9 మంది కూలీల మృతి.. 15 మందికి గాయాలు
తుముకూరు(కర్నాటక): కర్నాటకలోని కలంబెల్లా సమీపంలో గురువారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 9 మంది మరణించగా మరో 15 మంది గాయపడ్డారు. రాయచూరు జిల్లా నుంచి దినసరి కూలీలతో బెంగళూరుకు వెళుతున్న క్రూజర్ వాహనం తెల్లవారుజామున 4.30 గంటల ప్రాంతంలో ఎదురుగా వస్తున్న లారీని ఢీకొన్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. క్రూజర్ వాహనంలో మొత్తం 24 మంది ప్రయాణికులు ఉన్నట్లు వారు చెప్పారు. మృతులలో కొందరు పిల్లలు కూడా ఉన్నట్లు వారు తెలిపారు. బుధవారం మధ్యాహ్నం 1 గంటకు రాయచూరు నుంచి క్రూజర్ వాహనంలో రోజు వారీ కూలీలంతా బయల్దేరారని, గురువారం తెల్లవారుజామున 4.30 గంటల ప్రాంతంలో క్రూజర్ ఒక లారీని ఓవర్‌టేక్ చేసి ముందుకెళ్లగా వెనుక నుంచి ఆ లారీ ఢీకొనడంతో క్రూజర్ డివైడర్‌ను ఢీకొని పల్టీ కొట్టిందని వారు తెలిపారు. ప్రమాద స్థలిలోనే 9 మంద మరణించగా గాయపడిన 15 మందిని సమీపంలోని జిల్లా అసుపత్రికి తరలించినట్లు వారు చెప్పారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో వీరిని బెంగళూరులోని నిమ్హాన్స్‌కు తరలించినట్లు తుముకూరు డిప్యుటీ కమిషనర్ వైఎస్ పాటిల్ తెలిపారు. ఈ దుర్ఘటనపై ప్రధాని నరేంద్ర మోడీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు, క్షతగాత్రులకు ఆయన ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.