Monday, December 23, 2024

పట్టు బిగించిన భారత్

- Advertisement -
- Advertisement -

అహ్మదాబాద్: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఇక్కడ జరుగుతున్న నాలుగో టెస్టు నాలుగో రోజు టీమిండియా జోరు కొనసాగించింది. విరాట్ కోహ్లీ సెంచరీ(186), ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ హాఫ్ సెంచరీ(79)తో కదం తొక్కడంతో భారీ స్కోరు చేసింది. 571 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో భారత్‌కు తొలి ఇన్నింగ్స్‌లో 91 పరుగుల ఆధిక్యత లభించింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్ రెండో ఇన్నింగ్స్‌లో 6 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 3 పరుగులు చేసింది. నైట్‌వాచ్‌మన్ మాథ్యూ కునేమాన్(0), ఓపెనర్ ట్రావిస్ హెడ్(3)క్రీజ్‌లో ఉన్నారు. ఇంకా ఆసీస్ 86 పరుగులు వెనుకబడి ఉంది. షీల్డింగ్ చేస్తుండగా గాయపడిన ఆసీస్ ఓపెనర్ ఖావాజా బ్యాటింగ్‌కు రాలేదు. గాయం తీవ్రతను బట్టి చివరి రోజు అతను ఆడతాడో లేదో అనే దానిపై క్రికెట్ ఆస్ట్రేలియా నిర్ణయం తీసుకోనుంది.

ఓవర్‌నైట్ స్కోరు 289/3తో నాలుగో రోజు ఆట ప్రారంభించిన భారత్ 309 పరుగుల వద్ద జడేజా(28) వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత మరో వికెట్ తీసేందుకు ఆసీస్ ఎంత ప్రయత్నించినా సాధ్యం కాలేదు. క్రీజ్‌లో పాతుకుపోయిన విరాట్ కోహ్లీ ..శ్రీకర్ భరత్(44)కలిసి అయిదో వికెట్‌కు 88 పరుగులు జోడించారు. ఈ క్రమంలోనే మూడు సంవత్సరాల మూడు నెలల తర్వాత సెంచరీ సాధించి తన పరుగుల దాహాన్ని తీర్చుకున్నాడు. టెస్టుల్లో కోహ్లీకి ఇది 28వ సెంచరీ. శ్రీకర్ అవుటయిన తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన అక్షర్ పటేల్ ఆదినుంచీ దూకుడుగా ఆడుతూ స్కోరుబోర్డును పరుగులు పెట్టించాడు. 113 బంతులు ఆడిన అక్షర్ పటేల్ 5 ఫోర్లు, 4 సిక్స్‌లతో 79 పరుగులు చేశాడు. సెంచరీకి చేరువవుతున్న అతడ్ని స్టార్క్ బౌల్డ్ చేశాడు. అక్షర్ అవుటయిన తర్వాత వచ్చిన చివరి బ్యాటర్లు ఎవరూ బంతిపై ప్రభావం చూపించలేకపోయారు. వచ్చిన వారు వచ్చినట్లుగా పెవిలియన్ చేరారు. మరో వైపు డబుల్ సెంచరీకి చేరువైన కోహ్లీ ఆ మైలురాయిని కూడా చేరుకుంటాడని అభిమానులు భావించారు. అయితే ఆ కోరిక నెరవేరకుండానే తొమ్మిదో వికెట్‌గా వెనుదిరిగాడు.

మొత్తంగా 364 బంతులు ఎదుర్కొన్న కోహ్లీ 15 ఫోర్లతో 186 పరుగులు చేశాడు. నడుము నొప్పి మళ్లీ తిరగబెట్టడంతో శ్రేయస్ అయ్యర్ బ్యాటింగ్‌కు రాలేదు. దీంతో భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 9 వికెట్లను కోల్పోయినప్పటికీ ఆలౌట్ అయినట్లుగా పరిగణించాల్సి వచ్చింది. ఈ మ్యాచ్‌తో పాటుగా ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌కూ శ్రేయస్ ఆడడం కష్టమే. అతని స్థానంలో కెఎల్ రాహుల్ ఫీల్డింగ్ చేశాడు. ఆసీస్ బౌలర్లలో నాథన్ లయాన్, టాడ్ మర్ఫీ చెరి మూడేసి వికెట్లు పడగొట్టగా మిచెల్ స్టార్క్, కునెమన్ చెరో వికెట్ తీశారు.

చరిత్ర సృష్టించిన లయాన్

కాగా ఈ మ్యాచ్‌లో నాథన్ లయాన్ చరిత్ర సృష్టించాడు. భారత గడ్డపై అత్యధిక వికెట్లు తీసిన విదేశీ బౌలర్‌గా ఇంగ్లండ్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ డెరిక్ అండర్‌వుడ్ (16 టెస్టుల్లో 64 వికెట్లు) పేరిట ఉన్న రికార్డును తిరగ రాశాడు. కెఎస్ భరత్ వికెట్‌ను పడగొట్టడం ద్వారా అతను ఈ రికార్డు సృష్టించాడు.

తొలి సెషన్ కీలకం
ఇక ఇప్పుడు భారమంతా భారత బౌలర్ల చేతిలోనే ఉంది. ప్రస్తుతం 86 పరుగులు వెనుకబడి ఉన్న ఆసీస్‌ను చివరి రోజు త్వరగా ఔట్ చేయగలిగితే మ్యాచ్ భారత్ చేతిలోకివస్తుంది. దీంతో సోమవారం ఆట తొలిసెషన్ కీలకంగా మారునుంది. ఆసీస్‌ను 150 పరుగుల లోపే కట్టడి చేయగలిగితే భారత్ విజయం సాధించడం సులువవుతుంది. అప్పుడు శ్రీలంకన్యూజిలాండ్ సిరీస్‌తో సంబంధం లేకుండా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్‌కు భారత్ నేరుగా అర్హత సాధిస్తుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News