రాష్ట్రంలో వేర్వేరు ప్రమాదాల్లో 8మంది దుర్మరణం
నల్లగొండ జిల్లా కట్టంగూర్ సమీపంలో విడివిడి ప్రమాదాల్లో ఐదుగురు మృతి
నాగర్‌కర్నూల్ జిల్లాలో ఆటోను బస్సు ఢీకొనడంతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృత్యువాత
మనతెలంగాణ/నల్గొండ, పదర: రాష్ట్రంలో ఆదివారం నాడు వేర్వేరు చోట్ల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 8 మంది మృతి చెందారు. నల్లగొండ జిల్లా కట్టంగూరు సమీపంలో జరిగిన రెండు వేర్వేరు ప్రమాదాల్లో ఐదుగురు ప్రాణాలు కోల్పోగా, నాగర్‌కర్నూల్ జిల్లా పదర మండల పరిధిలో చోటు చేసుకున్న ప్రమాదంలో ముగ్గురు మరణించారు. నాగర్‌కర్నూల్ జిల్లా పదర మండల పరిధిలో గల మద్దిమడుగు గ్రామ సమీపంలో ప్రధాన రహదారి పై ఆదివారం ఆటోను ఆర్‌టిసి బస్సు ఢీ కొన్న ప్రమాదంలో ఒకేకుటుంబానికి చెందిన జటావత్ శ్రీను నాయక్ (33) ఆటోడ్రైవర్ కేతావత్ బజ్జు (65), జటావత్ పోలి (75) లు మృతి చెందారు. అమ్రాబాద్ సిఐ ఆదిరెడ్డి తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం జటావత్ తండా గ్రామానికి చెందిన జటావత్ శ్రీను మరో ఏడు మంది కుటుంబ సభ్యులు తమ సొంత ఆటోలో శనివారం ఉదయం 11 గంటలకు నల్లమలలో వెలసిన శ్రీపబ్బతి ఆంజనేయస్వామి దైవదర్శనానికి బయలుదేరివెళ్ళారని తెలిపారు.
ఆదివారం ఉదయం మద్దిమడుగు నుండి తమ స్వగ్రామానికి బయలుదేరి వెళ్తున్న సందర్భంలో మార్గమద్యలో మద్దిమడుగు గ్రామానికి సుమారు రెండు కిలోమీటర్ల దూరంలో చిన్న మలుపు వద్ద నల్గొండ జిల్లా దేవరకొండ ఆర్టిసి డిపోకు చెందిన బస్సు ఎదురుగా వస్తున్న ఆటోను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న ఎనిమిది మందిలో ముగ్గురు అక్కడిక్కడే మృతి చెందగా మరో ఇద్దరు మహిళలకు ఇద్దరు చిన్న పిల్లలకు తీవ్ర గాయాలు కాగా ఇందులో నలుగురి పరిస్థితి విషమంగా ఉందని మరో వ్యక్తి స్వల్ప గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను 108 అంబులెన్స్ ద్వారా అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్యసేవలు అందిస్తున్నట్లు తెలిపారు.అదేవిధంగా హైదరాబాద్, విజయవాడ 65 వ జాతీయ రహదారి పై ఆదివారం నాడు రెండు వేర్వేరు ఘోర రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురు దుర్మరణం పాలయ్యారు.శాలిగౌరారం సీఐ పసుపులేటి నాగదుర్గా ప్రసాద్, ఎస్‌ఐ వత్తుల శివ ప్రసాద్ లు తెలిపిన వివరాల ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒంగోలు జిల్లా కు చెందిన కదిరి గోపాల్ (31) ఆయన భార్య కదిరి రచన (30), ఐదేళ్ల కూతురు రియాన్సీతో పాటు కృష్ణా జిల్లా నాగమల్ల ప్రశాంత్ లతో కలిసి ఆర్‌జె 27సిఏ 0425 నెంబర్ గల తన సొంత కారులో శనివారం ఉదయం రాజస్థాన్ నుండి హైదరాబాద్ మీదుగా నూజీవీడుకు బయలుదేరారు.
ఈ నేపథ్యంలో మార్గ మధ్యలోని 65 వ జాతీయరహదారి పై గల కట్టంగూర్ మండలం ముత్యాలమ్మగూడెం గ్రామ శివారులోకి రాగానే విజయవాడ వైపు వెళ్తున్న ఏపి 05 టిటి 6653 నెంబర్ గల ఎస్‌ఎంఆర్‌టి ట్రాన్‌పోర్టు పార్శిల్ లారీని ఓవర్‌టెక్ చేసే ప్రయత్నంలో అతివేగంగా ప్రయాణిస్తున్న కారు లారీని వెనుక నుంచి బలంగా ఢీకొట్టి, అదేవేగంతో డివైడర్‌ను ఢీకొని రోడ్డుకు ఎడమ వైపున వరద కాలువలోకి దూసుకెళ్లి చెట్టును ఢీకొట్టడంతో కారు నుజ్జునుజ్జ అయ్యింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న కదిరి గోపాల్(31), ఆయన స్నేహితుడు నాగమల్ల ప్రశాంత్ లు అక్కడికక్కడే మృతి చెందగా, వెనుక సీటులో కూర్చున్న గోపాల్ భార్య కదిరి రచన ((30), ఐదేళ్ల కూతురు రియాన్సీలకు తీవ్ర గాయాలయ్యాయి.
డయల్ 100 ద్వారా సమాచారం అందుకున్న ఎస్‌ఐ బత్తుల శివ ప్రసాద్ తమ పోలీస్ సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకొని యుద్ద ప్రాతిపదికన రచనను, ఐదేళ్ల చిన్నారి రియాన్సీని చికిత్సనిమిత్తం అంబులెన్స్‌లో నార్కట్ పల్లి కామినేని ఆసుపత్రికి తరలించారు. కారులో ఇరుక్కుపోయిన గోపాల్, ప్రశాంత్ మృతదేహాలను క్రేన్ సహాయంతో బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం నకిరేకల్ ప్రభుత్వ ఆసుపత్తికి తరలించారు. కాగా ఆసుపత్రిలో కదిరి రచన చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈక్రమంలో శాలిగౌరారం సర్కిల్ సీఐ పసుపులేటి నాగదుర్గా ప్రసాద్ ప్రమాద ఘటనా స్థలాన్ని సందర్శించి పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలను ప్రత్యక్ష సాక్షులను, పలువురు వాహనదారులను అడిగి తెలుసుకున్నారు. ఎస్‌ఎంఆర్‌టి ట్రాన్‌పోర్టు పార్శిల్ లారీ డ్రైవర్ గొంగళి అశోక్‌రెడ్డి ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ శివ ప్రసాద్ కేసు నమోదు చేసుకోగా సిఐ పిఎన్‌డి ప్రసాద్ దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
అనాథగా మారిన ఐదేళ్ల చిన్నారి రియాన్సీ
తల్లితండ్రులైన కదిరి గోపాల్, కదిరి రచనలు కట్టంగూర్ మండల పరిధిలోని ముత్యాలమ్మగూడెం గ్రామ శివారులోని గచ్చుగూరి చెరువు వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో ఐదేళ్ల కూతురు రియాన్సీ అనాథగా మారింది. తల్లిదండ్రులు లేని ఈ పాపను చూసి, మృతుల బంధువులు రోదిస్తుండడం చూపరులను కంట తడిపెట్టించింది.