Wednesday, January 22, 2025

దేశంలో మళ్లీ కరోనా సునామీ

- Advertisement -
- Advertisement -

90928 new covid cases reported in india

ఒక్క రోజే 90 వేలకు పైగా పాజిటివ్‌లు
తొమ్మిది రోజులోల్లనే 10 రెట్లు పెరిగిన కేసులు
2,630కి చేరిన ఒమిక్రాన్ బాధితులు

న్యూఢిల్లీ: దేశంలో మరోసారి కరోనా ఉగ్రరూపం దాల్చుతోంది. తొమ్మిది రోజుల వ్యవధిలో కేసులు 10 రెట్లు పెరిగి మహమ్మారి పంజా విసిరింది. డిసెంబర్ 28న దాదాపు 9 వేల కేసులు ఉండగా బుధవారం 90 వేలకు పైగా కేసులు వెలుగు చూశాయి. ముందురోజుకంటే 56 శాతం అధికంగా కేసులు బయటపడ్డాయి. కొత్తగా ప్రపంచ దేశాలను వణికిస్తున్న ఒమిక్రాన్ వేరియంట్ భారత్‌లో మూడో వేవ్‌కు ఆజ్యం పోస్తోంది. ప్రస్తుతం ఆ వేరియంట్‌లో గుర్తించిన కేసులు 2,630కి చేరాయి. కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ మేరకు గురువారం గణాంకాలను విడుదల చేసింది. బుధవారం 14,13,030 మంది కరోనా పరీక్షలు చేయించుకోగా 90,928 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.

గత ఏడాది రెండో వేవ్ ఉధృతి తగ్గుముఖం పడుతున్న సమయంలో జూన్ నెలలో ఈ స్థాయిలో కేసులు నమోదయ్యాయి. దీంతో రోజువారీ పాజిటివిటీ రేటు ఒక్క సారిగా 6.43 శాతానికి పెరిగిపోయింది. మహారాష్ట్రలో 26 వేలు, పశ్చిమ బెంగాల్‌లో 14 వేలు, ఢిల్లీలో 10 వేలకు పైగా కేసులు వచ్చాయి. మొత్తం కేసులు 3.51 కోట్లకు చేరాయి. తాజాగా వైరస్ బారిన పడి 325 మంది ప్రాణాలు కోల్పోయారు. యాక్టివ్ కేసుల సంఖ్య 2.85 లక్షలకు పెరిగింది. కాగా మరోవైపు దేశంలో ఒమిక్రాన్ శరవేగంగా వ్యాప్తి చెందుతోంది. మెట్రో నగరాల్లో 50 శాతానికి పైగా కేసులు ఈ వేరియంట్‌కు చెందినవేనని నిపుణులు భావిస్తున్నారు. గణాంకాల్లో చూపిన దానికన్నా ఈ వేరియంట్ కేసులు ఎన్నో రెట్లు అధికంగా ఉంటాయని అంటున్నారు. బుధవారం కొత్తగా 495 మంది ఈ వేరియంట్ బారిన పడ్డారు.

దీంతో ప్రస్తుతం ఈ కేసుల సంఖ్య 2,630కి చేరింది. మహారాష్ట్రలో అత్యధికంగా 796 కేసులండగా, ఢిల్లీలో 465, రాజస్థాన్‌లో 236, కేరళలో 234, కర్నాటకలో 226, గుజరాత్‌లో 204, తమిళనాడులో 121 మందికి ఈ కొత్త వేరియంట్ సోకింది. మరో పక్క టీకా కార్యక్రమం శరవేగంగా సాగుతోంది. ఒమిక్రాన్ వేళ ఇదొక్కటే ఊరటనిచ్చే అంశం. ఈ నెల3నుంచి 15 18 ఏళ్ల మధ్య పిల్లలకు కూడా టీకా అందిస్తున్నారు. గడచిన మూడు రోజుల్లో కోటి మందికి పైగాఈ వయసు పిల్లలు టీకా తీసుకున్నారు. బుధవారం ఒక్క రోజే 91 లక్షల మంది టీకా తీసుకున్నారు. ఇప్పటివరకు 148 కోట్లకు పైగా టీకా డోసులు పంపిణీ అయ్యాయి.

రాజస్థాన్ సిఎం, ఇద్దరు కేంద్ర మంత్రులకు కరోనా

రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోట్ కరోనా బారిన పడ్డారు.గురువారం సాయంత్రం పరీక్షలు చేయించుకోగాకరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లు ట్విట్టర్‌లో వెల్లడించారు. స్వల్ప లక్షణాలు మాత్రమే ఉన్నాయని, తనను కలిసిన వారంతా పరీక్షలు చేయించుకోవాలని ఆయన కోరారు. కాగా కేంద్ర మంత్రులు నిత్యానంద రాయ్, భారతీ పవార్‌లకు కూబా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. తమను కలిసిన వారంతా పరీక్షలు చేయించుకోవాలని, తగిన జాగ్రత్తలు పాటించాలని వారు ట్విట్టర్ ద్వారా కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News