16 రోజుల్లో రూ. 10 పెంపు
న్యూఢిల్లీ: దేశంలో చమురు మంటలు తగ్గడం లేదు. బుధవారం పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ లీటరుకు 80 పైసల చొప్పున పెరిగాయి. దీంతో గత 16 రోజుల్లో వీటి ధరలు లీటరుకు రూ. 10 చొప్పున లేదా 10 శాతానికి పైగా పెరిగాయి. తాజా పెంపుదలతో ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ. 105.41కి చేరుకోగా డీజిల్ ధర రూ. 96.87కి పెరిగింది. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను పురస్కరించుకుని నాలుగున్నర నెలల పాటు నిలకడగా ఉన్న పెట్రోల్, డీజిల్ ధరలు మార్చి 22 నుంచి పెరగడం మొదలైంది. గత 16 రోజులలో తాజాది 14వ ధరల పెంపు. దేశవ్యాప్తంగా అన్ని ముఖ్య నగరాలలో పెట్రోల్ ధరలు సెంచరీని దాటేశాయి. మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, ఒడిశ, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, మధ్యప్రదేశ్, బీహార్, జార్ఖండ్, తమిళనాడు, కేరళ వంటి రాష్ట్రాలలో డీజిల్ ధరలు వంద మార్కును దాటాయి. దేశంలోనే అత్యధికంగా మహారాష్ట్రలోని పర్బనిలో లీటరు పెట్రోల్ ధర రూ. 123.40 ఉండగా లీటరు డీజిల్ ధర అత్యధికంగా ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరులో రూ. 107.61 ఉంది.