ముంబై: ఎయిర్ ఇండియా విమానంలో న్యూయార్క్ నుంచి ముంబై విమానాశ్రయానికి వచ్చిన ఒక 80 సంవత్సరాల వృద్ధ ప్రయాణికుడు వీల్ చెయిర్ రావడంలో ఆలస్యం కావడంతో నడుచుకుంటూ ముందుకెళ్లి కుప్పకూలిపోయి మరణించారు. ఈ విషాద ఘనట ఫిబ్రవరి 12న జరిగింది. న్యూయార్క్ నుంచి ఎయిర్ ఇండియా విమానంలో ముంబై చేరుకున్న ఆ వృద్ధుడు తనకు వీల్ చెయిర్ సమకూర్చాలని అభ్యర్థించాడు. అయితే వీల్ చెయిర్ల కోసం చాలామంది ప్రయాణికులు ఎదురు చూస్తుండడంతో అది ఏర్పాటు చేయడానికి కొద్దిగా ఆలయస్యమవుతుందని ఎయిర్‌లైన్ సిబ్బంది తెలిపారు. అయితే తాను నడుస్తానని ఆయన చెప్పారు.
వీల్ చెయిర్‌లో కూర్చున్న తన భార్యతో కలసి ఆయన నడుచుకుంటూ ఇమిగ్రేషన్ డెస్క్ వద్దకు వెళ్లారు. అక్కడ ఆయన అస్వస్థతకు గురయ్యారు. వెంటనే విమానాశ్రయ డాక్టర్ ఆయనను పరీక్షించి వెంటనే ఆసుపత్రికి తరలించాలని సూచించారు. ఆ వృద్ధుడిని ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆయన మరణించినట్లు డాక్టర్లు ధ్రువీకరించారని ఎయిర్ ఇండియా ప్రతినిధి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆ వృద్ధుడి కుటుంబ సభ్యులకు తాము అందుబాటులో ఉన్నామని, వారికి అవసరమైన సహాయాన్ని అందచేస్తున్నామని ప్రతినిధి తెలిపారు.