Thursday, December 26, 2024

నడిరోడ్డుపై 90 ఏళ్ల పద్మశ్రీ గ్రహీత

- Advertisement -
- Advertisement -

90-Year-Old Padma Awardee Evicted From Govt Housing

ప్రభుత్వవసతి ఖాళీ చేయించిన కేంద్రం

న్యూఢిల్లీ : గడువు పూర్తయినా ప్రభుత్వ వసతి గృహంలో ఉంటోన్న 90 ఏళ్ల ఒడిస్సీ నృత్య కళాకారుడు , పద్మశ్రీ అవార్డు గ్రహీతను హఠాత్తుగా ఖాళీ చేయించడంతో ఆయన నడిరోడ్డుపై నిలబడాల్సి వచ్చింది. దీనిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కేంద్రానికి కళాకారులంటే గౌరవం లేదని నృత్యకారుడి కుమార్తె ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రముఖ నృత్య కళాకారుడు గురు మయధర్ రౌత్ గత కొన్నేళ్లుగా ఢిల్లీ లోని ఏషియన్ గేమ్స్ విలేజ్‌లో ప్రభుత్వం కేటాయించిన ఒక వసతి గృహంలో ఉంటున్నారు. ఆయనతోపాటు పలువురు కళాకారులకు చాలా ఏళ్ల క్రితమే ఈ వసతులు కేటాయించగా, 2014 లో వీటిని రద్దు చేశారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. దీంతో ఈ కళాకారులంతా కోర్టును ఆశ్రయించినా ఫలితం లేకపోయింది. దీంతో వీరిలో చాలా మంది తమ బంగళాలను ఖాళీ చేసి వెళ్లి పోయారు. మిగిలిన వారు ఏప్రిల్ 25 లోగా ఖాళీ చేయాలని అధికారులు ఆదేశించారు. అయితే మయధర్ రౌత్ వెళ్లకపోవడంతో అధికారులే స్వయంగా వచ్చి ఖాళీ చేయించారు. ఇంట్లోని సామాన్లంతా వీధిలో పెట్టడంతో ఆ వృద్ధ కళాకారుడు నడిరోడ్డుపై నిలబడాల్సి వచ్చింది. ఆయనకు ఇచ్చిన పద్మశ్రీ పురస్కారపత్రం కూడా రోడ్డుపై కన్పించిన దృశ్యాలు వైరల్ అయ్యాయి.

దీంతో పెద్ద ఎత్తున కేంద్రం తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ ఘటనపై మయధర్ కుమార్తె మధుమితా రౌత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇల్లు ఖాళీ చేయించడం చట్టపరంగా సరైందే అయినప్పటికీ అధికారులు ప్రవర్తించిన తీరు అభ్యంతరకరమని మండిపడ్డారు. మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో మా నాన్నకు భోజనం పెడుతున్న సమయంలో అధికారులు వచ్చి బయటకు పొమ్మన్నారని, రెండు నిమిషాల సమయం కూడా ఇవ్వలేదని, ఆ వెంటనే పోలీసులు , కూలీలు వచ్చి చూస్తుండగానే సామాన్లన్నీ వీధిలో పడేశారని వివరించారు. ఇదంతా చూసి నాన్న షాక్ అయ్యారని, అదృష్టవశాత్తు ఆ సమయంలో తాను అక్కడే ఉన్నానని, లేదంటా నాన్న చనిపోయేవారే అని బాధపడ్డారు. ఆయనకు ఎలాంటి ఆస్తులు లేవు. ఇలాంటి ఘటన ప్రపంచంలో ఎక్కడైనా జరుగుతుందా ? అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అయితే దీనిపై కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ సీనియర్ అధికారి స్పందిస్తూ ఇళ్లు ఖాళీ చేయని మరో 8 మంది కళాకారులకు మే 2 వరకు గడువు ఇచ్చినట్టు చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News