ప్రధాని మోడీ ఉద్ఘాటన
న్యూఢిల్లీ: కరోనా వైరస్ ప్రస్తుత సంక్షోభ సమయంలో దేశంలోని 80 కోట్ల మందికి ఉచిత రేషన్ అందినట్లు ప్రధాని నరేంద్ర మోడీ శనివారం తెలిపారు. ఇందులో ఐదు కోట్ల మంది మధ్యప్రదేశ్ ప్రజలు ఉన్నారని ఆ రాష్ట్రానికి చెందిన ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన లబ్ధిదారులతో వీడియా కాన్ఫరెన్సులో మాట్లాడుతూ ప్రధాని పేర్కొన్నారు. గడచిన 100 సంవత్సరాలలో మానవాళి ఎదుర్కొన్న అతి పెద్ద విపత్తుగా కరోనా వైరస్ మహమ్మారిని ఆయన అభివర్ణించారు. ఈ వైరస్‌ను అదుపుచేయడానికి ప్రజలు మాస్కులు ధరించడం, చేతులను శానిటైజ్ చేసుకోవడం, భౌతిక దూరాన్ని పాటించడం కొనసాగించాలని ఆయన కోరారు. కరోనా వైరస్ కారణంగా ఏర్పడిన సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు భారతదేశం మొదటిగా పేద ప్రజలకు ప్రాధాన్యత ఇచ్చిందని మోడీ తెలిపారు. మొదటిరోజు నుంచే ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన లేదా ప్రధాన మంత్రి రోజ్‌గార్ యోజన వంటి పథకాలతో పేదలకు ఆహారం, ఉపాధి కల్పించడం గురించే ఆలోచించామని ఆయన చెప్పారు. దేశీయంగా తయారయ్యే వస్తువులనే ఉపయోగించాలన్న ప్రభుత్వ ఆశయాన్ని ఆయన పునరుద్ఘాటిస్తూ రానున్న పండుగల సీజన్‌లో హస్తకళా ఉత్పత్తులనే కొనుగోలు చేసి ఈ రంగంలో పనిచేస్తున్న స్థానిక కార్మికులను ప్రోత్సహించాలని ప్రధాని ప్రజలకు పిలుపునిచ్చారు.