Sunday, December 22, 2024

కేంద్ర సాయుధ బలగాల్లో 83 వేల పోస్టులు ఖాళీ

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : సిఎపిఎఫ్, సిఆర్‌పిఎఫ్, బిఎస్‌ఎఫ్ వంటి కేంద్ర సాయుధ బలగాల్లో ఉద్యోగ ఖాళీల వివరాలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఆయా విభాగాల్లో మొత్తం 10,15,237 పోస్టులకు గాను ఈ ఏడాది జనవరి 1 నాటికి 83 వేల పోస్టులు ఖాళీగా ఉన్నట్టు ప్రకటించింది. ఈమేరకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ లోక్‌సభలో ఓ ప్రశ్నకు ఇచ్చిన లిఖిత పూర్వక సమాధానంలో వివరించారు. కేంద్ర సాయుధ బలగాల్లో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ లో సీఆర్‌పిఎఫ్, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్‌ఎఫ్), సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్‌ఎఫ్) ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్(ఐటీబీపీ) , సశస్త్ర సీబాబల్ (ఎస్‌ఎస్‌బీ), అస్సాం రైఫిల్స్ విభాగాలు ఉన్నాయి. మొత్తం మంజూరైన ఉద్యోగాల్లో ప్రస్తుతం 83,127 పోస్టులు ఖాళీగా ఉన్నట్టు మంత్రి నిత్యానంద్ రాయ్ తెలిపారు.

అయితే గత ఏడాది జులై నుంచి ఈ ఏడాది జనవరి మధ్య కాలంలో 32,181 పోస్టుల్ని భర్తీ చేయగా, అదనంగా 64,444 ఖాళీలను నోటిఫై చేశామని చెప్పారు. ఈ పోస్టుల రిక్రూట్‌మెంట్ వివిధ దశల్లో ఉందని, 2023 లోనే ఈ నియామక ప్రక్రియను పూర్తి చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్టు తెలిపారు. అలాగే ఈ ఉద్యోగ ఖాళీల నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న సిబ్బంది ఓవర్‌టైమ్ పనిచేస్తున్నారని అనడం సరికాదన్నారు. సాయుధ బలగాల్లోని ఆయా బిభాగాల్లో ఉద్యోగాల భర్తీకి కేంద్ర హోం శాఖ, యూపిఎస్‌సి, ఎస్‌ఎస్‌సి , సంబంధిత బలగాల ద్వారా ఖాళీల్ని భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటోందని తెలిపారు. అంతర్గత భద్రత, శాంతిభద్రతలు, జమ్ముకశ్మీర్, ఈశాన్య ప్రాంతాల్లో ఉగ్రవాద వ్యతిరేక చర్యలని సిఆర్‌పిఎఫ్ నిర్వహిస్తుందని వివరించారు.

అలాగే పాకిస్థాన్, బంగ్లాదేశాలతో ఉన్న సరిహద్దులను బీఎస్‌ఎఫ్ కాపలా కాస్తుందని, పాకిస్థాన్ వెంబడి 3323 కిలోమీటర్ల సరిహద్దు ఉండగా, బంగ్లాదేశ్‌తో 4096 కిమీ పొడవైన సరిహద్దు ఉందని వివరించారు. న్యూక్లియర్ ప్లాంట్లు, కీలకమైన పరిశ్రమలు, మెట్రో నెట్‌వర్క్‌లు, ఇతర ముఖ్యమైన ప్రభుత్వ భవనాలను సిఐఎస్‌ఎఫ్ గార్డులు కాపలా కాస్తారని చెప్పారు. సైన్ ఇండియా 3488 కిమీ పొడవైన సరిహద్దును ఐటిబిపి గార్డులు కాపలా కాస్తారని తెలిపారు. నేపాల్‌తో భారత్‌కు ఉన్న 1751 కిమీ సరిహద్దును, భూటాన్‌తో ఉన్న 699 కిమీ సరిహద్దును ఎస్‌ఎస్‌బి గార్డులు కాపలా కాస్తారని, ఇండో మయన్మార్ 1643 కిమీ సరిహద్దును అస్సాంరైఫిల్స్ గార్డులు రక్షిస్తుంటారని, తీవ్రవాద వ్యతిరేక చర్యలు చేపడుతుంటారని చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News