యుఎస్‌లో తాజాగా అతి శీతల వాతావరణంతో పరిస్థితులు దుర్భరంగా మారగా కనీసం తొమ్మిది మంది మరణించారు. వారిలో ఎనిమిది మంది ఒక్క కెంటుక్కీలోనే మృతి చెందారు. భారీ వర్షానికి నీటి కయ్యలు పొంగిపోగా రోడ్లపై వరద వెల్లువెత్తింది. వరద నీటిలో చిక్కుకుపోయిన వందలాది మందిని రక్షించవలసి వచ్చిందని కెంటుక్కీ గవర్నర్ ఆండీ బెషియర్ వెల్లడించారు. వరద ప్రవాహంలో కార్లు చిక్కుకుపోవడం వల్ల చాలా మంది మృతి చెందారని, వారిలో ఒక తల్లి,ఏడు సంవత్సరాల పిల్లవాడు కూడా ఉన్నారని బెషియర్ తెలిపారు. భారీ వర్షాలకు దాదాపు 39 వేల్ల ఇళ్లకు విద్యుత్ అంతరాయం వాటిల్లిందని ఆయన చెప్పారు. అయితే, కొన్ని ప్రాంతాల్లో పెను గాలులకు విద్యుత్ సరఫరాకు అంతరాయం వాటిల్లవచ్చునని ఆయన హెచ్చరించారు.
కెంటుక్కీతో పాటు అమెరికాలో చాలా భాగం దుర్భరమైన శీతల వాతావరణం నెలకొంది. ఉత్తర మైదాన ప్రాంతాల్లో చలి బాగా వణికిస్తోంది. జార్జియా, ఫ్లోరిడాలోని కొన్ని ప్రాంతాల్లో సుడిగాలి ముప్పు ఉందని హెచ్చరించారు. బోన్నీవిల్లె ప్రాంతంలో శనివారం రాత్రి తల్లి, పిల్లవాడు వరద ప్రవాహంలో కొట్టుకుపోయారని హార్ట్ కౌంటీ కరోనర్ టోనీ రాబర్ట్ తెలిపారు. క్లే కౌంటీలో 73 ఏళ్ల వృద్ధుడు వరదనీటిలో విగతజీవిగా కనిపించినట్లు కౌంటీ అత్యవసర విపత్తు స్పందన విభాగం డిప్యూటీ డైరెక్టర్ రెవెల్ బెర్రీ చెప్పారు. కెంటుక్కీ, టెన్నిస్సీలోని కొన్ని ప్రాంతాల్లో వారాంతపు తుపానుల్లో 15 సెంమీ వర్షపాతం నమోదైందని జాతీయ వాతావరణ సంస్థ సీనియర్ అధికారి బాబ్ ఓరవెక్ తెలిపారు. అట్లాంటాలో ఒక భారీ వృక్షం ఇంటిపై పడగా ఒక వ్యక్తి మరణించినట్లు అట్లాంటా అగ్నిమాపక దళ అధికారి విలేకరులతో చెప్పారు.