ఎర్రజెండ ..ఎన్‌కౌంటర్
నాలుగునెలల్లో 80 మంది నక్సల్స్ హతం
అరెస్టులు సరెండర్లు, ఛత్తీస్‌గఢ్‌లో క్యాంపులు
మావోయిస్టుల ఏరివేతపై హోం శాఖ కీలక నివేదిక
న్యూఢిల్లీ : ఈ ఏడాది గడిచిన నాలుగు నెలల్లో భద్రతా బలగాలు కనీసం 80 మంది నక్సల్స్‌ను ఎన్‌కౌంటర్లలో చంపివేశాయి. కాగా ఛత్తీస్‌గఢ్‌లో 125 మంది మావోయిస్టులు అరెస్టు అయ్యారు. 150 మంది సరెండర్ అయ్యారని అధికారులు గురువారం తెలిపారు. ఈ విధంగా 2024 ప్రారంభంలోనే నక్సల్స్‌కు భారీ షాక్ తగిలింది. రెండు రోజుల క్రితం ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన భీకర ఎన్‌కౌంటర్‌లో భద్రతా బలగాల చేతిలో 29 మంది మావోయిస్టులు మృతి చెందడం, బస్తర్ జిల్లాలోని నక్సల్స్ దళాలకు పిడుగుపాటు అయింది.
లోక్‌సభ ఎన్నికల వేళ కేంద్ర హోం మంత్రిత్వశాఖ ప్రత్యేకించి వెలువరించిన గణాంకాలు వివరాల క్రమంలో దేశంలో నక్సల్స్ సంబంధిత హింసాత్మక ఘటనల ప్రభావం తగ్గిందని వివరించారు. 2014 23 మధ్యకాలంలో ఘటనలను, 200414 నడుమ జరిగిన హింసాత్మక ఘటనలను బేరీజు వేసుకుంటే ఇప్పుడు నక్సల్స్ దాడుల సంఖ్య 52 శాతం మేర తగ్గింది.
కాగా నక్సల్స్ చర్యలలో మృతుల సంఖ్యలో 69 శాతం మేర తగ్గుదల ఉంది. గతంలో ఈ నక్సల్స్ దాడులలో మృతి చెందిన వారి సంఖ్య 6035. ఇప్పుడు ఇది 1868కు తగ్గిందని వివరాలలో తెలిపారు. మావోయిస్టుల తీవ్రవాద ప్రాబల్యం ఎక్కువగా ఉంటూ వస్తున్న ఛత్తీస్‌గఢ్‌లో ఇప్పుడు కొట్టొచ్చిన మార్పు కన్పించింది. అక్కడ గత ఏడాది డిసెంబర్‌లో విష్ణు దేవ్ ప్రభుత్వం ఏర్పాటు అయిన తరువాత పూర్తి స్థాయి చురుకైన కార్యకలాపాలు చేపట్టారు. దీనితో నక్సల్స్ బలగాలు దెబ్బతినడం, అరెస్టు కావడం, సరెండర్ కావడం జరిగిందని ప్రకటనలో తెలిపారు. దేశంలో పలు ప్రాంతాలలో నక్సల్స్ కార్యకలాపాలు తగ్గుముఖం పట్టాయని పలు ఎన్నికల సభలలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా చెపుతూ వస్తున్నారు.
ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు పరిణామాలు
గత ఏడాది చివరిలో నక్సల్స్ ప్రభావిత రాష్ట్రాలలో శాంతిభద్రతల పరిస్థితి గురించి కేంద్ర హోం మంత్రి ఆధ్వర్యంలో ఉన్నత స్థాయి సమీక్ష జరిగింది. బహుముఖ రీతిలో మావోయిస్టుల ప్రాబల్యం తగ్గించేలా చేయాలని పలు రాష్ట్రాల ఉన్నతాధికారులు, డిజిపిలు, ఇతర పోలీసు అధికారులను, ప్రత్యేకించి నిఘా విభాగానికి హోం మంత్రి ఆదేశాలు వెలువరించారు. ఓ వైపు నక్సల్స్ పట్ల ప్రజలలో వైఖరిని మార్చడం, ఇదే దశలో పెద్ద ఎత్తున ఏరివేత చర్యలకు దిగాల్సి ఉంటుందని అమిత్ షా సూచించారు. ఈ క్రమంలోనే ఓ ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు అయింది.
ఇందులో పలువురు డిజిపిలు, సిఆర్‌పిఎఫ్ డైరెక్టర్ జనరల్స్, ఇండో టిబెటియన్ బార్డర్ పోలీసు, ఇంటలిజెన్స్ బ్యూరో, యాంటి మావోయిస్టు గ్రిడ్ అధికారులు ప్రాతినిధ్యం వహించారు. వీరి మధ్య తగు సమన్వయం పూర్తి స్థాయి క్షేత్రస్థాయి కార్యాచరణ క్రమంలోనే నక్సల్స్ ఆటకట్టుకు వీలేర్పడిందని అధికారులు తెలిపారు.. ఇటీవలి కాలంలో భద్రతా పోలీసు బలగాలకు ఎక్కువగా ప్రాణనష్టం జరగకుండానే నక్సల్స్ ఏరివేత పనులు జరుగుతున్నాయి. నక్సల్స్ దాడులలో భద్రతా బలగాల సిబ్బంది మరణాల సంఖ్యలో 72 శాతం మేర తగ్గుదల ఉందని వెల్లడించారు. నక్సల్స్ మాటేసి జరిపిన దాడులలో 200414 మధ్యలో 1750 మంది వరకూ భద్రతా బలగాల వివిధ స్థాయిల వారు మృతి చెందారు.
కాగా 201423 మధ్యలో ఈ సంఖ్య 485 గా నిలిచింది. ఇక నక్సల్స్ దాడులలో ఇంతకు ముందు 4285 మంది చనిపోగా, ఇప్పుడు ఈ సంఖ్య 1383కు తగ్గిందని గణాంంకాల ద్వారా వెల్లడించారు. ఇక నక్సల్స్ ప్రభావిత జిల్లాల సంఖ్య కూడా తగ్గింది. ఇప్పుడు 2022 నాటికి దేశంలో నక్సల్స్ ప్రభావిత జిల్లాల సంఖ్య 45 అయింది. ఇంతకు ముందు ఏకంగా ఇది 96 వరకూ ఉండేది. గడిచిన ఐదేండ్లలో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలలో 5వేల వరకూ పోస్టాఫీసులు ఏర్పాటు అయ్యాయి.