రెండంతస్తుల భవనం కుప్పకూలడంతో కొంతమంది శిథిలాల చిక్కకున్నారు. దీంతో ఎన్‌డిఆర్‌ఎఫ్, రెస్క్యూ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటన ఢిల్లీలోని కరోల్ బాగ్ ప్రాంతంలో బుధవారం ఉదయం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఎనిమిది మందిని రక్షించిన అధికారులు వారిని చికిత్స కోసం ఆస్పత్రిలో చేర్చారు. మరికొంతమంది వ్యక్తులు శిథిలాల కింద చిక్కుకున్నట్లు అనుమానిస్తున్నారు. బయటకు తీసుకొచ్చేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు.
ఈ ఘటనపై డిసిపి సెంట్రల్ ఎం హర్షవర్ధన్ మాట్లాడుతూ..”ఉదయం 9 గంటలకు ప్రసాద్ నగర్ పోలీస్ స్టేషన్‌కు బాపా నగర్ ప్రాంతం నుండి భవనం కూలినట్లు సమాచారం అందింది. సుమారు 25 చదరపు గజాల విస్తీర్ణంలో ఉన్న పాత భవనం కుప్పకూలింది. ఇప్పటి వరకు ఎనిమిది మంది వ్యక్తులు రక్షించి ఆసుపత్రికి తరలించారు. స్థానిక పోలీసులు, ఎన్‌డిఆర్‌ఎఫ్, ఢిల్లీ ఫైర్ సర్వీసెస్ మరియు, ఇతర ఏజెన్సీలు సహాయక చర్యలు చేపడుతున్నాయి. ఈ ఘటనలో ఇప్పటివరకు ఎలాంటి మరణాలు సంభవించలేదు. రెస్క్యూ ఆపరేషన్ ముగిసిన తర్వాత ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తాం” అని చెప్పారు.