Monday, December 23, 2024

84 మంది కళాకారులకు సంగీత్ నాటక్ అకాడమీ అమృత్ అవార్డులు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : కళలకు సంబంధించిన వివిధ రంగాల్లో నిష్ణాతులైన 84 మంది కళాకారులకు ఉపరాష్ట్రపతి జగ్‌దీప్ ధన్‌ఖర్ శనివారం వన్‌టైమ్ సంగీత్ నాటక్ అకాడమీ అమృత్ అవార్డులను ప్రదానం చేశారు. ఇంతవరకు ఎలాంటి జాతీయ గౌరవం పొందని, 75 ఏళ్లు దాటిన వయోవృద్ధ కళాకారుల కోసం ఈ అవార్డులు ప్రత్యేకించారు. ఈ కళాకారులు తాము అందించిన విశిష్ట సేవలకు గుర్తింపుగా ఈ అవార్డులు ప్రదానం చేయడం దేశ చరిత్రలో మొట్టమొదటిసారి అని ఉపరాష్ట్రపతి జగ్‌దీప్ ధన్‌ఖర్ పేర్కొన్నారు. ఇంతవరకు ఎలాంటి జాతీయ గుర్తింపునకు నోచుకోని వీరిని గౌరవించడం భారతీయ సంస్కృతిని గౌరవించడమే అవుతుందని, భారతీయ కీర్తిని మరింత పెంపొందిస్తుందని శ్లాఘించారు.

ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక పథకాల ద్వారా ఇటువంటి కళాకారులకు నిర్మాణాత్మక పద్ధతిలో సహాయం కల్పించడం ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు. ప్రపంచంలో 500 నుంచి 700 సంవత్సరాలకు మించి చరిత్ర లేని దేశాలు కొన్ని ఉన్నాయని, కానీ భారతీయ కళా సంస్కృతికి 5000 సంవత్సరాల ప్రాచీన చరిత్ర ఉందని కొనియాడారు. అందువల్ల ఈ కళాకారులను ప్రశంసించడం చాలా ముఖ్యమని పేర్కొన్నారు. వారి భద్రత, సంరక్షణ, పోషణ, కోసం నిర్మాణాత్మక పద్ధతిలో సహకరించవలసి ఉందన్నారు. ప్రభుత్వం అనేక వినూత్న పథకాలను అమలు చేస్తున్నట్టు తనకు తెలుసని, ఆ పథకాల ద్వారా కళాకారుల సహాయం పొందగలుగుతారని ఆశాభావం వెలిబుచ్చారు.

84 మంది కళాకారుల వివరాలు
అవార్డులు పొందిన 84 మంది కళాకారుల్లో 70 మంది పురుషులు కాగా, 14 మంది మహిళలు ఉన్నారు. జమ్ముకశ్మీర్‌కు చెందిన క్రిషెన్ లంగూ (థియేటర్, సంగీతం), గోవాకు చెందిన జాన్ క్లారో ఫెర్నాండెజ్ (నాటక రచన), ఝార్ఖండ్‌కు చెందిన మహావీర్ నాయక్ (జానపద సంగీతం, నృత్యం), లడ్డాఖ్ నుంచి సెరింగ్ స్టాంజిన్ (జానపద సంగీతం) అవార్డులు పొందిన వారిలో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి ముగ్గురు, అరుణాచల్ ప్రదేశ్ నుంచి ఇద్దరు, మహారాష్ట్ర నుంచి ఆరుగురు అవార్డులు అందుకున్నారు. ఉత్తరప్రదేశ్, గుజరాత్ నుంచి ముగ్గురు, పంజాబ్, ఢిల్లీ నుంచి ఒక్కొక్కరు, బీహార్, ఒడిశా, పశ్చిమబెంగాల్, మణిపూర్, మధ్యప్రదేశ్, తమిళనాడు,

కేరళ, కర్ణాటక రాష్ట్రాల నుంచి నలుగురేసి వంతున, అస్సాం, రాజస్థాన్ ల నుంచి ఐదుగురేసి వంతున అవార్డులకు ఎంపికయ్యారు. వీరికి తామ్రపత్రం, అంగవస్త్రంతోపాటు రూ. లక్షవంతున నగదు బహుమానం లభిస్తుంది. సంగీత్ నాటక్ అకాడమీ ఛైర్మన్ సంధ్యా పురేచ మాట్లాడుతూ భారతీయ కళలను, సంస్కృతిని తమ యావత్ జీవితం సంరక్షిస్తూ కృషి చేస్తున్నవారికే ఈ అవార్డులు లభించాయన్నారు. కేంద్ర న్యాయ సహాయ మంత్రి అర్జున్‌రామ్ మేఘ్వాల్, కేంద్ర సాంస్కృతిక సహాయ మంత్రి మీనాక్షిలేఖి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 16 నుంచి 20 వరకు అకాడమీ కాంప్లెక్సులో నాలుగు రోజుల పాటు అకాడమీ ఉత్సవాలు నిర్వహిస్తన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News