Monday, December 23, 2024

మోడీ పాలన వైఫల్యాల పుట్ట!

- Advertisement -
- Advertisement -

గత 9 ఏళ్ళలో మోడీ పరిపాలనా తీరుపై నిష్పాక్షిక పరిశీలన జరిపితే అంతటా వైఫల్యాలే కనిపిస్తున్నాయి. నిజానికి భారత ప్రజలు కాంగ్రెస్ సుదీర్ఘ పాలనా తీరుతో విసిగివేసారి ఉన్న సమయంలో బిజెపి ఆశాకిరణంలా ప్రజలకు కనిపించింది. మోడీ నాయకత్వంలో గుజరాత్ అవినీతి రహిత, సమర్ధ, అభివృద్ధి మోడల్‌పై జరిగిన ప్రచార హోరులో ప్రజలు బిజెపిపై అనేక ఆశలు, నమ్మకాలు పెట్టుకున్నారు. తమకు మెరుగైన జీవితం లభిస్తుందని, సామాజక, ఆర్థిక రంగాలలో భారత దేశం అభివృద్ధి పథంలో నడుస్తుందని ఆశించారు. అందుకే రెండు సార్లు అఖండ మెజరిటీ ఇచ్చారు. బిజెపి ఎన్నికల సమయంలో ప్రజలకు చేసిన వాగ్దానాలు, వచ్చిన ఫలితాలపై నిష్పాక్షిక విచారణ జరిపితే ప్రజల బతుకులు ‘పెనంపై నుంచి పొయ్యిలోకి’ జారిన చందంగా తయారైంది. ధనవంతులు మరింత ధనవంతులుగా, పేదలు మరింత పేదలుగా మారారు. కార్పొరేటు శక్తులకే ప్రభుత్వపరంగా ప్రోత్సాహం లభించింది. వారికే ప్రపంచ కుబేరుల స్థానం దక్కింది.

మనువాదం, హిందుత్వవాదం వెలుగులోకి వచ్చి పరమత ద్వేషం పెరిగింది. మైనారిటీలపై దాడులు పెరిగాయి. వారి వేష భాషలపై, ఆహార, విహారాలపై ఆంక్షలు పెరిగాయి. వ్యక్తిగత మత విశ్వాసాలపై దుష్ప్రచారం పెరిగింది. రాజ్యాంగ సంస్థలైన ఎన్నికల కమిషన్, న్యాయ వ్యవస్థ, ఆర్‌బిఐ, ఇడి, సిబిఐ వంటి సంస్థలు తమ స్వేచ్ఛను, విశ్వసనీయతను కోల్పోయాయి.అవి ప్రభుత్వ జేబు సంస్థలుగా మారాయని విమర్శలు వచ్చాయి.దేశ ప్రజలకు ఎన్నికల మేనిఫెస్టోలో చేసిన వాగ్దానాలు వమ్ముచేసి, అసమర్థ, అసంబద్ధ పాలనా విధానాలను మోడీ అనుసరించారు.మోడీ తన ఆర్భాట ప్రసంగాలతో, హావ భావ విన్యాసాలతో, ఆచరణకు నోచుకోని హామీలతో, దేశ ప్రజలను బురిడీ కొట్టించారు. దేశం అన్ని రంగాలలో అధోగతి పాలయింది. ప్రజాస్వామ్య విలువలు, మీడియా స్వేచ్ఛ నశించాయి. దేశ వ్యవసాయ, పారిశ్రామిక, ఉద్యోగ, ఉపాధి రంగాలు గతం కంటే గణనీయంగా క్షీణించాయి. వ్యవసాయ, పారిశ్రామిక ఉత్పత్తుల ఎగుమతులు పడిపోయి, దిగుమతులు మరింత పెరిగాయి.

రాజ్యాంగం ప్రజలకు ఇచ్చిన పౌర, మానవ హక్కులపై దాడి పెరిగింది. ప్రజల మధ్య ఆర్థిక అంతరాలు మరింత పెరిగాయి. ఆర్‌ఎస్‌ఎస్ నేపథ్యంలో, మితవాద, నిరంకుశ, మతతత్త్వ పాలన దేశంలో కొనసాగుతున్నది. ప్రజా సంక్షేమం అడుగంటింది. నిరుద్యోగం, అవినీతి తారస్థాయికి చేరాయి. గతంలో కాంగ్రెస్‌ను విమర్శించిన బిజెపి అవే కాంగ్రెస్ అవలక్షణాలను పుణికిపుచ్చుకున్నది. బిజెపిలో అవినీతి నాయకుల సంఖ్య పెరిగింది. ఇతర పార్టీల నుండి బిజెపిలోకి పార్టీ ఫిరాయించిన నేతలతో కలిసి దేశ సంపదను లూటీ చేస్తున్నారు. వారికి దర్యాప్తు సంస్థల నుండి రక్షణ లభించింది. బిజెపిలో కూడా ఆశిత్ర పక్షపాతం, కుల, మత, వంశ, కుటుంబ వారసత్వం పెరిగింది.కాంగ్రెస్ హయాంలో స్విట్జర్లాండ్, సింగపూర్ మొదలైన విదేశీ బ్యాంకుల్లో అవినీతిపరులు లక్షలు కోట్లు దాచుకున్నారని విస్తృతంగా ప్రచారం చేశారు. తమకు అధికారం ఇస్తే దాన్ని 100 రోజుల్లో వెనక్కి తెచ్చి ఒక్కొక్కరి ఖాతాలో 15 లక్షల రూపాయలు జమ చేస్తామని మోడీ వాగ్దానం చేశారు.

కానీ ఈ వాగ్దానం నేటికీ నెరవేర లేదు. కనీసం వారి పేర్లను కూడా అధికారికంగా బహిర్గతం చేయలేదు. నామమాత్రం కొందరి పేర్లు వెలువడ్డా వారిపై ప్రభుత్వ చర్యలు శూన్యం. వారిలో ఒక్కరినీ కూడా దేశానికి రప్పించిందీ లేదు, వారిను చట్టప్రకారం శిక్షించిందీలేదు. వారి అక్రమ ఆస్తులను బహిరంగ వేలం వేసిందీ లేదు. పైగా గతంలో కంటే విదేశీ బ్యాంకుల్లో హవాలా మార్గంలో అవినీతి సొమ్ము మరింత చేరిందని నివేదికలు చెబుతున్నాయి. అలాగే 2022 నాటికి రైతులకు రెట్టింపు ఆదాయం కల్పిస్తామన్నారు. ఏటా రెండు కోట్ల మందికి ఉపాధి కల్పిస్తామని మోడీ హామీ ఇచ్చారు. వీటిలో ఏ ఒక్కటీ నెరవేరలేదు. ప్రతి ఒక్కరికీ ఇల్లు కట్టిస్తామన్నారు. కానీ నేటికీ ప్రతి ఇద్దరిలో ఒకరికి కూడా సొంతగూడు లేదు. ఆకలిలేని భారత్‌ను సృష్టిస్తామన్నారు. కానీ ప్రపంచ ఆకలి సూచీలో భారత్ 107వ స్థానానికి దిగజారింది. స్వదేశీ పరిశ్రమలకు ప్రోత్సాహం ఇచ్చి విస్తరింపచేస్తామన్నారు. కానీ రోజుకు 270 చొప్పున ఇప్పటివరకు 8 లక్షల కంపెనీలు మూతపడ్డాయి.

దేశం ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడుతామన్నారు. ఫలితాలు చూస్తే బానిసత్వ సూచీలో ప్రపంచంలోనే భారత టాప్ ర్యాంకులో ఉంది. అన్ని దవాఖానాల్లో బెడ్లు, అంబులెన్స్ సర్వీసులు, ఆక్సిజెన్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తామన్నారు. కానీ అంబులెన్స్ సర్వీస్ లేక మరణించిన బిడ్డను భుజాన వేసుకొని కాలినడకన వెళ్లే తల్లిదండ్రుల ఉదంతాలు మీడియాలో చూశాం. ఆక్సిజన్ అందక మరణించిన వారు ఎందరో! కరోనా సమయం లో పరిస్థితి గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన పనిలేదు. వేలాది అనాథ శవాలు గంగా నదిలో తేలాయి. శ్మశాన వాటికల్లో శవాల గుట్టలను సామూహిక దహనాలు చేశారు. కోవిడ్ సమయంలో ఎందరు మరణించారో తమ వద్ద లెక్కలులేవని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు చెప్పడం మరీ విచిత్రం. మోడీ ప్రభుత్వం తొమ్మిదేళ్ల పాలన అబద్ధాలకు, దోపిడీకి, అవినీతికి, అణచివేతకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది.

మోడీ పాలన ‘అసత్యమేవ జయతే’ అన్నరీతిగా సాగుతుంది. బూటకపు వాగ్దానాలు వరద పారించారు తప్ప అవి నెరవేర్చ లేదు.ఆకలి, అవిద్య, అనారోగ్యం, రాజ్యమేలింది. మౌలిక సదుపాయాలు కల్పన, ఉద్యోగ, ఉపాధి వంటి ప్రాథమిక సమస్యలు పరిష్కారం కాలేదు. దేశంలో శాంతి భద్రతలు క్షీణించాయి. తమ పాలనను ప్రశ్నించిన వారిని అక్రమ కేసుల్లో ఇరికించారు. జర్నలిస్టులు, కవులు, రచయితలు, కళాకారులు, మేధావులపై నాన్ బెయిల్ సెక్షన్లు విధించారు. వారిని నెలల తరబడి జైళ్ళలో నిర్బధించారు.మణిపూర్ నిత్య అగ్నిగుండమై తగలబడుతున్నది.డబుల్ ఇంజిన్ సర్కార్ మణిపూర్‌లో మౌనం దాల్చింది. విదేశీ టూర్లు, ఎన్నికల ప్రచారాలకు సమయం ఉంటుంది.బాధితులను పరామర్శించడానికి మాత్రం ప్రధానికి సమయం దొరక లేదు. మణిపూర్ తగలబడుతుంటే మోడీ చోద్యం చూస్తున్నారు. దేశ సమైక్య భావనకు తూట్లు పొడిచారు. దేశాన్ని తిరోగమన బాట పట్టించారు.

‘మేక్ ఇన్ ఇండియా’, డిజిటల్ ఇండియా, స్మార్ట్ సిటీస్, స్టార్టప్ ఇండియా, స్కిల్ ఇండియా, స్పెషల్ బీమా మొదలైన పెద్ద, పెద్ద మాటలు చెప్పారు. ప్రజల భవిష్యత్తుపై రేకెత్తించిన ఆశలు కల్లలయ్యాయి. ఆర్థిక నేరగాళ్ళను అక్కున చేర్చుకున్నారు. వారిపై చర్యలు శూన్యం. బ్యాంకు రుణాల ఎగవేతదారుల అసలూ, వడ్డీలను సైతం లక్షల కోట్లను మాఫీ చేశారు. పైగా వారికే కొత్త అప్పులు ఇవ్వాలని రిజర్వు బ్యాంక్‌పై వత్తిడి పెంచారు. తొమ్మిదేళ్లుగా గతాన్ని తవ్వడం తప్ప దేశానికి తాము ఏం చేస్తామో మోడీ చెప్పలేని దుస్థితిలోపడ్డారు. ప్రజా వ్యతిరేక, అప్రజాస్వామికి విధానాలు తప్ప నినాదాలు ప్రజాకర్షకంగా వాగ్దానాలు చేయడం, ప్రచార పటాటోపం తప్ప, ప్రజాహిత కార్యక్రమాలు ఒక్కటీ నెరవేర్చలేదు.గత కాంగ్రెస్ ప్రధానుల కంటే, మోడీ పాలనలో అద్భుత విజయాలు సాధించినట్లు, కార్పొరేట్, సోషల్ మీడియా, వాట్సాప్ యూనివర్శిటీలు చేస్తున్న అట్టహాస గ్లోబల్ ప్రచారం, ఆచరణలో ‘గోబెల్ ప్రచారమే’నని తేలిపోయింది.

పెద్దనోట్ల రద్దు, జిఎస్‌టి అమలు, పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల పెంపు, నిత్యావసర వస్తువుల ధరల మంటలతో పాటు రాజ్యాంగ హామీని ఉల్లంఘించి కశ్మీర్ విభజన, పౌరసత్వ చట్ట సవరణ, కార్మిక చట్టాల సవరణ, రైతు వ్యతిరేక వ్యవసాయ చీకటి చట్టాలతో పాటు, నిన్న మొన్నటి రాజదండం వరకు అన్నీ అప్రజాస్వామిక, రాజ్యాంగ ఆశయ స్ఫూర్తికి వ్యతిరేక చర్యలే దేశ ప్రజలు చవిచూశారు. ‘గోరక్షణ’, ‘ఘర్‌వాపసీ’, ‘లవ్ జిహాద్’ అంటూ ఆర్‌ఎస్‌ఎస్ భావజాలంతో ప్రభావితం అయిన కొందరు మైనారిటీ, దళిత, ఆదివాసీ, మహిళలను వేధించారు. ప్రత్యర్థుల ఇళ్లను నేల కూల్చారు, అక్రమ కేసులు పెట్టారు. కార్పొరేట్, వ్యాపార వర్గాల నుండి, ఇతరుల నుండి ఇతర పార్టీల కంటే అధికంగా రూ. 10 వేల కోట్లు బిజెపి పార్టీకి విరాళాలు అందాయి. అపారమైన ధనరాసులతో ఓట్లు కొనుగోలుకు వాటిని ఉపయోగించారనీ విమర్శలూ వచ్చాయి. విపక్షాల ఎంఎల్‌ఎలను నయానో, భయానో లొంగదీసుకుని విపక్షప్రభుత్వాలను అప్రజాస్వామికంగా కూల్చివేశారు. ఎన్నికల ఆర్భాట ప్రచారలకు ఆ నిధులను వాడారు. అదానీ, అంబానీ, శివనాడారం వంటి కార్పొరేట్ దిగ్గజాలే మోడీకి అత్యంతసన్నిహితులు. వారి ముందు సాధారణ ప్రజలు, రైతులు, వ్యవసాయ కార్మికులు, పారిశ్రామిక కార్మికులు అందరూ బలాదూరే.

అప్రజాస్వామికంగా ఎనిమిది బిజెపియేతర రాష్ట్ర ప్రభుత్వాలను కుట్ర, కుతంత్రాలతో కూల్చివేశారు. జమ్మూకశ్మీర్‌లకు ప్రత్యేక హోదా తొలగించారు. పౌరసత్వ సవరణ చట్టం తీసుకొచ్చారు. రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పును తుంగలో తొక్కుతూ ఢిల్లీ ప్రభుత్వంపై లెఫ్టినెంట్ గవర్నర్ పెత్తనం చేసేలా ఆర్డినెన్స్ జారీ చేయడం మోడీ ప్రభుత్వం నిరంకుశ పాలనకు నిదర్శనం. బిజెపి పాలిత రాష్రాలకు కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి నిధులను ఏకపక్షంగా కేటాయిస్తున్నది. పక్షపాత వైఖరితో దక్షణాది విపక్ష రాష్ట్ర ప్రభుత్వలకు నిధులలో కోత పెడుతున్నది. భారత సమాఖ్య వ్యవస్థ స్ఫూర్తికి ఉద్దేశపూరకంగా విఘాతం కలిగిస్తుంది. కనీసం స్వదేశీ, విదేశీ బ్యాకుల నుండి, ఆర్‌బిఐ నిబంధనలకు లోబడి, ఇతర సంస్థల నుండి రుణ సౌకర్యం పొందకుండా ఆంక్షలు విధించి రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి పథకాలపై నీళ్ళుజల్లుతున్నది. ‘రాష్ట్రాల అభివృద్ధి పైనే దేశం అభివృద్ధి’ ఆధారపడి వుంది అనే విషయాన్ని బిజెపి ప్రభుత్వం విస్మరించింది.

బిజెపి పాలనలో సమాఖ్య వ్యవస్థ స్ఫూర్తికి ఘోరంగా విఘాతం కలిగింది. విపక్ష రాష్ట్రాల్లో గవర్నర్ వ్యవస్థ అనవసర జోక్యం విమర్శలకు నిలయమైంది. మొత్తం మీద మోడీ మార్క్ పరిపాలన గత 9 ఏళ్ళలో ప్రజల ఆశలను అడియాసలు చేసింది. నమ్మకాలను వమ్ము చేసింది. ప్రజాస్వామ్య విలువలకు తిలోదకాలు ఇచ్చింది. ఆర్ధికంగా దేశం వెనకపడింది. రూపాయి విలువ ఎన్నడూ లేనంత పడిపోయింది. అప్పుల ఊబిలో దేశం కూరుకుపోయింది. కుల, మత విద్వేషాలు పెరిగాయి. ఈశాన్య రాష్ట్రాల్లో శాంతి భద్రతలు క్షీణించాయి. మీడియా స్వచ్ఛ అడుగంటింది. దేశ విదేశాలల్లో దేశ ప్రతిష్ఠ కొడిగట్టింది. పైన చర్చించిన అంశాలపై రాబోయే ఎన్నికలలో మోడీ తిరోగమన పాలనా చర్యలపై ప్రజా తీర్పు ఎలా ఉంటుందో వేచి చూడాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News