Wednesday, January 22, 2025

బోరుబావి చిన్నారి కథ విషాదాంతం… మృతదేహం వెలికి తీత

- Advertisement -
- Advertisement -

భోపాల్ : మధ్యప్రదేశ్ లోని బెతుల్ జిల్లాలో నాలుగు రోజుల క్రితం బోరుబావిలో పడిన ఎనిమిదేళ్ల చిన్నారి కథ విషాదాంతమైంది. బాలుడ్ని రక్షించేందుకు 70 గంటలకు పైగా చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. శనివారం తెల్లవారు జామున చిన్నారి మృతదేహాన్ని వెలికి తీసినట్టు అధికారులు తెలిపారు. బెతుల్ జిల్లా మాండవి గ్రామానికి చెందిన 8 ఏళ్ల తన్మయ్ మూడో తరగతి చదువుతున్నాడు. గత మంగళవారం సాయంత్రం 5 గంటల సమయంలో పొలంలో ఆడుకుంటూ 400 అడుగుల లోతున్న బోరుబావిలో పడిపోయాడు.

అతడి అక్క చూసి తల్లిదండ్రులకు చెప్పింది. ఘటన జరిగిన గంట తర్వాత నుంచే పోలీసులు, రెస్కూ సిబ్బంది 40 నుంచి 50 అడుగుల లోతులో చిక్కుకున్న చిన్నారిని బయటకు తీసేందుకు బోరుబావికి సమాంతరం సొరంగం తవ్వడం మొదలు పెట్టారు. బయటి నుంచి ఆక్సిజన్ పంపించారు. అయినా అధికారుల ప్రయత్నాలు ఫలించలేదు. తన కొడుకును ప్రాణాలతో బయటకు తీసుకురావాలంటూ ఆ చిన్నారి తల్లి రోదనకు విధి కనికరించలేదు. శనివారం తెల్లవారు జామున బాలుడిని గుర్తించిన అధికారులు బోరు బావి నుంచి మృతదేహాన్ని బయటకు తీసుకొచ్చారు. దీంతో మాండవి గ్రామంలో విషాద ఛాయలు కమ్ముకున్నాయి.

సిఎం దిగ్భ్రాంతి…
ఈ ఘటనపై రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ ట్విటర్ వేదికగా దిగ్భ్రాంతి వ్యక్త చేశారు. చిన్నారి తన్మయ్ ప్రాణాలు దక్కకపోవడం తనను తీవ్రంగా కలచివేసిందన్నారు. బాధిత కుటుంబానికి రూ.4 లక్షల ఆర్థిక సాయం అందజేస్తామని సీఎం ప్రకటించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News