బీజింగ్ : ఉత్తర చైనా షాంగ్జీ ప్రావిన్స్ లోని లిషి జిల్లాలో ఓ ప్రైవేట్ బొగ్గు గని సంస్థ కార్యాలయంలో గురువారం అగ్ని ప్రమాదం సంభవించి 26 మంది మృతి చెందారు. లిషి జిల్లా లోని లియులియాంగ్ నగరంలో ఈ గని కార్యాలయం ఉంది. గురువారం ఉదయం ఏడు గంటల ప్రాంతంలో భవనం రెండో అంతస్తులో మంటలు చెలరేగి మిగిలిన అంతస్తులకు వ్యాపించాయి. ఆ సమయంలో భవనంలో సుమారు 90 మంది ఉండగా, మంటల తీవ్రత పెరిగి వారిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు.
మరో 60 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం సమాచారం తెలియగానే వెంటనే సహాయక బృందాలు సంఘటన స్థలానికి చేరుకున్నాయి. గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించాయి. అమెరికా పర్యటనలో ఉన్న చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ఈ ప్రమాదంపై వివరాలు తెలుసుకున్నారు. సహాయక కార్యక్రమాలు వేగవంతం చేసి గాయపడిన వారికి తగిన వైద్యం అందించాలని అధికారులకు ఆదేశించారు. కీలకమైన పారిశ్రామిక ప్రాంతాల్లో ప్రజలకు ఇబ్బందులు లేకుండా భద్రత కల్పించాలని కోరారు.