిలోని సుల్తాన్‌పూర్ 28 తోలాలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ విషయమై పోలీసులకు సమాచారం అందించడంతో అక్కడకు భారీగా జనం గుమిగూడారు. క్షతగాత్రులను సమీప ఆసుపత్రిలో చేర్చారు. మృతుల్లో ఎక్కువ మంది చిన్నారులేనని స్థానిక సమాచారం. పలువురు తీవ్రంగా గాయపడడంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.
ఈ ప్రమాదంలో మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా, క్షతగాత్రులకు రూ.50,000 చొప్పున ప్రధాని మోడీ ప్రకటించారు. ప్రమాదంలో గాయపడిన వారంతా త్వరగా కోలుకోవాలని ప్రధాని మోడీ ఆకాంక్షించారు. ఘోర రోడ్డు ప్రమాద ఘటనపై బీహార్ ముఖ్యమంత్రి నితీష్‌కుమార్ కూడా తన సంతాపాన్ని వ్యక్తం చేశారు. ప్రమాదంపై ‘తీవ్ర విచారం’ వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు నిర్ణీత ప్రమాణాల ప్రకారం ఎక్స్‌గ్రేషియా అందించాలని, వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. రోడ్డు ప్రమాదంలో గాయపడ్డవారు త్వరగా కోలుకోవాలని హోం వ్యవహారాల సహాయమంత్రి నిత్యానంద్‌రాయ్ ఆకాంక్షించారు.