Friday, November 15, 2024

ప్రశాంతంగా టీచర్ ఎంఎల్‌సి ఎన్నిక

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో టీచర్ ఎంఎల్‌సి పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఉమ్మడి హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ ఉపాధ్యాయ ఎంఎల్‌సి స్థానానికి 90.40 శాతం పోలింగ్ నమోదైంది. సోమవారం ఉదయం 8 గంటలకు నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ కొనసాగింది. ఆ సమయానికి క్యూలైన్లలో ఉన్నవారంతా ఓటుహక్కు వినియోగించుకునేందుకు అధికారులు అవకాశం కల్పించారు. దాదాపు అన్ని పోలింగ్ కేంద్రాల్లోనూ ఓటింగ్ ప్రక్రియ సజావుగా సాగినట్లు అధికారులు వెల్లడించారు. మధ్యాహ్నం 2 గంటలు వరకు 75శాతం ఓటింగ్ నమోదు కాగా, సాయంత్రం 4 గంటల వరకు దాదాపు 90.40 శాతం పోలింగ్ నమోదైనట్లు వెల్లడించారు. ఈ స్థానానికి 2017 ఎన్నికల్లో ఈ స్థానానికి 14 మంది పోటీ చేయగా.. ఈసారి 21 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు.

పోలింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాత బ్యాలెట్ బాక్సులకు సరూర్‌నగర్‌లోని ఇండోర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్‌కు తరలించారు. ఈ స్థానానికి పిఆర్‌టియుటిఎస్ తరపున గుర్రం చెన్నకేశవరెడ్డి పోటీ చేయగా, పిఆర్‌టియు తెలంగాణ సంఘం తరపున సిటింగ్ ఎంఎల్‌సి కాటేపల్లి జనార్ధన్‌రెడ్డి పోటీకి దిగారు. టిఎస్‌యుటిఎఫ్ తరపున మాణిక్‌రెడ్డి, ఎస్‌టియుటిఎస్ తరపున భుజంగరావు పోటీ చేశారు. స్వతంత్ర అభ్యర్థిగా తెలంగాణ స్కూల్, టెక్నికల్ కాలేజెస్ ఎంప్లాయిస్ అసోసియేషన్ అధ్యక్షుడు అయినేని సంతోష్ కుమార్ పోటీకి దిగారు. బిజెపి పార్టీ తరపున ఎవిఎన్‌రెడ్డి, టిసిటిఎ తరపున ఎస్.విజయ్‌కుమార్‌లు పోటీలో ఉన్నారు.

ఓటు హక్కు వినియోగించుకున్న నేతలు

ఉపాధ్యాయ ఎంఎల్‌సి ఎన్నికలో ఉపాధ్యాయ సంఘాల నేతలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పిఆర్‌టియుటిఎస్ రాష్ట్ర అధ్యక్షులు పింగిలి శ్రీపాల్‌రెడ్డి, ఆయన సతీమణి డాక్టర్ నవత, ప్రధాన కార్యదర్శి బీరెల్లి కమలాకర్‌రావులు కాచిగూడలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీ కేంద్రంలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అలాగే టిఎస్‌యుటిఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చావ రవి, జంగయ్యలు ముషీరాబాద్ పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు.

పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించిన తనిఖీ చేసిన సిఇఒ

రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి(సిఇఒ) వికాస్‌రాజ్ సోమవారం బంజారాహిల్స్‌లోని పోలింగ్ కేంద్రాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలింగ్ కేంద్రంలోని ఏర్పాట్లను పరిశీంచారు. పోలింగ్ ఏజెంట్‌లతో మాట్లాడి ఓటరు గుర్తింపులో ఏమైనా ఇబ్బందులు తలెత్తుతున్నాయా అని అడిగి తెలుసుకున్నారు. ఎన్నిక నిర్వహణలో ఎటువంటి సమస్యలు తలెత్తినా వెంటనే ఉన్నతాధికారులను సంప్రదించాలని సిబ్బందికి సూచించారు.

16న కౌంటింగ్

మహబూబ్‌నగర్ రంగారెడ్డి హైదరాబాద్ ఎంఎల్‌సి ఎన్నిక ఓట్ల లెక్కింపు ఈ నెల 16వ తేదీన చేపట్టనున్నారు. సరూర్‌నగర్‌లోని ఇండోర్ స్టేడియంలో ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News