ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణ్‌పూర్, కంకెర్ జిల్లాలో సరిహద్దుల్లోని అడవుల్లో మంగళవారం భద్రతా దళాల ఎదురుకాల్పులలో ముగ్గురు మహిళలతోసహా 9 మంది నక్సలైట్లు మరణించారు. గత 15 రోజుల్లో భద్రతా దళాల ఎదురుకాల్పులలో ఇంత పెద్ద సంఖ్యలో నక్సలైట్లు మరనించడం ఇది రెండవసారి. రాష్ట్రంలో జరుగుతున్న నక్సల్ వ్యతిరేక ఆపరేషన్‌లో ఇదో భారీ విజయమని ఛత్తీస్‌గఢ్ ఉప ముఖ్యమంత్రి విజయ్ శర్మ ఒక వీడియో సందేశంలో తెలిపారు. నక్సలైట్లకు గట్టి పట్టు ఉన్న ప్రాంతంగా భావించే అభూజ్‌మడ్‌లోని టేక్‌మెట, కాకూర్ గ్రామాల మధ్య ఉన్న అటవీ ప్రాంతంలో ఉదయం 6 గంటలకు కాల్పుల పోరు జరిగిందని పోలీసులు తెలిపారు. నక్సల్ ఏరివేత కోసం జిల్లా రిజర్వ్ గార్డు(డిఆర్‌జి), ప్రత్యేక టాస్క్ ఫోర్స్(ఎస్‌టిఎఫ్) సంయుక్తంగా గాలింపు జరిపినపుడు ఈ ఘటన జరిగిందని వారు చెప్పారు. గాలింపు చర్యలు సోమవారం రాత్రి ప్రారంభం కాగా అభూజ్‌మడ్ ప్రాంతంలో మంగళవారం ఉదయం ఎన్‌కౌంటర్ జరిగిందని రాష్ట్ర హోం శాఖను కూడా నిర్వర్తిస్తున్న డిప్యుటీ ముఖ్యమంత్రి శర్మ తెలిపారు.
ముగ్గురు మహిళలతోసహా 9 మంది నక్సలైట్లు ఎదురుకాల్పులలో హతమయ్యారని, వారి మృతదేహాలను స్వాధీనం బలగాలు స్వాధీనం చేసుకున్నాయని ఆయన చెప్పారు. ఈ కాల్పుల పోరులో భద్రతా దళాలకు ఎటువంటి హాని జరగలేదని ఆయన వివరించారు. ఘటనా స్థలి నుంచి ఒక ఎకె 47 తుపాకీ, ఆయుధాలు మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. ఈ ఆపరేషన్‌ను గొప్ప విజయంగా అభివర్ణించిన శర్మ భద్రతా సిబ్బందిని అభినందించారు. నక్సలైట్లు ఆయుధాలు వదలిపెట్టి జన జీవన ప్రవంతిలో కలవాలని కూడా ఆయన పిలుపునిచ్చారు. చర్చల ద్వారా ఈ సమస్యకు పరిష్కారం కనుగొనాలని ముఖ్యమంత్రి విష్ణు దేవ్ సాయి సారథ్యంలోని రాష్ట్ర ప్రభుత్వం కోరుకుంటోందని, నక్సల్స్‌కు చెందిన పెద్ద దళం కాని చిన్న దళం కాని వీడియో కాల్ ద్వారా లేదా మధ్యవర్తి ద్వారా చర్చలు జరపాలని భావిస్తే తాము అందుకు సిద్ధమని, వారికి మెరుగైన పునరావాస ప్యాకేజ్ అందచేస్తామని కూడా శర్మ ప్రకటించారు.
జన జీవన స్రవంతిలో కలవాలని వారిని కోరుతున్నానమని, బస్తర్‌లో శాంతి నెలకొని ఆ ప్రాంతం అభివృద్ధి చెందాలని తాము ఆశిస్తున్నామని ఆయన తెలిపారు. కాగా..మరణించిన నక్సలైట్ల వివరాలు ఇంకా తెలియరాలేదని పోలీసులు తెలిపారు. తాజా సంఘటనతో కలిపి ఈ ఏడాదిలో ఇప్పటివరకు బస్తర్ ప్రాంతంలో జరిగిన వేర్వేరు ఎన్‌కౌంటర్లలో 88 మంది నక్సలైట్లు మరణించారని పోలీసులు తెలిపారు. ఏప్రిల్ 16న కంకెర్ జిల్లాలో జరిగిన భద్రతా దళాల ఎదురుకాల్పులలో 29 మంది నక్సలైట్లు మరణించారు.