న్యూఢిల్లీ: విదేశీ వ్యశమారాల శాఖ మంత్రి ఎస్ జైశంకర్ సహా రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన తొమ్మిది మంది సభ్యులు సోమవారం సభ్యులుగా ప్రమాణం చేశారు. రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌కర్ పార్లమెంట్ హౌస్‌లోని రాజ్యసభ చాంబర్‌లో వీరి చేత ప్రమాణం చేయించారు. జైశంకర్ ఇంగ్లీషులో ప్రమాణం చేశారు. జైశంకర్ రాజ్యసభకు ఎన్నిక కావడం ఇది రెండో సారి. జైశంకర్ కాకుండా ప్రమాణం చేసిన బిజెపి సభ్యుల్లో గుజరాత్‌కు చెందిన బాబూభాయ్ జెసంగ్ భాయ్ దేశాయ్, కేస్రిదేవ్ సింగ్, దిగ్విజయ్ సింగ్ ఝాలా, పశ్చిమ బెంగాల్‌కు చెందిన నాగేంద్ర రాయ్ ఉన్నారు.
ఐదుగురు తృణమూల్ కాంగ్రెస్ సభ్యులు డెరిక్ ఒబ్రియాన్, డోలా సేన్, సుఖేందు శేఖర్ రాయ్, ప్రకాశ్ చిక్ బరైక్, సమీరుల్ ఇస్లాం కూడా సభ్యులుగా ప్రమాణం చేసిన వారిలో ఉన్నారు. ఒబ్రియాన్, సేన్, ఇస్లాంలు బెంగాల్‌లో ప్రమాణం చేశారు. సోమవారం ప్రమాణం చేసిన తొమ్మిది మందిలో ఐదుగురు కొత్తగా ఎన్నికైన సభ్యులు ఉన్నారు. రాజ్యసభా నాయకుడు, కేంద్రమంత్రి పీయూష్ గోయల్, రాజ్యసభ సెక్రటరీ జనరల్ పిసి మోడీ, సెక్రటేరియట్‌కు చెందిన ఇతర సీనియర్ అధికారులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.