Monday, April 21, 2025

రూ. కోటి అవార్డ్ ఉన్న మావోయిస్టు ప్రయాగ్ మాంఝీ హతం

- Advertisement -
- Advertisement -

ఝార్ఖండ్ లోని బొకారో జిల్లాలో లాల్‌పానియా ప్రాంతం లోని లుగు పర్వత పాదాల వద్ద సోమవారం తెల్లవారు జామున 5.30 గంటల సమయంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మొత్తం ఎనిమిది మంది నక్సల్స్ హతం కాగా వీరిలో మావోయిస్టు కీలక నేత ప్రయాంగ్ మాంఝీ కూడా ఉన్నాడు . మాంఝీపై జాతీయ దర్యాప్తు సంస్థ రూ. కోటి రివార్డును ఇప్పటికే ప్రకటించింది. ప్రయాగ్ మాంఝీని అలియాస్ వివేక్, పుచన, నాగ మాంఝీ , కరన్, లెతర అనే పేర్లతో కూడా పిలుస్తారు. ఈ ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన ఎనిమిది మందిలో స్పెషల్ ఏరియా కమిటీ సభ్యుడు అరవింద్ యాదవ్ అలియాస్ అవినాష్, జోనల్ కమిటీ సభ్యుడు సహేబ్రమ్ మాంఝీ అలియాస్ రాహుల్ మాంఝీ, మహేష్ మాంఝీ అలియాస్ మోటా, తాలు, రంజు మాంఝీ, గంగారామ్ , మహేష్ అనే మావోయిస్టులు ఉన్నారు. వీరిపై రూ. 10 లక్షల వంతున రివార్డులు ఉన్నాయి. అరవింద్ యాదవ్‌పై రూ.25 లక్షలు, సహేబ్రమ్ మాంఝీపై రూ.10 లక్షలు, అవార్డులు ఉన్నాయి.

హింసాత్మక కేసులు వీరిపై ఉన్నాయి. కేంద్ర కమిటీ సభ్యుడైన ప్రయాగ్ మాంఝీ ముఖ్యంగా ప్రశాంత్ హిల్స్ కేంద్రంగా తన కార్యకలాపాలు నిర్వహించేవాడు. ధనాబాద్ జిల్లా తుండీ పోలీస్ స్టేషన్ పరిధి లోని దల్‌బుద అతడి స్వగ్రామం. ఝార్ఖండ్, బీహార్, ఛత్తీస్‌గఢ్, ఒడిశాలో దాదాపు 100 దాడుల్లో ప్రయాగ్ మాంఝీ హస్తం ఉంది. ఒక్క గిరిధి జిల్లా లోనే ఇతడిపై 50 కేసులతోపాటు, రూ. కోటి రివార్డ్ ఉంది. ఝార్ఖండ్‌లో అత్యధిక రివార్డ్ ఉన్న రెండో మావోయిస్టు ఇతడే. ఇతడు పరస్నాథ్ ప్రాంతంలో కి ప్రవేశించినట్టు సమాచారం అందడంతో పోలీసులు వేగులను అప్రమత్తం చేశారు. కొన్నాళ్ల క్రితం అతడిని చూడటంతో రూఢి చేసుకున్నారు. సోమవారం తెల్లవారుజామున సీఆర్‌పీఎఫ్, రాష్ట్ర పోలీసులు కూంబింగ్ ఆపరేషన్ చేపట్టారు. వీరికి లుగు హిల్స్ వద్ద మావోయిస్టులు ఎదురుపడటంతో ఎన్‌కౌంటర్ మొదలైంది. ఆ తర్వాత కొద్ది సేపటికి మావోలు అడవుల్లోకి పారిపోయారు. మొత్తం 8 మృతదేహాలు స్వాధీనం చేసుకున్నారు. వీరిలో ప్రయాగ్ ఉన్నట్టు గుర్తించారు.

తాజా ఆపరేషన్‌లో ఎస్‌ఎల్‌ఆర్ , 3 ఇన్సాస్ రైఫిళ్లు, ఏకే సీరీస్ రైఫిల్, సెల్ఫ్ లోడింగ్ రైఫిల్, ఎనిమిది నాటు తుపాకీలు, పిస్తోలు, వంటి భారీ ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. 209 కమాండ్ బెటాలియన్ ఫర్ రిసల్యూట్ యాక్షన్ (కోబ్రా) , ఝార్ఖండ్ పోలీసులు పాల్గొన్నారు. ఈ భారీ ఎన్‌కౌంటర్‌తో ఉత్తర ఛోటానాగ్‌పూర్ రీజియన్‌లో మొత్తం మావోయిస్టు స్వాడ్‌లు తుడిచిపెట్టుకుపోయినట్టేనని ఝార్ఖండ్ డిజిపి అనురాగ్ గుప్తా వెల్లడించారు. ఇంకా చాయిబాసా రీజియన్‌లో మాత్రం మావోయిస్టులు ఉన్నారని, ఆ రీజియన్‌లోని సరందా ఏరియలో సిఆర్‌పిఎఫ్ దళాలతోపాటు అన్ని దళాలను మోహరింప చేశామని చెప్పారు. మరో 1520 రోజుల్లో మావోయిస్టు దళాలను పూర్తిగా నిర్మూలించాలన్నదే తమ లక్షంగా చెప్పారు. చాయ్‌బాసా రీజియన్ లోని మావోయిస్టులు లొంగిపోవాలని తాము విజ్ఞప్తి చేస్తున్నామన్నారు.

ఈ ఏడాది ఝార్ఖండ్‌లో జరిగిన ఎన్‌కౌంటర్లలో మొత్తం 13 మంది మావోలు ప్రాణాలు కోల్పోయారు. 2025 చివరికి రాష్ట్రాన్ని మావోరహిత రాష్ట్రంగా చేయాలని పోలీసులు లక్షంగా పెట్టుకున్నారు. 244 మంది మావోయిస్టులను రాష్ట్రంలో అరెస్టు చేశారు. పలుదళాల కమాండర్లతో కలిపి 24 మంది లొంగిపోయారు.
ఏడాది క్రితమే ప్రయాగ్ మాంఝీ భార్య అరెస్ట్
ప్రయాగ్ మాంఝీ భార్య జయాను గతేడాది పోలీసులు అరెస్టు చేశారు. ఆమె క్యాన్సర్‌తో బాధపడుతోంది. చికిత్స తీసుకోవడానికి వచ్చిన సమయంలో నాడు ఆమెను అదుపు లోకి తీసుకున్నారు. ఆ తరువాత చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News