భద్రతా బలగాలపై దాడులు చేసిన, రూ. 43 లక్షల సంచిత బహుమతి ప్రకటించిన తొమ్మది మంది కరుడుగట్టిన నక్సలైట్లు ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో శనివారం లొంగిపోయినట్లు పోలీసులు తెలిపారు. లొంగిపోయిన కేడర్లలో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు. వారంతా సుక్మాలోని సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్(సిఆర్‌పిఎఫ్)కు చెందిన పోలీసు అధికారి ముందు లొంగిపోయారు. ఈ విషయాన్ని సుక్మా పోలీస్ సూపరింటెండెంట్ కిరణ్ చవాన్ తెలిపారు. లొంగిపోయిన నక్సలైట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ‘మీ గ్రామం’ (నియద్ నెల్లనార్) పథకంకు ప్రభావితులయ్యారని ఆయన వివరించారు. ఇంకా ఆయన లొంగిపోయిన నక్సలైట్లలో రూ. 8 లక్షల రివార్డు ఉన్న రన్‌సాయి అలియాస్ ఓయం బుస్కా(34), ప్రదీప్ అలియాస్ రవ్వ రాకేశ్(20) ఉన్నారు.
అలాగే రూ. 5 లక్షల రివార్డు ఉన్న మరి నలుగురు ఇతర కేడర్లు ఉన్నారు. కాగా ఓ మహిళా నక్సలైటుకు రూ. 3 లక్షల రివార్డు, మరి ఇద్దరికి రూ. 2 లక్షల రివార్డు ఉన్నట్లు తెలిపారు. లొంగిపోయిన నక్సలైట్లు 2017లో బుర్కపల్(సుక్మా), 2020లో మిన్పా(సుక్మా) మెరుపుదాడులలో పాల్గొన్నవారు. ఇక ఈ నక్సలైట్ల లొంగుబాటులో కొంట పోలీస్ స్టేషన్, జిల్లా రిజర్వు గార్డ్, ఇంటెలిజెన్స్ బ్రాంచ్ టీమ్, 2 ఇంకా 223 బెటాలియన్ సిబ్బంది ముఖ్య పాత్ర పోషించారని కిరణ్ చవాన్ తెలిపారు. గత ఏడాది సుక్మా సహా తొమ్మది జిల్లాలు ఉన్న బస్తర్ ప్రాంతంలో 792 మంది నక్సలైట్లు లొంగిపోయారన్నది ఇక్కడ గమనార్హం.