Sunday, January 19, 2025

జార్ఖండ్ మంత్రిగా శిబూ సోరెన్ చిన్న కుమారుడు ప్రమాణం

- Advertisement -
- Advertisement -

రాంచి: జార్ఖండ్‌లో చంపయీ సోరెన్ నేతృత్వంలోని ప్రభుత్వంలో మంత్రిగా జార్ఖండ్ ముక్తి మోర్చ(జెఎంఎం) అధినేత శిబూ సోరెన్ చిన్న కుమారుడు బసంత్ సోరెన్, శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. భూ కుంభకోణానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో అరెస్టయి జుడిషియల్ కస్టడీలో ఉన్న మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ తమ్ముడైన బసంత్ సోరెన్‌కు మంత్రి పదవి లభించింది. బసంత్ సోరెన్‌తోపాటు మరో 8 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. జెఎంఎంకు చెందిన మరో ఐదుగురు ఎమ్మెల్యేలు, కాంగ్రెస్‌కు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు మొత్తం 9 మంది నేడు ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లోని బిర్సా మండపంలో ప్రమాణ స్వీకారోత్సవం జరిగింది. కాగా.హేమంత్ సోరెన్ రాజీనామా అనంతరం రాష్ట్ర 12వ ముఖ్యమంత్రిగా 67 ఏళ్ల చంపయీ సోరెన్ ఫిబ్రవరి 2న ప్రమాణం చేశారు.

ఆయనతోపాటు కాంగ్రెస్ నాయకుడు ఆలంగిర్ ఆలం, ఆర్‌జెడి నాయకుడు సత్యానంద్ భోక్త కూడా మంత్రులుగా ప్రమాణం చేశారు. 12 మంది సభ్యులతో కూడిన క్యాబినెట్‌లో బసంత్ సోరెన్, దీపక్ బిరువా మాత్రమే కొత్త ముఖాలు. 81 మంది ఎమ్మెల్యేలతో కూడిన జార్ఖండ్ అసెంబ్లీలో జెఎంఎం కూటమికి 47 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. ఇందులో జెంఎంకు 29 మంది, కాంగ్రెస్‌కు 17, బిజెడికికి ఒక సభ్యుడు ఉన్నారు. ప్రతిపక్ష బిజెపికి 26 మంది ఎమ్మెల్యేలు ఉండగా ఎజెఎస్‌యు పార్టీకి ముగ్గురు సభ్యులు ఉన్నారు. ఎన్‌సిపి, సిపిఐ(ఎంఎల్)కి ఒక్కో సభ్యుడు ఉన్నారు. ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేలతోపాటు ఒక నామినేటెడ్ సభ్యుడు కూడా ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News