న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వ విభాగాలలో 9.79 లక్షల ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి. ఈ విషయాన్ని కేంద్రం తరఫున సిబ్బంది వ్యవహారాల సహాయ మంత్రి జితేంద్ర సింగ్ గురువారం లోక్‌సభకు తెలిపారు. మొత్తం 9,79,327 పోస్టులు కేంద్ర విభాగాలలో భర్తీ కాకుండా ఉన్నాయని, ఇందులో 23,584 గ్రూప్ ఎ పోస్టులు , 1,18,807 గ్రూప్ బి, 8,36,936 గ్రూప్ సి పోస్టులు ఖాళీగా ఉన్నట్లు వివరించారు. ఇక రైల్వే మంత్రిత్వశాఖలో 2,93,943 పోస్టులు, రక్షణ మంత్రిత్వశాఖ (సివిల్)లో 2,64,704, హోం వ్యవహారాలలో 1,43,536 పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు.
కేంద్ర విభాగాలలో ఇప్పటికైతే దాదాపు 4,035,203 పోస్టుల భర్తీకి ఆమోదం దక్కింది. కాంగ్రెస్ ఎంపి దీపక్ బైజు అడిగిన ప్రశ్నకు కేంద్రం తరఫున మంత్రి సమాధానం ఇచ్చారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాలు, పిఎస్‌యులు, స్వయం ప్రతిపత్తి సంస్థలు, బ్యాంకులు, ఇతరత్రా విభాగాలలో దాదాపు 1.47 లక్షల ఉద్యోగ నియామకాలు జరిగినట్లు మంత్రి తెలిపారు. రైల్వే ఇప్పుడు 12,20,064 ఉద్యోగులతో సాగుతోంది. మొత్తం తీసుకోవల్సిన ఆమోదిత ఉద్యోగుల సంఖ్య 15,14,007గా ఉంది. కీలకమైన రక్షణ శాఖ పనుల విభాగానికి సంబంధించి మొత్తం 6,46,042 ఉద్యోగాల నియామకాలకు ఆమోదం దక్కింది. అయితే ఇందులో ఇప్పటికీ 2,64,707 ఉద్యోగాలకు ఖాళీలు ఉన్నాయి.