హైదరాబాద్: కిడ్నీ రాకెట్ దందాలో తొమ్మది మందిని అరెస్టు చేశామని రాచకొండ సిపి సుధీర్ బాబు తెలిపారు. ఈ సందర్భంగా కిడ్నీ రాకెట్ కేసుపై సుధీర్ బాబు మీడియాతో మాట్లాడారు. వైద్యులు, రోగుల దాతలకు మధ్య పవన్ అనే వ్యక్తి దళారిగా ఉన్నాడన్నారు. గతంలో జనని ఆస్పత్రి నిర్వహించారని దానిపైనా దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. ఒక్కో శస్త్ర చికిత్సకు రూ. 50 లక్షల నుంచి 60 లక్షలు వసూలు చేస్తున్నారని సిపి తెలియజేశారు. నలుగురు దాతలు, గ్రహీతల వల్ల విషయం బయటకొచ్చిందన్నారు.
సుమంత్..విదేశాల్లో ఎంబిబిఎస్ పూర్తి చేసి అలకనంద ఆస్పత్రిని నిర్వహిస్తున్నారని, గతంలో అవినాశ్ జనని, అరుణ ఆస్పత్రులు నిర్వహించిన అనుభవం ఉందని, అలకనంద ఆస్పత్రి లో 20 కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్సలు జరిగాయని స్పష్టం చేశారు. సుమంత్ తో కలిసి అవినాష్ కిడ్నీ రాకెట్ నిర్వహించారని వెల్లడించారు. కిడ్నీ మార్పిడి సర్జరీలు చేసేలా అవినాష్ కు లక్మణ్ సలహా ఇచ్చాడని, దాతలకు రూ. 5 లక్షలు ఇచ్చి మిగతాది పంచుకోవచ్చని చెప్పారన్నారు. కిడ్నీ రాకెట్ దందాలో ప్రదీప్, మిశ్రా, గోపి, రవి, రవీందర్, హరీష్, సాయి నిందితులను అరెస్టు చేశామని తెలియజేశారు. ఇంకొందరు నిందితులున్నారని, త్వరలోనే అరెస్టు చేస్తామని సిపి సుధీర్ బాబు పేర్కొన్నారు.