అత్యవసర పరిస్థితిని ప్రకటించిన ప్రభుత్వం
రెక్జావిక్ : ఐరోపాకు చెందిన ద్వీపదేశం ఐస్‌లాండ్‌లోని రెక్జానెస్ ప్రాంతంలో సుమారు 14 గంటల వ్యవధిలో 800 ప్రకంపనలు సంభవించాయి. దాంతో ఐస్‌లాండ్ శుక్రవారం అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. రాజధాని నగరం రెక్జావిక్‌కు 40 కిమీ దూరంలో రెండు బలమైన ప్రకంపనలు సంభవించాయి. వాటి తీవ్రత రిక్టర్‌స్కేలుపై అత్యధికంగా 5.2 గా నమోదైంది.
దాంతో సమీప ప్రాంతాల్లో రహదారులు ధ్వంసం కావడంతో రాకపోకలు నిలిపివేశారు. ఇదిలా ఉండగా అక్టోబర్ చివరి నుంచి రెక్జానెస్ ప్రాంతంలో 24 వేల ప్రకంపనలు సంభవించాయి. శుక్రవారం తెల్లవారు జాము నుంచి సాయంత్రం వరకు సుమారు 800 ప్రకంపనలు నమోదయ్యాయి. ఈ ప్రకంపనల తీవ్రత మరింత ఎక్కువగా ఉండొచ్చని, ఈ వరుస ఘటనలు అగ్నిపర్వత విస్ఫోటాలకు దారి తీయొచ్చని హెచ్చరించారు. రానున్న రోజుల్లో విస్ఫోటం సంభవించే అవకాశం ఉందని ఐస్‌లాండ్ వాతావరణ విభాగం అంచా వేసింది.
ప్రస్తుతం భూ ప్రకంపనలు సంభవించిన ప్రాంతానికి మూడు కిలోమీటర్ల దూరంలో నాలుగు వేల మంది నివసిస్తున్న గ్రిండావిక్ అనే ప్రాంతం నుంచి ప్రజలను తరలించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఉత్తర అట్లాంటిక్ మహా సముద్రంలో గల ద్వీప దేశం ఐస్‌లాండ్‌లో భూకంపాలు, అగ్నిపర్వత విస్ఫోటాలు సర్వసాధారణం. ఒక్క ఐస్‌లాండ్‌లో 33 క్రియాశీలక అగ్నిపర్వత వ్యవస్థలు ఉన్నాయి.