Sunday, December 22, 2024

బెంగాల్ పంచాయతీ ఎన్నికల పోలింగ్‌లో 9 మంది మృతి

- Advertisement -
- Advertisement -

కోల్‌కత: పశ్చిమ బెంగాల్‌లో మూడు అంచెల పంచాయతీ ఎన్నికల పోలింగ్ శనివారం ఉదయం ప్రారంభమైంది. పోలింగ్‌కు సంబంధించి జరిగిన హింసాత్మక ఘటనలలో 9 మంది మరనించినట్లు అధికారులు తెలిపారు. మృతులలో ఐదుగురు టిఎంసి సభ్యులతోపాటు బిజెపి,, సిపిఎం, కాంగ్రెస్‌కు చెందిన ఒక్కో కార్యకర్త ఉన్నారు. ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి మద్దతుదారుడు ఒకరు కూడా మృతులలో ఉన్నట్లు అధికారులు చెప్పారు.

పోలింగ్ సందర్భంగా చోటుచేసుకున్న హింసాత్మక ఘర్షణలలో పలువురు గాయపడ్డారు. రెండు పోలింగ్ బూత్‌లలో బ్యాలట్ బాక్సులు ధ్వంసమయ్యాయి. రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాలలోగల 3,887 సీట్లలో ఉదయం 7 గంటలకు పోలింగ్ మొదలైంది. బరిలో ఉన్న 2.06లక్షల మంది అభ్యర్థుల భవితవ్యాన్ని 5.67 కోట్ల మంది ఓటర్లు తేల్చనున్నారు. ఉదయం 9 గంటల వరకు 10.26 శాతం పోలింగ్ నమోదైంది.

ఉత్తర 24 పరగణాల జిల్లాలోని వేర్వేరు ప్రాంతాలను గవర్నర్ సివి ఆనంద బోస్ సందర్శించి హింసాత్మక ఘటనల్లో గాయపడిన వారిని, ఓటర్లను కలుసుకున్నారు. కూచ్‌బిహార్ జిల్లాలోని ఫలిమారి గ్రామ పంచాయతిలో బిజెపి పోలింగ్ ఏజెంట్ మాధవ్ బిశ్వాస్ హత్యకు గురయ్యారు. బిజెపి ఏజెంట్ పోలింగ్ బూత్‌లోకి ప్రవేశించకుండా టిఎంసి కార్యకర్తలు అడ్డుకున్నారని, ఈ సందర్భంగా జరిగిన వాగ్వివాదంలో బిశ్వాస్‌ను టిఎంసి కార్యకర్తలు చంపివేశారని బిజెపి ఆరోపించింది. ఉత్తర 24 పరగణాల జిల్లాలోని కదంబగచ్చి ప్రాంతంలో ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి మద్దతుదారుడు హత్యకు గురయ్యాడని పోలీసులు తెలిపారు.

ముర్షీదాబాద్ జిల్లాలోని కపస్‌దంగ ప్రాంతంలో శుక్రవారం రాత్రి ఎన్నికలకు సంబంధించిన హింసాత్మక ఘటనలో బాబర్ అలీ అనే టిఎంసి కార్యకర్త మరణించినట్లు పోలీసులు తెలిపారు. అదే జిల్లాలోని ఖర్‌గ్రామ్ ప్రాంంలో సమీరుద్దీన్ షేక్ అనే మరో టిఎంసి కార్యకర్త హత్యకు గురయ్యాడు. కూచ్ బిహార్ జిల్లాలోని తుఫాన్‌గంజ్ 2 పంచాయతి సమితిలో తమ బూత్ కమిటీ సభ్యుడు గణేష్ సర్కార్ కూడా బిజెపి కార్యకర్తల దాడిలో మరణించినట్లు టిఎంసి ఆరోపించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News