నరమాంస భక్షకిగా మారిన తోడేలును చంపేందుకు ముఖ్యమంత్రి ఆదేశాలపై తొమ్మిదిమంది షూటర్స్‌తో ఒక బృందాన్ని బహ్రాయిచ్ అడవుల్లోకి పంపుతున్నట్లు బుధవారం ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు. వీరిలో ఆరుగురు షూటర్స్ అటవీ శాఖకు చెందిన వారు కాగా ముగ్గురు పోలీసు శాఖకు చెందిన వారని బహ్రాయిచ్ డివిజనల్ అటవీ అధికారి అజిత్ ప్రతాప్ సింగ్ తెలిపారు. ఈ మొత్తం ఆపరేషన్‌ను మూడు ప్రధాన విభాగాలుగా విభజించినట్లు ఆయన చెప్పారు. మూడు విభాగాలకు మూడు ప్రత్యేక బృందాలు ఉంటాయని, వీటితోపాటు రిజర్వ్‌లో మరో బృందం ఉంటుందని ఆయన తెలిపారు. ప్రతి విభాగంలో ముగ్గురు షూటర్స్ ఉంటారని ఆయన వివరించారు. మనుషులను చంపుతున్న తోడేలును గుర్తించి దాన్ని జూకు తరలించడం లేదా కాల్చి వేయడం ఈ బృందాల ప్రధాన లక్షమని ఆయన తెలిపారు.
నరమాంసానికి అలవాటు పడిన ఆ తోడేలు స్వేచ్ఛగా అడవిలో తిరగడానికి వీల్లేదని, దాన్ని బంధించి జూకు పంపడం లేదా కాల్చివేయడం ఒక్కటే తమ ముందున్న కర్తవ్యమని ఆయన తెలిపారు. మత్తు మందుతో కూడిన సిరంజితో తోడేలును బంధించి, దాన్ని జూకు తరలించడమే తమ తొలి ప్రాధాన్యతని, అయితే అవసరమైతే దాన్ని కాల్చివేయడానికి కూడా వెనుకాడబోమని ఆయన తెలిపారు. బహ్రాయిచ్‌లో మార్చి నుంచి మనుషులపై తోడేలు దాడి చేయడం పరిపాటిగా మారింది. వర్షాకాలం మొదలైన తర్వాత జులై 17 నుంచి తోడేలు దాడులు ఉధృతమయ్యాయి. సోమవారం వరకు మొత్తం 8 మంది తోడేలు దాడిలో మరణించగా వీరంతా పిల్లలే కావడం గమనార్హం. తోడేలు దాడిలో ఇప్పటివరకు 30 మందికి పైగా గాయపడ్డారు.