Thursday, January 23, 2025

వచ్చే ఎన్నికల్లో బిఆర్‌ఎస్‌కు 90 సీట్లు

- Advertisement -
- Advertisement -
  • ప్రజాస్వామ్యంలో ఎవరైనా సీట్లు అడుగుతారు
  • కల్వకుర్తి అభివృద్ధి జరగాలంటే సిట్టింగ్ ఎమ్మెల్యేను మార్చాలి
  • కసిరెడ్డికి టికెట్ ఇవ్వకపోతే అభ్యర్థిని ఓడిస్తాం
  • అధిష్టానానికి మాజీ మంత్రి చిత్తరంజన్ దాస్ అల్టిమేటం

 కల్వకుర్తి రూరల్: వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బిఆర్‌ఎస్‌కు 90 సీట్లు రావడం ఖాయమని మాజీ మంత్రి చిత్తరంజన్ దాస్ అన్నారు. గురువారం కల్వకుర్తిలోని ఆయన నివాసంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఎవరైనా సీట్లు అడుగుతారని అన్నారు.

కల్వకుర్తి అభివృద్ధి జరగాలంటే సిట్టింగ్ ఎమ్మెల్యేను మార్చాలని అన్నారు. రెండుసార్లు ఎమ్మెల్యేగా ఒకసారి ఉమ్మడి రాష్ట్రానికి మంత్రిగా చేసిన నేను ఎవరికి భయపడనని అన్నారు. నన్ను ఎవరైనా అవమాన పరిస్తే గ్రూపులు కడుతామని పేర్కొంటూ కసిరెడ్డికి టికెట్ ఇవ్వకపోతే కల్వకుర్తి పార్టీ అభ్యర్థిని ఓడిస్తామని అధిష్టానానికి మాజీ మంత్రి చిత్తరంజన్ దాస్ అల్టిమేటం జారీ చేశారు. రాష్ట్రంలో సిఎం నాయకత్వంలో బిఆర్‌ఎస్ గెలుస్తుందని పేర్కొన్నారు.

సిఎం కెసిఆర్ చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు పార్టీ అభ్యర్థులను గెలిపిస్తాయని, రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు. కాంగ్రెస్, బిజెపి పార్టీల పని అయిపోయిందన్నారు. కెసిఆర్ నాయకత్వంలో ఉచిత కరెంట్, సబ్సిడీ, రుణమాఫీ, ప్రాజెక్టులు పూర్తి, లక్షల ఎకరాలకు నీళ్లు వస్తున్నాయని పేర్కొంటూ రైతుల సుభిక్షంగా ఉన్నారని అన్నారు. రాష్ట్రంలో ప్రజల ఆదాయం, సంపద పెరిగిందని సిఎంపై ప్రజలకు సంపూర్ణ విశ్వాసం ఉందని అన్నారు.

కల్వకుర్తిలో కుంటుపడిన అభివృద్ధి

కల్వకుర్తి నియోజకవర్గం అభివృద్ధిలో వెనుకబాటుకు గురైందని మాజీ మంత్రి చిత్తరంజన్ దాస్ అన్నారు. ఎత్తిపోతల పథకం ద్వారా కల్వకుర్తి సస్యశ్యామలం అయిందని అనడంలో వాస్తవం లేదని, కెఎల్‌ఐ కోసం కసిరెడ్డి నారాయణ రెడ్డి కష్టపడ్డారని ఆయన అన్నారు. కల్వకుర్తిని అభివృద్ధి చేయమంటున్న అంతే గాని వ్యక్తిగతంగా నేను ఎవరికి విమర్శించనని అన్నారు. కొంత మంది పత్రిక సమావేశాల్లో నాపై విమర్శలు గుప్పిస్తున్నారని, తాను స్థానికుడినని, ఇక్కడే పుట్టినవాడినని, ఎవరికి భయపడనని మాజీ మంత్రి తెలిపారు.

కల్వకుర్తిలో త్వరలో సమావేశం ఏర్పాటు చేస్తా

కల్వకుర్తి నియోజకవర్గంలో బిఆర్‌ఎస్ గెలుపు కోసం త్వరలో సమావేశాలు ఏర్పాటు చేస్తున్నామని మాజీ మంత్రి అన్నారు. కల్వకుర్తి నియోజకవర్గంలో అవినీతి రాజ్యం ఏలుతోందని, అసైన్డ్ భూములను పట్టాలుగా మార్చి రియల్ వ్యాపారం చేస్తున్నారని అన్నారు. కల్వకుర్తిలో అభివృద్ధి జరగడం లేదని గతంలో సిఎం దృష్టికి తీసుకెళ్లామని, కల్వకుర్తిలో త్వరలో బహిరంగ సభ నిర్వహిస్తామని తెలిపారు. చెప్పిన వారికి బిఆర్‌ఎస్ టికెట్ ఇవ్వకపోతే అభ్యర్థిని ఓడిస్తామని అన్నారు. విలేకరుల సమావేశంలో మాజీ సర్పంచ్ ప్రభాకర్ రెడ్డి, రామాంజనేయులు, శేఖర్ గౌడ్, డేరంగుల రాము, శశి గౌడ్ తదితరులు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News